ఆకలితో ఉన్న పులుల్లా ఉన్నారు: సెహ్వాగ్‌

India are like hungry tigers, says Sehwag ahead of 4th Test - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఇప్పుడు గెలుపు కాంక్షతో తహతహలాడుతోందని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా.. ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే.. ఇటీవల ముగిసిన మూడో టెస్టులో భారత్ గెలిచిన తీరు చూస్తుంటే.. నాలుగో టెస్టులోనూ టీమిండియానే గెలిచేలా కనిపిస్తోందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

‘టీమిండియా మూడో టెస్టులో ఆడిన తీరు చూస్తుంటే.. నాలుగో టెస్టుని కేవలం నాలుగు రోజుల్లోనే గెలుపుగా ముగించేలా కనిపిస్తోంది. కానీ.. ఇంగ్లండ్ జట్టు కూడా ఈ టెస్టులో పుంజుకోవచ్చు. అయితే.. భారత ఆటగాళ్లు ఇప్పుడు ఆకలితో ఉన్న పులుల్లా ఉన్నారు. వారు కచ్చితంగా గెలుపు కోసం వేటాడుతారు. భారత బౌలింగ్ అటాక్ ప్రస్తుతం అత్యుత్తమంగా కనిపిస్తోంది. నలుగురు పేసర్లు మూడో టెస్టులో ఇంగ్లండ్ 19 వికెట్లు పడగొట్టడమే దానికి నిదర్శనం. నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ని 2-2తో సమం చేయాలని భారత్ ఇప్పుడు తహతహలాడుతోంది’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. ఆపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్‌ 3-2తో గెలుస్తుందని సెహ్వాగ్‌ జోస్యం చెప్పాడు. వరుస రెండు టెస్టుల్లో భారత్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశాడు. ఇది కాస్త కష్టంతో కూడుకున్నదే అయినప్పటికీ భారత్‌ సిరీస్‌ను గెలవడం ఖాయమన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top