ఏయ్‌ సర్ఫరాజ్‌.. ప్రధాని మాట వినవా?

Sarfaraz Ahmed Ignores Pakistan PM Imran Khan Advice and Gets Trolled on Twitter - Sakshi

టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకోమన్న ఇమ్రాన్‌ఖాన్‌

ఫీల్డింగ్‌ తీసుకున్న సర్ఫరాజ్‌.. మండిపడుతున్న అభిమానులు

ఇస్లామాబాద్‌ : ‘ఏయ్‌ సర్ఫరాజ్‌.. మన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట ఖాతరు చేయవా? ఎంత పొగరు.. ఎంత కుసంస్కారం.’ అంటూ పాకిస్తాన్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ సారథిపై మండిపడుతున్నారు. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా జరిగిన దాయాదుల పోరులో భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఘోరపరాజయానికి పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజే కారణమని ఆ దేశ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు పాక్‌ ప్రధాని, మాజీ కెప్టెన్‌, ప్రపంచకప్‌ విజేత ఇమ్రాన్‌ ఖాన్‌ సూచనలను సర్ఫరాజ్‌ ఖాతరు చేయకపోవడమే వారి ఆగ్రహానికి కారణం. (చదవండి : పాక్‌ క్రికెటర్లకు ఇమ్రాన్‌ఖాన్‌ అడ్వైజ్‌ ఇదే!)

మ్యాచ్‌కు ముందు ఇమ్రాన్‌ ఖాన్‌.. పిచ్‌ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకోవాలని సూచించాడు. అలాగే స్పెషలిస్టు బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని సలహా ఇచ్చాడు. దాయాదుల పోరు సందర్భంగా ఇరుజట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్‌ ఆడుతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో కచ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. కానీ టాస్‌ గెలిచిన సర్ఫరాజ్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌ సూచనకు భిన్నంగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అభేద్యమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌ ముందు పాక్‌ బౌలర్లు చేతులెత్తాశారు. ఒక్క మహ్మద్‌ ఆమిర్‌ మినహా మిగతా బౌలర్లంతా పోటీపడి పరుగులు సమర్పించుకున్నారు. (చదవండి: భారత్‌ పరాక్రమం.. పాక్‌ పాదాక్రాంతం)

భారత హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ బ్యాట్‌కు బలయ్యారు. దీంతో భారత్‌ ఘనవిజయం లాంఛనమైంది. అయితే ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పినట్లు చేసి ఉంటే పాక్‌ మ్యాచ్‌ గెలిచేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓటమికి సర్ఫరాజే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా జోకులు.. ఫన్నీమీమ్స్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్‌ ఎంచుకోవాలని కోహ్లి-ధోని మాట్లాడుతుండగా సర్ఫరాజ్‌ రహస్యంగా విని ఈ నిర్ణయం తీసుకున్నాడని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. క్రికెట్‌ దిగ్గజాలు.. సచిన్‌, ఇమ్రాన్‌, వసీంలు బ్యాటింగే ఎంచుకోమని చెప్పాయని, కానీ సర్ఫరాజ్‌ వినలేదని కామెంట్‌ చేస్తున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇలానే వినకుండా ఫీల్డింగ్‌ తీసుకుని మూల్యం చెల్లించుకున్నాడని, ఇప్పుడు సర్ఫరాజ్‌ అదే పనిచేశాడంటున్నారు. ఇక విరాట్‌ కోహ్లి సైతం టాస్‌ గెలిస్తే ఫీల్డింగే ఎంచుకునేవాళ్లమని మ్యాచ్‌ అనంతరం తెలిపిన విషయం తెలిసిందే.(చదవండి : ఆ బంతి అత్యద్భుతం : కోహ్లి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top