తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వదేశానికి..: మొయిన్‌ అలీ

A shame to be flying back early, Moeen Ali - Sakshi

బెంగళూరు: ఐపీఎల్ మధ్యలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందని ఆ జట్టు ఆల్‌ రౌండర్‌ మొయిన్‌ అలీ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌ సన్నాహకంలో భాగంగా స్వదేశానికి వెళ్లక తప్పడం లేదన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్సీబీ జట్టును వీడాల్సి వస్తుందన్నాడు. తన సహచర క్రికెటర్లను మిస్‌ అవుతున్నానంటూ మొయిన్‌ పేర్కొన్నాడు. మే30 నుంచి ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతోన్న విదేశీ క్రికెటర్లు అందరూ తమ సొంత దేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

‘మా జట్టులో ఎక్కువగా కుడి, ఎడమ బ్యాట్స్‌మెన్‌ భాగస్వామ్యం సఫలమైంది. అయితే పరిస్థితులను బట్టి ఏస్థానంలో రావడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. బ్యాటింగ్‌కు రావడం.. పరుగులు చేయడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత కోహ్లీ, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకుంటారు. డేల్‌ స్టెయిన్‌ రాక జట్టుకెంతో బలాన్ని ఇచ్చింది. పవర్‌ ప్లేలో వికెట్లు తీయడం ఏ జట్టుకైనా కీలకం. ఆ సమయంలో కనీసం నాలుగు వికెట్లు తీస్తే విజయం సులభమవుతుంది. అలా పవర్‌ ప్లేలో వికెట్లు తీసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి. పవర్‌ ప్లేలో స్టెయిన్‌ బాగా బౌలింగ్‌ చేస్తాడు. అందుకే స్టెయిన్‌ ప్రభావం జట్టుపై చాలా ఉంటుంది. బెంగళూరులో ఉన్నది చాలా చిన్న మైదానం. బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించడం పేస్‌ బౌలర్లకు చాలా కష్టమైన పని. ఒక్కసారి విజయాల బాట పడితే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు’ అని అలీ పేర్కొన్నాడు.

ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలను బెంగళూరు దాదాపు కోల్పోయింది. అయితే, అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి, వాతావరణం సహకరిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే 10 మ్యాచులాడిన ఆ జట్టు 3 విజయాలు మాత్రమే సాధించింది. ఈ రోజు బెంగళూరు వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఇది ఈ సీజన్‌లో మొయిన్‌ అలీకి చివరి మ్యాచ్‌. వరల్డ్‌కప్‌ సన్నాహకంలో భాగంగా ఐపీఎల్‌ ఆడుతున్న విదేశీ క్రికెటర్లు తమ తమ దేశాలకు పయనం కావడానికి సిద్ధమవుతున్నారు. సుమారు 18 మంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌ను వీడనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top