ఆసీస్‌పై గెలిచినా.. సెలబ్రేషన్స్‌ వద్దన్నాడు

MS Dhoni asked his men not to publicly celebrate ODI win vs Australia  - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఎంఎస్‌ ధోని ముందు వరుసలో ఉంటాడు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లను ఏకతాటిపై నడిపించి తన ప్రత్యేకతని చాటుకున్నాడు ధోని. ముఖ్యంగా.. జట్టు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడూ ఆటగాళ్ల ఆత్మస్థైర్యం మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తపడేవాడు మిస్టర్‌ కూల్‌. ఈ లక్షణాలే అతడ్ని ప్రపంచంలోనే విజయవంతమైన కెప్టెన్స్ జాబితాలో నిలిపింది. తాజాగా ధోని కెప్టెన్సీ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

భరత్‌ సుదర్శన్ అనే రచయిత ఇటీవల రాసిన ‘ధోని టచ్' అనే పుస్తకంలో ఇలా రాసుకొచ్చాడు. 2008లో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాను ఓడించినపుడు అతిగా స్పందించవద్దని సహచరులందరికీ సంకేతాలిచ్చాడట ధోని. అప్పటికి ధోని వన్డే కెప్టెన్సీ పగ్గాలు అందుకుని కొన్ని నెలలే అయింది. మొదట ఆసీస్‌ 159 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అయితే మరి కొన్ని నిమిషాల్లో ఛేదన పూర్తి కాబోతుండగా బ్యాటింగ్‌ చేస్తున్న ధోని గ్లోవ్స్‌ మార్చుకోవడం కోసం ఓ సహచరుడిని మైదానంలోకి పిలిచాడట.

ఛేదన పూర్తయ్యాక డగౌట్‌లో ఉన్న వాళ్లు ఎగిరి గంతులేయొద్దని చెప్పాడట. అలాగే తనతో పాటు బ్యాటింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మకు సైతం మ్యాచ్‌ పూర్తయ్యాక మామూలుగానే ఉండమని, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఆత్మవిశ్వాసంతో కరచాలనం చేయమని సూచించాడట. కెప్టెన్ ఆదేశంతో భారత్ జట్టు వన్డే సిరీస్‌ గెలిచినా.. హుందాగా వ్యవహరించింది. అప్పటి వరకు క్రికెట్ ప్రపంచంలో అజేయ జట్టుగా భావిస్తూ.. విర్రవీగిన ఆస్ట్రేలియాను ఓడించడం అసాధ్యంకాదని తెలియజెప్పడం, ఇకపై కూడా ఓడించగలమనే సంకేతాలు ఇవ్వడానికే ధోని అలా చేసి ఉండవచ్చిన సుదర్శన్‌ పుస్తకంలో రాసుకొచ్చాడు. అదే సమయంలో వారి దేశంలో ఆసీస్‌ను రెచ్చగొట్టడం అంత మంచిది కాదనే ఉద్దేశంతో కూడా ధోని సెలబ్రేషన్స్‌ దూరం పెట్టి ఉండవచ్చన్నాడు. చివరకు ఆ ట్రై సిరీస్‌ను భారత్‌ గెలవడంతో ధోని గేమ్‌ ప్లాన్‌ బాగా పనిచేసిందన్నాడు. ఆ సిరీస్‌లో ఆసీస్‌, భారత్‌లతో పాటు శ్రీలంక పాల్గొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top