ధోని మళ్లీ చెన్నై ‘కింగ్‌’!

MS Dhoni's Chennai Super Kings Reunion Hinges On This year

 మరో కొత్త విధానం తెచ్చిన ఐపీఎల్‌ మండలి  

న్యూఢిల్లీ: ధోనిలాంటి స్టార్‌ ఆటగాడిని పాత ఫ్రాంచైజీ నిలబెట్టుకునేందుకు ఐపీఎల్‌ పాలక మండలి నూతన రిటెన్షన్‌ (అట్టిపెట్టుకోవడం) పాలసీని తీసుకురానుంది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో ఒకరు భారత ఆటగాడైతే... మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు. ఈ కొత్త నిబంధన వల్ల ధోని మళ్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తరఫున ఆడేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌ వర్క్‌షాప్‌లో ఫ్రాంచైజీలు ఆమోదించాల్సి ఉంది. మంగళవారం ఐపీఎల్‌ పాలక మండలి (జీసీ) సమావేశం ముగిసిన తర్వాత ఇందులో పాల్గొన్న సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ‘ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురిని తమ జట్టులో కొనసాగించవచ్చు. దీని వల్ల పుణే, గుజరాత్‌ జట్లకు ఆడిన ఆటగాళ్లు తిరిగి చెన్నై, రాజస్తాన్‌ రాయల్స్‌ గూటికి చేరొచ్చు. దీనిపై వచ్చే నెలలో ఫ్రాంచైజీ యాజమాన్యాలతో చర్చిస్తాం’ అని అన్నారు. ఇప్పటికే రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎమ్‌) రిటెన్షన్‌ విధానం ఉండటం వల్ల ఫైనల్‌గా ఇది ఎంతమందిని అట్టిపెట్టుకునేదాకా వెళుతుందనే ప్రశ్నకు ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా సమాధానమిస్తూ... ఫ్రాంచైజీల అంగీకారంతో మూడు నుంచి ఐదుగురిదాకా ఉండొచ్చని అన్నారు. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో ఫ్రాంచైజీ ఇప్పుడు వెచ్చిస్తున్న రూ. 60 కోట్ల మొత్తాన్ని రూ.75 కోట్లకు పెంచే అవకాశముందని ఆయన చెప్పారు.  

కొచ్చి టస్కర్స్‌కు భారీ  పరిహారం
వివాదాస్పద రీతిలో సస్పెన్షన్‌కు గురైన కొచ్చి టస్కర్స్‌ కేరళ జట్టుకు భారీ మొత్తంలో నష్ట పరిహారం చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మొత్తం మీద రూ. 800 కోట్ల పైచిలుకు పరిహారంగా చెల్లించనున్నట్లు ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. 2015లోనే అర్బిట్రేషన్‌ కోర్టులో కొచ్చికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పుడే రూ. 550 కోట్లను సాలీనా 18 శాతం పెనాల్టీతో చెల్లించాలని పేర్కొంది. దీంతో ఇప్పుడది భారీ మొత్తానికి చేరింది. సుప్రీం కోర్టుకు వెళ్లినా లాభం లేదని... కొచ్చితో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ మొత్తంపై స్పష్టత వస్తుందని రాజీవ్‌ శుక్లా తెలిపారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top