సైనా ఇంటికి... సింధు సెమీస్‌కి 

India Open: Sindhu in semis; Saina bows out - Sakshi

మిక్స్‌డ్‌ సెమీస్‌లో సిక్కిరెడ్డి జోడీ

ఇండియా ఓపెన్‌ టోర్నీ

టాప్‌ సీడ్‌ సింధు ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ దిశగా  ఆడుగులు వేస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ కథ క్వార్టర్స్‌లో ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో  సిక్కి రెడ్డి జోడీ సెమీస్‌ చేరింది.  

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బరిలో భారత్‌ నుంచి సింగిల్స్‌లో సింధు, డబుల్స్‌లో సిక్కి రెడ్డి మిగిలారు. మిగతా వారంతా క్వార్టర్‌ఫైనల్స్‌కే పరిమితమయ్యారు. ఈ ఏడాది తొలి టైటిల్‌పై కన్నేసిన భారత స్టార్, టాప్‌ సీడ్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేసియా టోర్నీ రన్నరప్, నాలుగో సీడ్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌లోనే కంగుతింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. ఎనిమిదో సీడ్‌ సాయిప్రణీత్, సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌ పరాజయం చవిచూశారు.   

శ్రమించిన సింధు... 
ఈ టోర్నీలో అలవోక విజయాలతో నెగ్గుకొచ్చిన సింధుకు క్వార్టర్స్‌లోనూ అలాంటి ఫలితమే ఎదురవుతుందని తొలి గేమ్‌తో అనిపించింది. కానీ రెండో గేమ్‌లో ఆమె ప్రత్యర్థి బియట్రిజ్‌ కొరాలెస్‌ (స్పెయిన్‌) నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దీంతో సింధు ఈ టోర్నీలో తొలిసారి మ్యాచ్‌ గెలిచేందుకు మూడో గేమ్‌ వరకు పోరాడింది. చివరకు తెలుగు తేజం 21–12, 19–21, 21–11తో గెలుపొందింది. సెమీఫైనల్లో సింధు... ప్రపంచ మూడో ర్యాంకర్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో సైనా 10–21, 13–21తో బీవెన్‌ జాంగ్‌ (అమెరికా) చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్‌ సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ 21–8, 21–13తో హన్‌ చెంగ్‌కాయ్‌–కా తొంగ్‌ వీ (చైనా) జంటపై గెలిచింది.  పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ 15–21, 13–21తో మూడో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇస్కందర్‌ జుల్కర్‌నైన్‌ (మలేసియా) 21–17, 21–14తో సమీర్‌ వర్మను ఓడించగా, కశ్యప్‌నకు 16–21, 18–21తో కియావో బిన్‌ (చైనా) చేతిలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్‌ మేఘన–పూర్వీషా జంట 10–21, 15–21తో జోంగ్‌ కొల్ఫన్‌ – ప్రజోంగ్జయ్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో, సిక్కి–అశ్విని జంట 17–21, 21–23తో డు యుయి–యిన్‌హుయ్‌ (చైనా) ద్వయం చేతిలో కంగుతిన్నాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌–అశ్విని జంట 17–21, 11–21తో క్రిస్టియన్సన్‌–క్రిస్టినా (డెన్మార్క్‌) జోడీ చేతిలో, పురుషుల డబుల్స్‌లో మనూ–సుమీత్‌ రెడ్డి ద్వయం 19–21, 19–21తో ఫెర్నాల్డి–çసుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top