టీ20లోనూ తీరు మారని ఆసీస్‌

England Beat By Australia In Only One T20 Match - Sakshi

బర్మింగ్‌హామ్: ఫార్మట్‌ ఏదైనా ఓడడం ఆస్ట్రేలియాకు.. గెలవడం ఇంగ్లండ్‌కు అలవాటైనట్లుంది.. ఐదు వన్డేల సిరీస్‌ వైట్‌వాష్‌కు గురైన ఆసీస్‌, ఏకైక టీ20లోనూ చతికిలపడింది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌పై 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించిన అనంతరం ఐపీఎల్‌ హీరో జోస్‌ బట్లర్‌ 61(30 బంతుల్లో; 6ఫోర్లు, 5 సిక్సర్లు) స్టాన్‌లేక్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

మరో ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ 44(26 బంతుల్లో 6ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న మిగతా బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌ ఝుళిపించారు. చివర్లో అలెక్స్‌ హేల్స్‌ (49), రూట్‌ (35) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగుల చేసింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్వెప్సన్‌ రెండు వికెట్లు సాధించగా.. స్టాన్‌లేక్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ సాధించారు. 

అనంతరం 222 పరుగలు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. ఇంగ్లండ్‌ బౌలర్ల  ధాటికి 193 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 84(41 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఫించ్‌కు మిగతా ప్రధాన బ్యాట్‌మెన్‌ నుంచి సహకారం అందకపోవటంతో ఆసీస్‌ ఓటమి చవిచూసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌, జోర్డాన్‌ తలో మూడు వికెట్లు సాధించగా.. ప్లంకెట్‌ రెండు వికెట్లు, విల్లీ, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ పడగొట్టారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top