సునీల్‌ అజేయ శతకం

సునీల్‌ అజేయ శతకం


ఫరీదాబాద్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అంధుల టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి సారథ్యంలోని టీమిండియా 142 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 305 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్‌ (49 బంతుల్లో 113 నాటౌట్‌; 21 ఫోర్లు) అజేయ సెంచరీ చేయగా... ఓపెనర్‌ దీపక్‌ మలిక్‌ (46 బంతుల్లో 80; 13 ఫోర్లు) రాణించాడు. సునీల్, దీపక్‌ మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసి ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీలంక 214 పరుగుల  తేడాతో న్యూజిలాండ్‌పై... బంగ్లాదేశ్‌ 72 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 334 పరుగులు చేయడం విశేషం. ఓపెనర్లు రువాన్‌ (170 నాటౌట్‌; 25 ఫోర్లు), సురంగ (146 నాటౌట్‌; 30 ఫోర్లు) అజేయ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్‌ 7 వికెట్లకు 120 పరుగులు చేసి ఓటమి పాలైంది.   

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top