టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే... ఐపీఎల్‌లో పాల్గొంటా: వార్నర్‌

If T20 World Cup Postpones I Will Play IPL 2020 Says David Warner - Sakshi

న్యూఢిల్లీ: ఒకవేళ టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆడేందుకు తాను సిద్ధమని ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌–నవంబర్‌లలో వరల్డ్‌ కప్‌ నిర్వహణ అసాధ్యమని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్‌ ఎర్ల్‌ ఎడింగ్స్‌ ఇటీవలే ప్రకటించాడు. ఐసీసీ కూడా ఇదే నిర్ణయాన్ని వెలువరిస్తే దాని స్థానంలో ఐపీఎల్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎలాంటి అభ్యంతరం లేదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ వార్నర్‌ తెలిపాడు. ‘టి20 వరల్డ్‌కప్‌ వాయిదాపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సీఏ కూడా ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు కరోనా కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

ప్రభుత్వం చెప్పినట్లే అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం చాలా కష్టం. ఒకవేళ వరల్డ్‌కప్‌ వాయిదాపడి సీఏ అనుమతిస్తే ఐపీఎల్‌ ఆడేందుకు మేమంతా సిద్ధం’ అని వార్నర్‌ వివరించాడు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు వార్నర్‌ తెలిపాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం కారణంగా 2018–19లో భారత్‌తో సిరీస్‌కు దూరమైన అతను భవిష్యత్‌లో టీమిండియాతో జరుగనున్న సిరీస్‌లో కచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఎట్టిపరిస్థితుల్లోనూ రెచ్చగొట్టబోమని వార్నర్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top