భారత్‌కు తప్పని వైట్‌వాష్‌

Healy hundred helps Australia sweep series - Sakshi

వడోదరా: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకుందామని భావించిన భారత మహిళలకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఫలితంగా భారత్‌కు వైట్‌వాష్‌ తప్పలేదు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 333 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. ఓపెనర్‌ అలైస్సా హేలీ(133) సెంచరీతో సత్తా చాటగా, రాచెల్‌ హేన్స్‌(43), ఎల్లీసే పెర్రీ(32), బెత్‌ మూనీ(34), గార్డ్‌నర్‌(35)లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో ఆసీస్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది.

ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ జట్టు 44.4 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు  జెమీమా రోడ్రిగ్స్‌(42), స్మృతీ మంధాన(52)లు ఆకట్టుకుని తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ తడబాటుకు లోనైంది. ఆ తర్వాత మిథాలీ రాజ్‌(21), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(25)లు ఆశించిన స్థాయిలో రాణించకపోగా, దీప్తి శర్మ(36), సుష్మా వర్మ(30)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ 221 పరుగుల స్కోరు వద్ద వరుసగా అవుట్‌ కావడంతో పాటు చివరి వరుస క్రీడాకారిణులు ఎవరూ రాణించకపోవడంతో భారత్‌కు భారీ ఓటమి తప్పలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top