క్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్‌

Roger Federer And  Rafael Nadal  reach French Open quarterfinals - Sakshi

సునాయాసంగా గెలిచిన స్టార్‌ ఆటగాళ్లు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ

పారిస్‌: మూడేళ్ల తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొంటున్న మాజీ విజేత రోజర్‌ ఫెడరర్‌... రికార్డుస్థాయిలో 12వసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న రాఫెల్‌ నాదల్‌... సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకునే దిశగా మరో అడుగు వేశారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్‌ 6–2, 6–3, 6–3తో లియోనార్డో మాయెర్‌ (అర్జెంటీనా)పై గెలుపొందగా... నాదల్‌ 6–2, 6–3, 6–3తో యువాన్‌ ఇగ్నాసియో లొండెరో (అర్జెంటీనా)ను ఓడించాడు. ఈ గెలుపుతో ఫెడరర్‌ 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 1991లో అమెరికా దిగ్గజం జిమ్మీ కానర్స్‌ 39 ఏళ్ల వయసులో యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. మంగళవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై గెలిస్తే ఫెడరర్, నాదల్‌ సెమీఫైనల్లో తలపడతారు.

5 గంటల 9 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 7–6 (8/6), 5–7, 6–4, 3–6, 8–6తో ఆరో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.  మహిళల సింగిల్స్‌ విభాగంలో పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌), జొహన కొంటా (బ్రిటన్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మార్టిక్‌ 5–7, 6–2, 6–4తో కయి కనెపి (ఎస్తోనియా)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–2, 6–0తో 12వ సీడ్‌ సెవస్తోవా (లాత్వియా)ను బోల్తా కొట్టించింది. జొహన కొంటా 6–2, 6–4తో డొనా వెకిచ్‌ (సెర్బియా)పై గెలిచి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 36 ఏళ్ల తర్వాత క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన తొలి బ్రిటన్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి బ్రిటన్‌ తరఫున జో డ్యూరీ 1983లో ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది.  

బోపన్న జంట ఓటమి
పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మరియస్‌ కోపిల్‌ (రొమేనియా) జంట 6–1, 5–7, 6–7 (8/10)తో దుసాన్‌ లాజోవిచ్‌–టిప్సరెవిచ్‌ (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top