సైనా శుభారంభం | Saina Nehwal, PV Sindhu win in Indonesia Open | Sakshi
Sakshi News home page

సైనా శుభారంభం

Jun 14 2017 12:24 AM | Updated on Sep 5 2017 1:31 PM

సైనా శుభారంభం

సైనా శుభారంభం

తనకెంతో కలిసొచ్చిన ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌

తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌పై గెలుపు
ప్రిక్వార్టర్స్‌లో సింధు ∙ఇండోనేసియా ఓపెన్‌ టోర్నమెంట్‌


జకార్తా: తనకెంతో కలిసొచ్చిన ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్‌ను కష్టపడి దాటింది. ప్రపంచ మాజీ చాంపియన్, ఎనిమిదో సీడ్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్‌ సైనా 17–21, 21–18, 21–12తో గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

 ఏడేళ్ల తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌–10లో చోటు కోల్పోయిన సైనా ఈ టోర్నీలో వరుసగా పదో ఏడాది బరిలోకి దిగింది. 2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగేళ్లు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన సైనా 2011లో రన్నరప్‌గా నిలిచి, మిగతా మూడేళ్లు చాంపియన్‌గా నిలిచింది. అయితే గత నాలుగేళ్లలో సెమీఫైనల్‌ రౌండ్‌ను దాటలేకపోయిన సైనాకు ఈ ఏడాదీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ నిచావోన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సైనా తలపడుతుంది. నిచావోన్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 7–0తో ఆధిక్యంలో ఉంది.

తొలి అడ్డంకిని దాటిన సింధు...
మరోవైపు నాలుగో సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు కూడా శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 33 నిమిషాల్లో 21–12, 21–19తో ప్రపంచ 20వ ర్యాంకర్‌ పోర్న్‌పవీ (థాయ్‌లాండ్‌)పై అలవోకగా గెలిచింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 10వ ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)తో సింధు తలపడుతుంది. నాలుగోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడుతోన్న సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. మిగతా రెండుసార్లు ఆమె తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 12–21, 9–21తో ఇర్ఫాన్‌ ఫదిలా–వెని అంగ్రైని (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.  

ఒలింపిక్‌ చాంపియన్‌ మారిన్‌కు షాక్‌...
మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే సంచలనం నమోదైంది. ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అన్‌సీడెడ్‌ చెన్‌ జియోజిన్‌ (చైనా) 64 నిమిషాల్లో 21–12, 10–21, 22–20తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్‌ మారిన్‌ను బోల్తా కొట్టించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మారిన్‌ 20–18తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement