సురేశ్‌ రైనా రీ ఎంట్రీ అందుకే!

Suresh Raina Looks To Inspire Tri Series In Sri Lanka - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో సురేశ్‌ రైనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్యాట్‌తో మెరుపులు మెరిపించే సత్తాతో పాటు అవసరసమైన సందర్భాల్లో పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా అవతారమెత్తి వికెట్లను సాధించే ఆటగాడు రైనా.  దాంతో పాటు చురుకైన ఫీల్డర్‌ కూడా. మెరుపు ఫీల్డింగ్‌తో అనేక అద్భుతమైన క్యాచ్‌లను అందుకుని మ్యాచ్‌ను టర్న్‌ చేసిన ఘనతలు ఎన్నో. మరొకవైపు రెండు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు సురేశ్ రైనా. దశాబ్ధ కాలంలో ఎన్నో అవార్డులు, మరెన్నో మైలురాళ్లను రైనా సాధించాడు. కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న రైనా.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్‌లో రాణించి మిగతా యువ క్రికెటర్లకు సవాల్‌ విసిరాడు.

టీమిండియా క్రికెట్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆల్‌రౌండర్ సురేశ్‌ రైనా, ప్రస్తుతం జట్టులో స్థానం కోసం పోరాటం చేస్తున్నాడు. ఇతని దృష్టి మొత్తం 2019 ప్రపంచకప్‌పైనే ఉంది అప్పటికి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకోవాలనేది అతని లక్ష్యం. ఆ క్రమంలోనే సఫారీలతో టీ20 సిరీస్‌లో రైనా తన మార్కు ఆటను చూపెట్టాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 15, 31, 43 స్కోర్లు సాధించాడు. అంతేకాదు భారత జట్టు టీ 20 సిరీస్‌ను గెలవడంలో కీలక  పాత్ర పోషించాడు. ఇప్పుడు శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌లో రాణించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. ఆ సిరీస్‌లో రైనా కొన్ని భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే అతని స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు.

ఒక 'స్పెషల్‌' బ్యాట్స్‌మన్‌..

రైనా కచ్చితంగా ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ అనడంలో సందేహం లేదు. టీ 20ల్లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌ రైనా కాగా, టీ 20 వరల్డ్‌ కప్‌లో శతకం సాధించిన మొదటి క్రికెటర్‌ కూడా. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొదటి భారత ఆటగాడు కూడా రైనానే. ఇక వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో సెంచరీలు చేసిన తొలి టీమిండియా క్రికెటర్‌ ఘనత రైనా సొంతం. ఇవన్నీ రైనా తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడానికి ఉపయోగపడ్డాయనే చెప్పాలి.

రైనా పునరాగమనం అందుకే?

భారత జట్టులో రిజర్వ్‌ బెంచ్‌ సత్తా బలంగా ఉన్నప్పటికీ రైనాకు మరో అవకాశం ఇవ్వడానికి కారణం మాత్రం వచ్చే వరల్డ్‌ కప్‌కు ముందుగా చేసిన ప్రయోగంగానే కనబడుతోంది. సఫారీలతో సిరీస్‌లో రైనా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే రైనా రీ ఎంట్రీకి ముందు కోహ్లినే ఈ స్థానంలో బరిలోకి దిగేవాడు. అయితే రైనాను మూడో స్థానంలో బరిలోకి దింపి, కోహ్లి నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే మన బ్యాటింగ్‌ విభాగం మరింత బలపేతమవుతుందనేది టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆలోచన. గత కొంతకాలంగా నాల్గో స్థానంలో టీమిండియా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రధానంగా ఈ స్థానంలో అజింక్యా రహానే, మనీష్‌ పాండేలతో పాటు పలువురు ఆటగాళ్లను పరీక్షించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ క్రమంలోనే రైనా పునరాగమనం ఈజీ అయ్యింది. మూడో స్థానంలో రైనా బ్యాటింగ్‌కు వస్తే, నాల్గో స్థానంలో పరుగుల మెషీన్‌ కోహ్లి ఉండనే ఉన్నాడు. ఈ రెండు స్థానాలను పటిష్టం చేస్తే ఏడో స్థానం వరకూ మన బ్యాటింగ్‌కు ఢోకా ఉండదు.

ఇక ఐదో స్థానంలో కూడా రైనా బ్యాటింగ్‌ అతికినట్లు సరిపోతుంది. ఇక్కడ కూడా భారత బ్యాటింగ్‌లో కొద్దిపాటి వైఫల్యం కనబడుతోంది. ఆ నేపథ్యంలో వరల్డ్‌ కప్‌ నాటికి రైనాను ప్రయోగిద్దామనే కారణంతో అతనికి జాతీయ జట్టులో మరొకసారి చోటు కల్పించారనేది కాదనలేని వాస్తవం. మరి ఈ ప్రయోగంలో రైనా సక్సెస్‌ అవుతాడా..లేదా అనేది మరికొన్ని మ్యాచ్‌ల్లో స్పష్టత వస్తుంది. ఈ క్రమంలోనే శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ 20 సిరీస్‌ రైనా ఒక సవాల్‌. ఇక్కడ రాణిస్తే వన్డే జట్టులోకి రావాలన్న రైనా ఆకాంక్ష నెరవేరడమూ ఖాయమే. ఆల్‌ ది బెస్ట్‌ టూ రైనా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top