విండీస్‌ నిలబడింది

Roston Chase inspires Windies to 295/7 at Stumps - Sakshi

తొలి రోజు వెస్టిండీస్‌ 295/7

ఛేజ్‌ 98 బ్యాటింగ్,హోల్డర్‌ అర్ధసెంచరీ

ఉమేశ్, కుల్దీప్‌లకు చెరో 3 వికెట్లు 

హైదరాబాద్‌లో భారత్‌తో రెండో టెస్టు   

తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆడింది 98.5 ఓవర్లే. ఈ లెక్కన హైదరాబాద్‌ టెస్టులో మళ్లీ మొదటి రోజే భారత్‌కు పట్టు చిక్కి మ్యాచ్‌ మూడో రోజే ముగించే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ వెస్టిండీస్‌ రాత మార్చుకుంది. రెండో టెస్టులో ఇప్పటికే 95 ఓవర్లు ఆడిన ఆ జట్టు 300 పరుగులకు చేరువైంది. మరో 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. రోస్టన్‌ ఛేజ్‌ శతకానికి దగ్గరలో నిలవగా... కీలక అర్ధసెంచరీతో కెప్టెన్‌ హోల్డర్‌ తన విలువ చాటాడు. మొదటి రోజును విండీస్‌ సంతృప్తిగా ముగించగా... ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేక టీమిండియా నిరాశకు గురైంది.  

సాక్షి, హైదరాబాద్‌ : ఒక సెంచరీ భాగస్వామ్యం... మరో అర్ధసెంచరీ భాగస్వామ్యం... పట్టుదల, పోరాటం... జడేజాలాంటి స్పిన్నర్‌ను సమర్థంగా ఎదుర్కొన్న తీరు... వెరసి రెండో టెస్టును వెస్టిండీస్‌ గౌరవప్రదంగా ప్రారంభించింది. భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆధిక్యం ప్రదర్శించినా... ఒక్కసారిగా చేతులెత్తేసి కుప్పకూలిపోలేదు. ఫలితంగా తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 95 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. రోస్టన్‌ ఛేజ్‌ (174 బంతుల్లో 98 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీకి చేరువ కాగా, కెప్టెన్‌ హోల్డర్‌ (92 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. కుల్దీప్‌ యాదవ్, ఉమేశ్‌ యాదవ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేజ్‌ ఇంకా క్రీజ్‌లో ఉండగా, మిగిలిన మూడు వికెట్లతో విండీస్‌ మరెన్ని పరుగులు సాధిస్తుందనేది చూడాలి.  

విండీస్‌ 113/5... 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌కు భారీ ఆరంభం ఇవ్వడంలో ఓపెనర్లు మరోసారి విఫలమయ్యారు. ఉమేశ్‌ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో ప్రారంభమైన జట్టు ఇన్నింగ్స్‌ కుదురుకుంటున్న సమయంలో అశ్విన్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ ఆడి పావెల్‌ (30 బంతుల్లో 22; 4 ఫోర్లు) వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే బ్రాత్‌వైట్‌ (14) వికెట్ల ముందు దొరికిపోయాడు. విండీస్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. శార్దుల్‌ తప్పుకోవడంతో పేస్‌ భారాన్ని మొత్తం తానే మోసిన ఉమేశ్‌ చక్కటి స్వింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టాడు. లంచ్‌కు ముందు ఆఖరి ఓవర్లో అతని బౌలింగ్‌లో షై హోప్‌ (68 బంతుల్లో 36; 5 ఫోర్లు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రెండో సెషన్‌లో తక్కువ వ్యవధిలో హెట్‌మెయిర్‌ (12), ఆంబ్రిస్‌ (18)లను కుల్దీప్‌ ఔట్‌ చేయడంతో విండీస్‌ సగం వికెట్లు కోల్పోయింది. పరిస్థితి చూస్తే విండీస్‌ మరో పతనం ఖాయమనిపించింది.  

కీలక భాగస్వామ్యాలు
ఈ దశలో రోచ్, కీపర్‌ డౌరిచ్‌ (63 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మంచి సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ చక్కటి షాట్లు కొట్టిన వీరు జడేజా బౌలింగ్‌లో చెరో సిక్సర్‌ బాదారు. ఆరో వికెట్‌కు 69 పరుగులు జత చేసిన అనంతరం ఉమేశ్‌ బౌలింగ్‌లో డౌరిచ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ముందుగా అంపైర్‌ ఔట్‌ ఇవ్వకపోయినా...భారత్‌ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది. అయితే రోచ్, హోల్డర్‌ కలిసి మరో భాగస్వామ్యాన్ని నిర్మించడంతో విండీస్‌ మెరుగైన స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో ముందుగా 80 బంతుల్లో ఛేజ్‌ అర్ధసెంచరీ పూర్తయింది. టీ తర్వాత ఈ జంట మరింత స్వేచ్ఛగా ఆడింది. స్పిన్నర్ల కోసం కొత్త బంతిని తీసుకోవడంలో ఆలస్యం చేసిన భారత్‌ చివరకు 87 ఓవర్ల తర్వాత కొత్త బంతితో ముందుకు వచ్చింది. దీనిని సమర్థంగా వాడుకున్న ఉమేశ్‌... అప్పుడే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న హోల్డర్‌ను సరిగ్గా 90వ ఓవర్‌ చివరి బంతికి పెవిలియన్‌ పంపించి భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. నిర్ణీత సమయం పూర్తి కాకపోవడంతో ఆటను కొనసాగించి వేసిన ఆ తర్వాతి ఐదు ఓవర్లలో వికెట్‌ పడకుండా విండీస్‌ జాగ్రత్తగా ఆడుకుంది. విండీస్‌ టాప్‌–8 బ్యాట్స్‌మెన్‌ కనీసం రెండంకెల స్కోరు చేయడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి కాగా... భారత్‌పై 1994 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. 

►ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అశ్విన్‌ 500  వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 

►కుల్దీప్‌ యాదవ్‌ అంతర్జాతీయ వికెట్లు. అతని అరంగేట్రం తర్వాత ఏ భారత బౌలర్‌ కూడా కుల్దీప్‌కంటే ఎక్కువ వికెట్లు తీయలేదు.  

►ఛేజ్, హోల్డర్‌ ఏడో వికెట్‌కు మూడో సారి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా రికార్డు నెలకొల్పింది.

ఖాళీ.. ఖాళీగా.. గ్యాలరీలు
భారత్, వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్టుకు ఊహించిన విధంగానే తొలి రోజు భారీ స్థాయిలో స్పందన లభించలేదు. శుక్రవారం పని దినం కావడంతో పాటు ఎండలు కూడా అభిమానులను స్టేడియం నుంచి దూరంగా ఉంచాయి. ముందుగా వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేస్తుండటం వల్ల కూడా ఫ్యాన్స్‌ అంతగా ఆసక్తి కనబర్చలేదని అర్థమవుతోంది. శని, ఆదివారాల్లో భారత్‌ బ్యాటింగ్‌కు అవకాశం ఉండటం, వారాంతం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉప్పల్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. హెచ్‌సీఏ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం ప్రేక్షకుల సంఖ్య 9,241 మాత్రమే.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top