పాతవారు కొత్తనీరు | Should players come to auction for IPL 2018? | Sakshi
Sakshi News home page

పాతవారు కొత్తనీరు

Dec 8 2017 12:37 AM | Updated on Dec 8 2017 12:37 AM

Should players come to auction for IPL 2018? - Sakshi

ఐపీఎల్‌ 2018కు ఆటగాళ్లంతా వేలానికి వస్తారా..? ఫ్రాంచైజీలు అసలెంతమందిని తిరిగి తీసుకోగలవు..? రిటెన్షన్‌ ద్వారా గరిష్టంగా ఎందరిని ఎంచుకోవచ్చు..? రైట్‌ టు మ్యాచ్‌తో వేలంలో ఎంతమందిని దక్కించుకోవచ్చు..? పాలక మండలి నిర్ణయాలతో ఈ సందేహాలన్నీ తీరిపోయాయి. కొనసాగించే (రిటెన్షన్‌) అవకాశంతో పాటు రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ద్వారా ఇప్పటివరకు తమతో ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఫ్రాంచైజీలకు దక్కింది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని అట్టిపెట్టుకునే అవకాశం ఉందో విశ్లేషణ..

చెన్నై సూపర్‌ కింగ్స్‌
రెండేళ్ల నాటి జట్టులోని ఆటగాళ్లలో ఇప్పుడు ఎవరూ ఫామ్‌లో లేకున్నా.. మొత్తం ఐపీఎల్‌లో అందరి దృష్టి సీఎస్‌కేపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. మామూలుగానైతే డబ్బు మిగుల్చుకునేందుకు ఈ ఫ్రాంచైజీ ఏ ఆటగాడినీ రిటైన్‌ చేసుకోకుండా.. ఆర్‌టీఎం ద్వారానే పొందే ఆలోచన చేయాలి. కానీ చెన్నైకి ధోనినే అతి పెద్ద బ్రాండ్‌. అతని కోసమే ఆ జట్టు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ధోనితో పాటు రైనాకు కూడా ఇదే టీమ్‌తో అనుబంధం ఉంది.  ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడే జడేజాను కూడా తీసుకోవచ్చు. ఇక అశ్విన్‌ కంటే వాషింగ్టన్‌ సుందర్‌పైన నమ్మకం ఉంచే అవకాశం ఉంది. మ్యాచ్‌ విన్నర్లుగా ఒకప్పుడు పేరున్న మెకల్లమ్, బ్రావోలను ఆర్‌టీఎం ద్వారా తీసుకుంటారా..? కొత్త ప్రతిభ వైపు మొగ్గుచూపుతారా? అనేది గమనించాల్సిన అంశం.

కొనసాగింపు:ధోని, రైనా, జడేజా
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం: మెకల్లమ్,డ్వేన్‌ బ్రావో

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
రెండుసార్లు చాంపియన్, మంచి ఆల్‌రౌండ్‌ జట్టయిన కోల్‌కతాది చిత్రమైన పరిస్థితి. మ్యాచ్‌ విన్నర్‌గా పేరొందిన రసెల్, గత ఐపీఎల్‌లో ఓపెనర్‌గానూ అదరగొట్టిన మిస్టరీ స్పిన్నర్‌ నరైన్‌ల కారణంగా ఇది ఎదురుకానుంది. వీరిద్దరిని మాత్రమే కొనసాగించి మిగిలే భారీ మొత్తాన్ని రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా కీలక ఆటగాళ్లపై వెచ్చించవచ్చు. ఇలా ఉతప్ప, మనీష్‌ పాండే, గంభీర్, క్రిస్‌లిన్‌లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. నైట్‌రైడర్స్‌ గతంలో ఆటగాళ్ల రిటైన్‌కు ఎక్కువ మొత్తం వెచ్చించలేదు. ఆర్‌టీఎం ద్వారా అయిదుగురిని ఎంచుకుంటే.. రిటైన్‌ సందర్భంగా భారీ మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి తప్పుతుంది.

కొనసాగింపు:ఆండ్రీ రసెల్,సునీల్‌ నరైన్‌
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం:క్రిస్‌ లిన్, ఉతప్ప, మనీష్‌ పాండే, గంభీర్, కుల్దీప్‌  

ముంబై ఇండియన్స్‌
ఐపీఎల్‌లో బలమైన బెంచ్‌ ఉన్న జట్టు ముంబై ఇండియన్స్‌. దీనికితగ్గట్లే మూడుసార్లు చాంపియన్‌గానూ నిలిచింది. అందుకే పాత సభ్యులనే ఎక్కువ శాతం కొనసాగించాలనుకుంటోంది. ఈ వరుసలో రోహిత్, హార్దిక్, బుమ్రాలకే మొదటి ప్రాధాన్యం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో చురుకైన కృనాల్, పొలార్డ్‌లను రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా అట్టిపెట్టుకోవచ్చు. అయితే నిర్ణీత మొత్తం రూ.80 కోట్లలో.. ఒకవేళ రోహిత్, హార్దిక్, బుమ్రాలపై రూ.33 కోట్లు వెచ్చిస్తే మిగిలిన రూ.47 కోట్లతోనే ఇతర ఆటగాళ్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇంత తక్కువ మొత్తంతో నాణ్యమైన, ముంబై స్థాయికి తగినవారు దొరకడం కష్టమే అనుకోవచ్చు.

