సిరీస్‌ కాపాడుకుంటారా..!

New Zealand beat India by 8 wickets  - Sakshi

బ్యాట్స్‌మెన్‌ రాణింపే కీలకం

ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్‌

భారత్, కివీస్‌ రెండో టి20 నేడే

ఈ పర్యటనలో భారత్‌ నాలుగోవన్డేలో బంతుల పరంగా 212 భారీ తేడాతో ఓడింది.  కానీ అంతకంటే ముందే భారత్‌ 3-0తో సిరీస్‌ నెగ్గింది. ఆ ఓటమి లెక్కలోకి రాలేదు. తాజాగా తొలి టి20లో 80 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఈ ఫలితమేమో సిరీస్‌ను తాడోపెడో దాకా తీసుకొచ్చింది. రెండో మ్యాచ్‌ను కీలకం చేసింది.

ఆక్లాండ్‌: భారత్‌ ఇక మెరుపుల తడాఖా చూపెట్టాల్సిందే. ‘పొట్టి’ది గెలవాలంటే గట్టిగా పని చెప్పాల్సిందే. ఈ నేపథ్యంలో రెండో టి20లో  గెలుపే లక్ష్యంగా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధమైంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో పుంజుకుంటేనే భారత్‌ సిరీస్‌ నెగ్గుకొస్తుంది. లేదంటే మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ ఆతిథ్య జట్టు ఖాతాలోకి వెళుతుంది. నిజానికి ఈ సిరీస్‌లో రిజర్వ్‌ సత్తాను పరిశీలించాలనుకున్న భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే కఠిన పరీక్ష ఎదురైంది. దీంతో ఇప్పుడు ప్రయోగాలు పక్కనబెట్టి మ్యాచ్‌ విజయంపైనే దృష్టి పెట్టింది. సిరీస్‌నే లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆల్‌రౌండ్‌ దెబ్బ కొట్టాల్సిందే
టి20 పార్మాట్‌లో ఈ జట్టు ఫేవరెట్‌ అని ఉండదు. ఆ రోజు ఎవరి మెరుపులు మెరిస్తే వాళ్లే విజేత. కాబట్టి భారత్‌ తమ పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌లో ‘నిలకడ’ చూపెడుతూనే ప్రత్యర్థి ధాటిని నిలువరించేలా ప్రణాళికను సిద్ధం చేయాలి. గత మ్యాచ్‌లో కివీస్‌ ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ చెలరేగాడు. ఆరంభంలోనే అతనికి అడ్డుకట్ట వేయాలి. హార్దిక్‌ పాండ్యా సహా కీలకమైన పేసర్‌ భువనేశ్వర్, ఖలీల్‌ అహ్మద్‌లు తమ కోటాలో అటు ఇటుగా 50 చొప్పున పరుగులు సమర్పించుకున్నారు.

ఈ పొరపాట్లను ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తే ఏకంగా ‘సిరీస్‌’ మూల్యం తప్పదు. కాబట్టి ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో సిద్ధార్థ్‌ కౌల్, సిరాజ్‌లలో ఒకరికి ఛాన్స్‌ ఇవ్వొచ్చు. అలాగే ముగ్గురు వికెట్‌ కీపర్‌లలో ఒకరిని తప్పిస్తే... రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్‌లలో ఒకరికే తుదిజట్టులో ఆడే అవకాశముంటుంది. మణికట్టు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే మాత్రం ఆల్‌రౌండర్లలో పాండ్యా బ్రదర్స్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితమవుతారు. 

జోరుమీదున్న కివీస్‌ 
వన్డే సిరీస్‌ను తేలిగ్గానే కోల్పోయిన న్యూజిలాండ్‌ టి20ల్లో శుభారంభంతో టచ్‌లోకి వచ్చింది. భారత్‌కు టి20 చరిత్రలోనే భారీ పరాజయాన్ని రుచిచూపించిన కివీస్‌ ఇదే జోరుతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. వన్డేల్లో రెండు వన్డేలుండగానే భారత్‌ గెలిచినట్లే... ఇప్పుడు టి20 సిరీస్‌లో అదే ఫలితాన్ని ఆతిథ్య జట్టు సాధించాలనుకుంటోంది. పైగా కివీస్‌ గడ్డపై ఇప్పటివరకైతే భారత్‌ నెగ్గనేలేదు.

ఆడిన మూడింట ఓటములే! ఈ నేపథ్యంలో కలిసొచ్చే చరిత్ర కూడా న్యూజిలాండ్‌ను ఊరిస్తోంది. ఓపెనర్లు సిఫెర్ట్, మున్రో సహా టాపార్డర్‌ ధాటిగా ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్, రాస్‌ టేలర్‌లు మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లు తేలిపోవడంతో టెయిలెండర్‌ కుగ్లీన్‌ కూడా చెలరేగిపోయాడు. బౌలింగ్‌లో సౌతీ, ఫెర్గూసన్, సాన్‌ట్నర్, ఇష్‌ సోధిలు సమష్టిగా రాణించారు. ఇదే ప్రదర్శనను ఇక్కడా కొనసాగిస్తే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. 

పిచ్, వాతావరణం 
ఈడెన్‌ పార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌ స్వర్గధామమని గత ఫలితాలే చెబుతున్నాయి. ఇక్కడే ఆసీస్‌ 244 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. కివీస్‌ 143 పరుగుల లక్ష్యాన్ని పది ఓవర్లలోనే చేసేసింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు సార్లు ఛేదనకు దిగిన జట్టే గెలిచింది. 

జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, శుబ్‌మన్‌/విజయ్‌ శంకర్, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, ధోని, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ / కుల్దీప్, భువనేశ్వర్, ఖలీల్‌ అహ్మద్‌/సిరాజ్, చహల్‌. 
న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), సీఫెర్ట్, మున్రో, టేలర్, మిచెల్, నీషమ్‌/గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, కుగ్లీన్, సౌతీ, ఇష్‌ సోధి, ఫెర్గూసన్‌.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top