
క్రీడా రంగంపై కరోనా వైరస్ ప్రభావం భారీగానే ఉంది. ఇప్పటికే అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. అంతేకాకుండా వరుసగా పదకొండు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్రికెట్ టోర్నీ జరగకపోవడం గమనార్హం. ఇక క్రికెట్ టోర్నీలు, ప్రాక్టీస్ సెషన్స్ లేకపోవడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఐసీసీ చేసిన పోస్ట్‌పై టీమిండియా రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
‘మీ అభిప్రాయం ప్రకారం ఫుల్ షాట్ ఆడే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు?’అంటూ అభిమానులను ప్రశ్నిస్తూ ఐసీసీ ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, హెర్షల్ గిబ్స్‌లతో పాటు టీమిండియా సారథి విరాట్ కోహ్లిలు ఉన్నారు. అయితే ఐసీసీ పోస్ట్‌కు స్పందించిన రోహిత్ ‘ఇక్కడ ఎవరు మిస్సయ్యారు? నా గెస్ ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ అంత సులభం కాదు’అంటూ రీట్వీట్ చేశారు. అయితే అది ఎవరనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈ ట్వీట్ వైరల్ కావడంతో పుల్ షాట్ ఆడటంలో రోహిత్ శర్మ ది బెస్ట్ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐసీసీ పోస్ట్‌ను షేర్ చేస్తూ రోహిత్, పాంటింగ్‌ల పేరును జతచేశాడు. కెవిన్ పీటర్సన్, రికీ పాంటింగ్‌లు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆండ్రూ హడ్సన్ పేరును ట్యాగ్ చేశారు.
Someone’s missing here ?? Not easy to work from home I guess https://t.co/sbonEva7AM
— Rohit Sharma (@ImRo45) March 22, 2020