ధోనికి ఝలక్

ధోనికి ఝలక్ - Sakshi


 శ్రీలంకతో పర్యటనకు జట్టు ప్రకటన కంటే ఆ తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ మాట్లాడిన మాటలు బాగా ఆసక్తికరంగా ఉన్నాయి. టెస్టు జట్టును పూర్తిగా కోహ్లికి నచ్చినట్లుగా ఇచ్చేశారు. సరే... కెప్టెన్ ఏం కోరితే అది చేయొచ్చు. కానీ వన్డే కెప్టెన్ ధోనిని పూచికపుల్లలా తీసి పారేసినట్లు కనిపిస్తోంది. సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యల్లో పరోక్షంగా చాలా అర్థాలు ఉన్నాయి.

 

 బంగ్లాదేశ్ పర్యటన ముగిశాక ధోని భారత పేసర్ల గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ‘లైన్ అండ్ లెంగ్త్ లేని ఫాస్ట్ బౌలర్లు కావాలా? లేక వేగం లేకపోయినా కచ్చితత్వంతో బౌలింగ్ చేసే వాళ్లు కావాలా అనేది తేల్చుకోవాలి’ అన్నాడు. దీనిపై ఇప్పుడు సందీప్ పాటిల్ స్పందించారు. ‘కెప్టెన్‌గా ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ధోనికి ఉంటుంది. అతని అభిప్రాయాలు ఏమిటనేది మాకు అనవసరం. మంచి సమతుల్యంతో జట్టును ఎంపిక చేయడమే మా పని. ధోని కామెంట్స్ ఏమైనా ఉంటే బోర్డు చూసుకుంటుంది. మా పేస్ విభాగం చాలా బాగుంది. నలుగురు పేసర్లలోనూ నైపుణ్యం ఉంది’ అన్నారు. ఒక రకంగా ఇది ధోనికి కౌంటర్ ఇవ్వడమే.

 

  రైనా, జడేజా టెస్టు జట్టులో ఎందుకు లేరనే ప్రశ్నకు కూడా పాటిల్ విభిన్నంగా సమాధానం ఇచ్చారు. ‘కెప్టెన్సీలో మార్పులు జరిగిన తర్వాత సహజంగానే జట్టులో మార్పులు వస్తాయి. ప్రతి కెప్టెన్‌కూ ఓ విధానం ఉంటుంది. ఒకరు దూకుడు శైలిని అవలంబిస్తే, మరొకరు డిఫెన్సివ్‌గా ఉంటారు. వారి శైలికి కావలసిన ఆటగాళ్లను అడిగే హక్కు ఉంటుంది’ అన్నారు. అంటే ఇన్నాళ్లూ రైనా, జడేజా ఇద్దరూ ధోని ప్రాపకం వల్లే జట్టులో కొనసాగారనే అర్థం ధ్వనించింది.

 

 టెస్టుల్లోనూ కెప్టెన్‌గా ధోని భారత్ గర్వించదగ్గ విజయాలు సాధించాడు. తాను నమ్మిన యువ మంత్రంతో ఫలితాలు రాబట్టాడు. ఓ రకంగా సీనియర్ త్రయం వైదొలిగాక ప్రత్యామ్నాయాలను వెతికి పెట్టాడు. మరి ధోని స్థాయిలో కోహ్లి ఫలితాలు సాధిస్తాడా అంటే... ‘టెస్టు కెప్టెన్‌గా ధోని అద్భుతమైన ఫలితాలు సాధించాడు. కోహ్లి కూడా బాగానే ప్రారంభించాడు. తనకు కొంత సమయం ఇస్తే తాను కూడా నిరూపించుకుం టాడు.

 

 ఏం జరుగుతుందో అని ముందే ఆందోళన చెందాల్సిన పనిలేదు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ రిటైరైతే ప్రత్యామ్నాయాలు దొరకవని ఆందోళన చెందాం. కానీ అద్భుతమైన క్రికెటర్లు లభిం చారు’ అని చెప్పారు. ఓ రకంగా ధోని వైదొలగడం వల్ల నష్టమేం లేదనే పద్ధతిలో మాట్లాడారు.  ధోని జట్టులో ఉన్నంతకాలం టెస్టు సిరీస్‌కు రిజర్వ్ వికెట్ కీపర్లను తీసుకెళ్లారు. ఇప్పుడు రిజర్వ్ లేడు. దీనిపై పాటిల్ ‘ఏవైనా గాయాలైతే చూద్దాంలే’ అని తేలికగా తీసుకున్నారు. అంటే ధోని అప్పట్లో ఫిట్‌గా లేడని చెప్పడమా ఇది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top