వాళ్ల ఫామ్‌పై ఆందోళన అక్కర్లేదు: కోహ్లి

Kohli Says Dont Worry about form of Rohit And Dhawan - Sakshi

కార్డిఫ్‌: ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ల ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరంల లేదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా జరిగిన రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ వీరిద్దరూ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రోహిత్‌, ధావన్‌ల పూర్‌ ఫామ్‌పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ఐసీసీ లాంటి మెగా ఈవెంట్లలో ఓపెనర్లు కీలకపాత్ర పోషిస్తారని.. అంతేకాకుండా భారీ ఛేదనలో ఓపెనర్లు రాణించకపోతే జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్లు విఫలమవ్వడంపై కోహ్లి స్పందించాడు. ‘రోహిత్‌, ధావన్‌లు చాలా అద్భుతమైన ఆటగాళ్లు. ఐసీసీ లాంటి మెగా ఈవెంట్లలో వాళ్లు అద్భుతంగా ఆడతారు. వారిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ మెగా టోర్నీలో రోహిత్‌, ధావన్‌లు గొప్పగా రాణిస్తారనే నమ్మకం నాకుంది. ఇక రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో మాకు కావాల్సినంత ప్రాక్టీస్‌ లభించింది. అయితే బంగ్లాతో మ్యాచ్‌లో చేజింగ్‌ చేద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. మా ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదు. నాణ్యమైన క్రికెట్‌ ఆడతాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి పోరులో దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న తలపడనుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top