కశ్యప్ శుభారంభం | Kashyap started a win the match | Sakshi
Sakshi News home page

కశ్యప్ శుభారంభం

Aug 11 2015 12:22 AM | Updated on Sep 3 2017 7:10 AM

కశ్యప్ శుభారంభం

కశ్యప్ శుభారంభం

అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రపంచ

రెండో రౌండ్‌లోకి ప్రణయ్
సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు
{పపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

 
జకార్తా: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. గతేడాది తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించిన హైదరాబాద్ ప్లేయర్ కశ్యప్... తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో ఆడుతోన్న కేరళ ఆటగాడు ప్రణయ్ తమ ప్రత్యర్థులపై కేవలం 31 నిమిషాల్లో గెలుపొందడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో పదో సీడ్ కశ్యప్ 21-17, 21-10తో ఎరిక్ మెజెస్ (నెదర్లాండ్స్)పై... 11వ సీడ్ ప్రణయ్ 21-12, 21-16తో అలెక్స్ యువాన్ (బ్రెజిల్)పై విజయం సాధించారు. ఎరిక్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో కశ్యప్ ఒకదశలో 6-12తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న అతను వరుసగా ఆరు పాయింట్లు సాధించి స్కోరును 12-12తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడినా చివరకు కశ్యప్ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం మొదటి నుంచే కశ్యప్ ఆధిపత్యం చలాయించాడు. ఒకసారి వరుసగా ఆరు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే దూకుడును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. రెండో రౌండ్‌లో ఎకిరింగ్ (ఉగాండ)తో ప్రణయ్; తియెన్ మిన్ (వియత్నాం)తో కశ్యప్ ఆడతారు.

మరోవైపు హైదరాబాద్‌కే చెందిన డబుల్స్ ప్లేయర్ సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన సిక్కి రెడ్డి, మహిళల డబుల్స్‌లో మాత్రం ముందంజ వేసింది. మిక్స్‌డ్ డబుల్స్ మొదటి రౌండ్‌లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ ద్వయం 13-21, 17-21తో లియావో మిన్ చున్-చెన్ సియో హువాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీ 16-21, 21-15, 21-14తో ఇసాబెల్ హెర్ట్‌రిచ్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ మరో మ్యాచ్‌లో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (భారత్) జోడీ 18-21, 21-10, 22-24తో ద్రెమిన్-దిమోవా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. దాంతో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ (భారత్) జంట 17-21, 21-11, 21-11తో ఖాఖిమోవ్-కుజ్‌నెత్సోవ్ (రష్యా) జోడీపై గెలిచింది.

మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో లినీ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో పీవీ సింధు; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఫారిమన్ (ఆస్ట్రేలియా)తో శ్రీకాంత్; పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో కాయ్ యున్-లూ కాయ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో లాన్సాక్-లెఫెల్ (ఫ్రాన్స్)లతో మోహితా-ధాన్యా తలపడతారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement