
ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు.. నకిలీది: గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డ్రీమ్ ఐపీఎల్ జట్టులో మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీకి స్థానం కల్పించలేదంటూ వచ్చిన వార్తలపై అతను వివరణ ఇచ్చాడు.
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డ్రీమ్ ఐపీఎల్ జట్టులో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి స్థానం కల్పించలేదంటూ వచ్చిన వార్తలపై అతను వివరణ ఇచ్చాడు. తాను ఎలాంటి జట్టునూ ఎంపిక చేయలేదని, తన పేరుతో ప్రకటించిన జట్టు విషయంలో తనకు సంబంధం లేదని దాదా స్పష్టం చేశాడు. ఈ టీమ్‌ను పోస్ట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ తనది కాదని, అది నకిలీదని గంగూలీ ట్వీట్ చేశాడు.
గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, స్టీవెన్ స్మిత్, ఏబీ డివిలియర్స్, నితీష్ రాణా, మనీష్ పాండే, రిషభ్ పంత్, సునీల్ నరైన్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, క్రిస్ మోరిస్ ఉన్నారు. ధోనీ టీ-20లకు పనికిరాడంటూ ఇటీవల గంగూలీ వ్యాఖ్యలు చేశాడు. దీంతో గంగూలీ తన జట్టులో కావాలనే ధోనీని విస్మరించాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దాదా వివరణ ఇచ్చి రూమర్లకు ముగింపు పలికాడు.