మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌

Special Story About Diver Louganis - Sakshi

వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో అరుదైన ‘డబుల్‌’

మెరుపు విన్యాసాలతో చరిత్ర పుటల్లోకి  

గాయమైతే విలవిల్లాడుతాం. తీవ్రత ఎక్కువై రక్తం చిందితే తట్టుకోలేం. కుట్లు పడితే మాత్రం ఆసుపత్రి పాలవుతాం. కానీ పతకం కోసం లగెత్తుకొని వచ్చి పోటీపడం కదా! అదేంటో అమెరికన్‌ డైవర్‌ గ్రెగ్‌ లుగానిస్‌ తలకు ఐదు కుట్లు పడినా... పోటీకి దూరం కాలేదు. పసిడి పట్టు వీడలేదు. అందుకే అలనాటి ఈ విఖ్యాత డైవర్‌ను ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ అంటారు. తను ఎంచుకున్న ఆట కోసం పొంచివున్న ముప్పును కూడా లెక్కచేయని అంకితభావం లుగానిస్‌ది.

అమెరికా సూపర్‌ డైవర్‌ లుగానిస్‌ విశ్వక్రీడల్లో బంగారు పతకాలతో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ అయ్యాడు. కానీ ఇతని బాల్యం గురించి తెలిసినా... చదివినా... అదేంటి అన్ని లోపాలే ఉన్నాయి కదా అంటారు. అనారోగ్య సమస్యలు, బాల్యం నుంచే అవలక్షణాలు... మరి ఇలాంటి కుర్రాడు పెద్దయ్యాక జులాయి కావాలి. అదేంటో లుగానిస్‌ మాత్రం నాలుగుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ అయ్యాడు. డైవింగ్‌లో అతని సంచలన ప్రదర్శన, పతకాలు దిగ్గజ హోదాను కట్టబెట్టాయి.

3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డు, 10 మీటర్ల ప్లాట్‌ఫామ్‌ డైవింగ్‌లో లుగానిస్‌ కొన్ని దశాబ్దాల క్రితం నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. 1984 లాస్‌ఏంజెలిస్, 1988 సియోల్‌ వరుస ఒలింపిక్స్‌ క్రీడల్లో ఈ రెండు ఈవెంట్లలో టైటిళ్లు నిలబెట్టుకున్న ఏకైగా డైవర్‌ లుగానిసే! ఒలింపిక్స్‌లోనే కాకుండా 1978, 1982, 1986 ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఐదు స్వర్ణాలు, పాన్‌ అమెరికా క్రీడల్లో ఆరు పసిడి పతకాలు, ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో రెండు స్వర్ణాలు గెల్చుకున్నాడు.

పసిడి ముందు కుట్లు ఓ లెక్కా... 
అది 1988 సంవత్సం. సియోల్‌లో ఒలింపిక్స్‌ జరుగుతున్నాయి. 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌ హీట్స్‌లో ఎనిమిది రౌండ్లు ముగియగా లుగానిస్‌ 8 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నాడు. ఇక ‘రివర్స్‌’ డైవింగ్‌ ప్రయత్నంలో ఉన్నాడు. తన పైక్‌ పొజిషన్‌ నుంచి మెరుపు విన్యాసానికి డైవ్‌ చేయగా అతని తల వెనుకభాగం బోర్డును బలంగా తాకింది. అమెరికా జెండాలు పట్టుకొని జయజయధ్వానాలు చేస్తున్న వారంతా అవాక్కయ్యారు. అయ్యో అన్నారు. తను మాత్రం రక్తం చిందే తలతోనే పోటీని నెట్టుకొచ్చాడు. మొత్తానికి అతని విన్యాసం ఫైనల్‌కు చేర్చింది. అతనేమో ఆస్పత్రికెళ్లి తలకు ఐదు కుట్లు వేయించుకున్నాడు.

