సెలక్టర్లు, అంపైర్ల జీతాల పెంపు! 

Selectors and umpires salary increment! - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్‌ జట్టు సెలక్టర్లు, అంపైర్లు, స్కోరర్లు, వీడియో విశ్లేషకుల జీతాలు భారీగా పెరగనున్నాయి. క్రికెట్‌ పాలకుల కమిటీ (సీవోఏ)తో పాటు సాబా కరీమ్‌ ఆధ్వర్యంలోని బీసీసీఐ క్రికెట్‌ పర్యవేక్షణ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్, సెలక్టర్లు దేవాంగ్‌ గాంధీ, శరణ్‌దీప్‌ సింగ్‌ సేవలకు ప్రతిఫలంగా పేర్కొన్నారు. ప్రస్తుతం చీఫ్‌ సెలక్టర్‌కు ఏడాదికి రూ.80 లక్షలు, మిగతా ఇద్దరికి రూ.60 లక్షల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఇకపై ఈ మొత్తం వరుసగా రూ.కోటి, రూ.75 లక్షల నుంచి రూ.80 లక్షలు కానుంది. దీంతోపాటు ఆరేళ్ల తర్వాత రిఫరీలు, అంపైర్లు, స్కోరర్లు, వీడియో విశ్లేషకుల దేశవాళీ మ్యాచ్‌ ఫీజులను పెంచారు.

ఫస్ట్‌క్లాస్, మూడు రోజుల, 50 ఓవర్ల మ్యాచ్‌కు ఇప్పుడు రూ.20 వేలు ఇస్తుండగా దానిని రెట్టింపు చేశారు. టి20 మ్యాచ్‌ ఫీజు రూ.10 వేలు ఉండగా రూ.20 వేలు ఇవ్వనున్నారు. రిఫరీలకు నాలుగు రోజుల మ్యాచ్‌కు రూ.30 వేలు, మూడు రోజుల, ఒక రోజు మ్యాచ్‌కు రూ.15 వేలు అందజేస్తారు. స్కోరర్లకు రూ.10 వేలు, వీడియో విశ్లేషకులకు ఇతర మ్యాచ్‌లకు రూ.15 వేలు, టి20లకు రూ.7,500 ఇస్తారు. అయితే... జీతాల పెంపు అంశంలో బీసీసీఐ కోశాధికారి అనిరుధ్‌ చౌధరిని పరిగణనలోకి తీసుకోకపోవడం బోర్డు పెద్దలు, సీవోఏ మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top