సింధు గెలిచింది.. భారత్‌ ఓడింది

Sindhu wins, India lose to Japan but reach quarter-finals - Sakshi

చివరి లీగ్‌లో పురుషుల, మహిళల జట్ల పరాజయం

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ 

చివరి మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో పురుషుల విభాగంలో చైనా, మహిళల విభాగంలో ఇండోనేసియాతో భారత జట్లు తలపడతాయి.  

అలోర్‌ సెటార్‌ (మలేసియా): ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు కూడా క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గురువారం గ్రూప్‌  ‘డబ్ల్యూ’లో జరిగిన లీగ్‌ పోరులో భారత్‌ 1–4తో జపాన్‌ చేతిలో కంగుతింది. ఈ పోరులో దక్కిన ఒకే ఒక్క విజయాన్ని తెలుగుతేజం సింధు అందించింది. తొలి మ్యాచ్‌లో సింధు 21–19, 21–15తో యామగుచిపై విజయం సాధించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ సింధు 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. అయితే తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఏ ఒక్కరు గెలవకపోవడంతో సింధు శ్రమ వృథా అయింది. శ్రీకృష్ణ ప్రియ 12–21, 10–21తో ప్రపంచ 13వ ర్యాంకర్‌ సయాక సాటో ధాటికి చేతులెత్తేసింది. డబుల్స్‌ స్పెషలిస్ట్‌ అయిన అశ్విని పొన్నప్ప కూడా 13–21, 12–21తో ప్రపంచ 16 ర్యాంకర్‌ అయ హొరి చేతిలో ఓడింది. దీంతో భారత ఆధిక్యం 1–2కు తగ్గింది. తర్వాత రెండు డబుల్స్‌ పోటీల్లోనూ ప్రజక్తా సావంత్‌–సంయోగిత ఘోర్పడే జోడి 17–21, 17–21తో షిహో టనక–కొహరు యోనెమొటో జంట చేతిలో... సిక్కిరెడ్డి–అశ్విని జోడి 18–21, 18–21తో మిసాకి మత్సుటొమొ–అయక తకహషి జంట చేతిలో కంగుతిన్నాయి. 

పురుషుల జట్టుకూ ఓటమి 
గ్రూప్‌–డిలో ఇదివరకే క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన భారత పురుషుల జట్టు చివరి పోరులో 2–3తో ఇండోనేసియా చేతిలో ఓడింది. మొదటి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌కు 17–21, 17–21తో జొనాథన్‌ క్రిస్టీ చేతిలో చుక్కెదురైంది. తర్వాత డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి ద్వయం 18–21, 21–18, 24–22తో అహ్‌సాన్‌–సంజయ సుకముల్జో జోడీపై గెలిచింది. రెండో సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 21–18, 21–19తో ఆంథోని సినిసుకపై గెలుపొందగా... రెండో డబుల్స్‌లో అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ జంట 21–14, 16–21, 12–21తో అంఘ ప్రతమ–రియాన్‌ సపుత్రో జోడీ చేతిలో, మూడో సింగిల్స్‌లో సుమిత్‌ రెడ్డి 12–21, 7–21తో మౌలానా ముస్తఫా చేతిలో ఓడిపోయారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top