దీంతో 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన లుగానిస్‌ ఫైనల్లో డైవ్‌ చేస్తాడని ఎవరికీ అంచనాల్లేవ్‌. కానీ అతనొచ్చాడు. తన టైటిల్‌ నిలబెట్టుకునేందుకు! ఇది చాలా రిస్క్‌ అని వారించినా, విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ఎవరి మాటా వినలేదు. 12 మంది డైవర్లు తలపడిన ఫైనల్‌ జాబితాలో 10వ స్థానంలో ఉన్న ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ పోటీలు ముగిసేసరికి అగ్రస్థానంలోకి వచ్చాడు. రజతం, కాంస్యం కూడా కష్టమే అన్నవాళ్లంతా నోరెళ్లబెట్టేలా వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించాడు.

మైనర్‌ తల్లిదండ్రులు వద్దనుకుని... 
1960 జనవరి 29న అమెరికాలోని కాలిఫోర్నియాలో సమోవా, స్వీడన్‌ దేశాలకు చెందిన 15 ఏళ్ల మైనర్‌ తల్లిదండ్రులకు లుగానిస్‌ జన్మించాడు. ఆ మైనర్‌ తల్లిదండ్రులు లుగానిస్‌ను వద్దనుకొని దత్తత కేంద్రంలో వదిలేసి వెళ్లారు. తొమ్మిది నెలల లుగానిస్‌ను పీటర్, ఫ్రాన్సెస్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. బాల్యంలో లుగానిస్‌ను ఆస్తమా, అలర్జీలు ఊపిరి సలపకుండా చేశాయి. ఏదీ తలకెక్కించుకునే వాడు కాదు. అందుకే ఎవరికీ అంతుచిక్కని వాడిగా ముద్రపడింది. ఆడిపాడే బాల్యంలోనే ఒంటరితనం అనుభవించాడు. అందుకేనేమో తొమ్మిదేళ్లకే సిగరెట్‌ తాగడం, ఆ వెంటనే మందు కొట్టడం మొదలెట్టాడు. టీనేజ్‌లో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. మూడుసార్లు ఆత్మహత్యాయత్నాలు చేశాడు. అలా అప్పుడెప్పుడో ఓ అనామకుడిగా లోకాన్ని వీడాల్సినవాడు తర్వాత్తర్వాత అంతర్జాతీయ అథ్లెట్‌గా, దిగ్గజంగా ఎదగడం నిజంగా గొప్పవిషయం. ఇతని జీవిత చరిత్ర ‘బ్రేకింగ్‌ ద సర్ఫేస్‌’ పుస్తకంగా వచ్చింది. తర్వాత అదే పేరుతో చిత్రం కూడా వెండితెరపై అలరించింది.

అందనంత ఎత్తులో... 

బాల్యంలో ఎవరికీ అర్థంకాని కుర్రాడు... డైవింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం అద్భుతం. 16 ఏళ్ల వయసులో అమెరికా బెస్ట్‌ డైవర్‌ అయిన లుగానిస్‌... 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి 10 మీటర్ల ప్లాట్‌ఫామ్‌లో రజతం సాధించాడు. పాల్గొన్న తొలి మెగా ఈవెంట్‌లోనే రన్నరప్‌గా నిలిచిన ఈ డైవింగ్‌ సంచలనం 1984 లాస్‌ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో స్ప్రింగ్‌బోర్డ్‌ ఈవెంట్‌లో తన మెరుపు విన్యాసంతో 754.41 పాయింట్లు సాధించాడు.

రెండో స్థానంలో నిలిచిన డైవర్‌ కంటే 100 పాయింట్ల తేడాతో ముందంజలో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్లాట్‌ఫామ్‌ ఈవెంట్‌లో కూడా 710.91 పాయింట్లతో 70 పాయింట్ల తేడా కనబరచడంతో ‘ద గార్డియన్‌’ లుగానిస్‌కు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’గా కితాబిచ్చింది. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ లుగానిస్‌ తన జోరు కొనసాగించి రెండు విభాగాల్లోనూ టైటిల్స్‌ నిలబెట్టుకున్నాడు. ఒకవేళ 1980 మాస్కో ఒలింపిక్స్‌ క్రీడలను అమెరికా బహిష్కరించకపోయుంటే లుగానిస్‌ కెరీర్‌లో ‘ట్రిపుల్‌’ స్వర్ణాలు చేరి ఉండేవేమో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top