కొనసాగింపు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా,జస్‌ప్రీత్‌ బుమ్రా
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం: కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌

ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌
విఫల జట్టుగా ముద్రపడిన ఢిల్లీ.. కొత్త శిక్షణ బృందంతో, జట్టు మార్పులతో ఈసారైనా మెరుగయ్యే ప్రయత్నం చేయనుంది. రెండు సీజన్లుగా భారత యువ ఆటగాళ్లపైనే ఎక్కువ శ్రద్ధ, డబ్బు పెట్టినప్పటికీ ఈసారి సమతూకం గురించి ఆలోచిస్తోంది. తాజా ఫామ్‌ ప్రకారం మోరిస్‌కు రూ. 12 కోట్లకంటే ఎక్కువ పలికే అవకాశం ఉండటంతో తాము కొనసాగించడమే సరైందిగా ఢిల్లీ భావిస్తోంది. కీపర్, బ్యాట్స్‌మన్‌గా ఉపయోగపడతాడు కాబట్టిరిషభ్‌ పంత్‌ను రిటైన్‌ చేసుకోవచ్చు. వేలంలో ఒకే ఆటగాడిపై పెద్దమొత్తం వెచ్చించే అలవాటున్న డేర్‌ డెవిల్స్‌.. ఈసారి ఆ ప్రభావంలో పడకుండా చూసుకోవడం ముఖ్యం.

కొనసాగింపు: క్రిస్‌ మోరిస్, రిషభ్‌ పంత్‌
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం: డికాక్, కమిన్స్, రబడ, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
ఆర్‌సీబీకి కోహ్లి, డివిలియర్స్‌ విషయంలో మరో ఆలోచన ఉండకపోవచ్చు. వీరిద్దరే 2016లో జట్టును ఫైనల్‌కు తీసుకొచ్చారు. వ్యాపార కోణంలో చూసినా కోహ్లి పెద్ద బ్రాండ్‌. ఇక చహల్‌ను రూ.7 కోట్లతో రిటైన్‌ చేసుకుంటుందో లేక ఆర్‌టీఎంను వినియోగిస్తుందో చూడాలి. మరీ ముఖ్యంగా క్రిస్‌గేల్‌నూ ఇలానే తీసుకుంటారా..? అనేది పెద్ద ప్రశ్న. ఫామ్‌లో లేకున్నా గేల్‌ స్థాయి దృష్ట్యా చూస్తే ఆర్‌సీబీ అతడిని చేజారనీయకుండా చూడవచ్చు.  

కొనసాగింపు: కోహ్లి, డివిలియర్స్‌
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం: చహల్, కేఎల్‌ రాహుల్, సర్ఫరాజ్‌ఖాన్‌

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 
సన్‌రైజర్స్‌దీ దాదాపు కోల్‌కతా పరిస్థితే. తిరుగులేని ఓపెనర్, విజయవంతమైన కెప్టెన్‌ వార్నర్, కొత్త బంతి, చివరి ఓవర్ల స్పెషలిస్ట్‌ భువీ, యువ స్పిన్నర్‌ రషీద్‌ ముగ్గురూ అత్యంత కీలక ఆటగాళ్లు. ఇక ధావన్, విలియమన్స్‌లను ఆర్‌టీఎం ద్వారా తీసుకోవాలనుకున్నా... ఇతర ఫ్రాంచైజీలు వారికి చెల్లించదల్చుకున్న మొత్తం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ధావన్‌పై  ప్రత్యర్థులు భారీగా పోటీ పడి ధర పెంచే అవకాశముంది.

కొనసాగింపు:డేవిడ్‌వార్నర్, భువనేశ్వర్, రషీద్‌ ఖాన్‌
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం:శిఖర్‌ ధావన్, సిరాజ్, విజయ్‌ శంకర్‌

రాజస్థాన్‌ రాయల్స్‌
నిషేధానికి పూర్వం నాటి జట్టులోని ఆటగాళ్లంతా వేర్వేరు ఫ్రాంచైజీల్లో ఉండటంతో కొత్తగా ప్రారంభించేందుకు రాజస్థాన్‌కు ఇదో మంచి అవకాశం. ఆర్‌టీఎం ద్వారా స్మిత్‌ను తీసుకుని.. దానికి తగ్గట్లుగా మిగతా జట్టును ఎంపిక చేసుకోవడం రాయల్స్‌కు మేలు చేస్తుంది. తద్వారా చేతిలో డబ్బుండి ప్రతిభ గల కొత్త కుర్రాళ్లు, టి20 స్పెషలిస్ట్‌లపై వెచ్చించే వెసులుబాటు వస్తుంది. రహానే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ కానప్పటికీ అనుభవం, దృక్పథం రీత్యా రాయల్స్‌ సారథ్యం అప్పగించవచ్చు.

కొనసాగింపు: ఎవరూ ఉండకపోవచ్చు
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం: స్టీవ్‌ స్మిత్, అజింక్య రహానే

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
పది సీజన్లలో రెండు సార్లే ప్లే ఆఫ్స్‌ చేరిన పంజాబ్‌.. ఈసారి గట్టి జట్టుతో రాత మార్చుకోవాలనుకుంటుంది. ప్రస్తుత ఆటగాళ్లెవరూ రూ.12 కోట్లకు మించి పలికే అవకాశం లేకపోవడం పంజాబ్‌కు ఓ విధంగా మంచిదే. ఆల్‌రౌండర్‌లు అయినప్పటికీ.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకున్నా.. ఆర్‌టీఎంను మ్యాక్స్‌వెల్, అక్షర్‌ పటేల్‌ల కోసం వాడుకోనుంది. పెద్దగా మార్పుల జోలికెళ్లని తమ పాత పద్ధతినే పంజాబ్‌ కొనసాగిస్తే వేలానికి భారీ మొత్తంతోనే వచ్చే అవకాశం ఉంటుంది.

కొనసాగింపు: ఎవరూ ఉండకపోవచ్చు
రైట్‌ టు మ్యాచ్‌కు అవకాశం: మ్యాక్స్‌వెల్, అక్షర్‌ పటేల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement