వైరల్‌: ఆమె పోరాటానికి హ్యాట్సాఫ్‌!

Japanese Runner Rei Iida Crawls To Finish Line With Broken Leg - Sakshi

‘వీలైతే ఎగురు! లేకుంటే పరిగెత్తు! కుదిరితే నడువు! అదీ కాకుంటే పాకు! అంతే కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు!’అంటూ ఓ మహాకవి యువతను ఉద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ మహనీయుడి మాటలు విన్నదో ఏమో గానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రయత్నం మాత్రం ఆపలేదు.. చివరికి లక్ష్యాన్ని పూర్తి చేసింది. పరుగు పందెం మధ్యలో కాలికి గాయమైనా.. తన సంకల్పం ముందు అది చిన్నదైపోయింది. నడవలేని పరిస్థితుల్లో ఉన్నా మోకాళ్లపై పాకుకుంటూ 42 కిలోమీటర్ల రిలే మారథాన్‌ను తన జట్టు పూర్తి చేసేలా చేసింది జపాన్‌కు చెందిన క్రీడాకారిణి రీ లిడా. ప్రస్తుతం ఈ 19ఏళ్ల క్రీడాకారిణి చూపించిన పోరాట తెగువకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఆమె పోరాటానికి ఫిదా అయిన సెలబ్రిటీలు సైతం ట్వీట్‌ చేస్తున్నారు. ఇక నెటిజన్లు రీ లిడా క్రీడా స్పూర్తిని, అసమాన పోరాటానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.   

జపాన్‌లోని రిలే మారథాన్‌లో భాగంగా 42 కిలోమీటర్ల పరుగు పందెం ప్రారంభమైంది. వంతుల వారీగా పరిగెత్తే దానిలో భాగంగా 3.5కిలో మీటర్ల దూరం లక్ష్యంగా పరుగు మొదలుపెట్టిన రీ లిడా ఇంకా 700 మీటర్ల దూరం ఉండగానే కుడి కాలికి గాయంకావడంతో కుప్పకూలిపోయింది. కాలు ఫ్యాక్చర్‌ అయిందని పరిగెత్తడం కష్టమని, పోటీనుంచి తప్పుకొవడం మంచిదని జట్టు మేనేజర్‌ వారించినా లిడా వినలేదరు. ఇంకా ఎంత దూరం పరిగెత్తాలని తెలుసుకొని, మోకాళ్లపై పాకుతూ తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక రీలిడా క్రీడా స్పూర్థిని చూసి సహచర క్రీడాకారిణులు, స్టేడియంలోని అభిమానులు కరతలాధ్వనులతో ఉత్తేజపరిచారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top