కింగ్స్‌ పంజాబ్‌ పేకమేడలా.. | Kings Punjab bowled out for 88 | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ పంజాబ్‌ పేకమేడలా..

May 14 2018 9:27 PM | Updated on May 14 2018 9:28 PM

 Kings Punjab bowled out for 88 - Sakshi

ఇండోర్‌: కింగ్స్‌ పంజాబ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. స్టార్‌ ఆటగాళ్లున్నా ఆ జట్టు పూర్తిస్థాయిలో ఆడటంలో మరోసారి విఫలమైంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 15.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనూ ఆర్సీబీ బౌలింగ్‌ను నిలువరించలేక పేకమేడలా కూలింది. ఆర్సీబీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించి కింగ్స్‌ పంజాబ్‌ను దెబ్బ తీశాడు. అతనికి జతగా సిరాజ్‌, చాహల్‌, గ్రాండ్‌ హోమ్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ పంజాబ్‌ ఆదిలో ఫర్వాలేదనిపించింది. రాహుల్‌ మూడు సిక్సర్లు, గేల్‌ నాలుగు ఫోర్లతో దూకుడుగా కనిపించగా వారిని ఉమేశ్‌ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. ఒకే ఓవర్‌లో రాహుల్‌(21), క్రిస్‌ గేల్‌(18)లు నిష్క్రమించడంతో ఇక కింగ్స్‌ పంజాబ్‌ పతనం ప్రారంభమైంది. కాగా, అరోన్‌ ఫించ్‌(26) ఫర్వాలేదనిపించడంతో కింగ్స్‌ తేరుకున్నట్లు కనబడింది. అయితే ఫించ్‌ ఔటైన తర్వాత కింగ్స్‌ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆర్సీబీకి 89 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.

50 పరుగులకే నాలుగు వికెట్లు..

క్రిస్‌ గేల్‌తో కలిసి 36 పరుగుల జత చేసిన కేఎల్‌ రాహుల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై ఐదు పరుగుల వ్యవధిలో క్రిస్‌ గేల్ ఔటయ్యాడు.  ఐదో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ ఔట్‌ కాగా, అదే ఓవర్‌ చివరి బంతికి గేల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. వీరిద్దరూ భారీ షాట్లకు యత్నించి నిష్క్రమించారు. ఆపై సిరాజ్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌(2) ఔట్‌ కాగా, అటు తర్వాత చాహల్‌ బౌలింగ్‌లో స్టోయినిస్‌(2) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో కింగ్స్‌ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే మరో 38 పరుగులు మాత్రమే చేసిన కింగ్స్‌ పంజాబ్‌ మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement