న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు ఓ మాదిరిగా ఆడుతోంది.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు ఓ మాదిరిగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 67 ఓవర్లలో ఏడు వికెట్లకు 264 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో 23 ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (111 బంతుల్లో 63 బ్యాటింగ్; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... చమీర పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.
121 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును మాథ్యూస్, సిరివర్ధన (81 బంతుల్లో 62; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) అద్భుతంగా ఆదుకున్నారు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 138 పరుగులు జత చేశారు. గతంలో కివీస్‌పై ఈ వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. బౌల్ట్, సౌతీలకు రెండేసి వికెట్లు దక్కాయి.