వార్నర్‌ వచ్చాడు... హాఫ్ సెంచరీ కొట్టేశాడు

David Warner returns to IPL, scores fifty in practice game  - Sakshi

శనివారం జట్టుతో కలిసిన సన్‌రైజర్స్‌ ఓపెనర్‌

 ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో దూకుడైన అర్ధశతకం

సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌–12వ సీజన్‌లో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. శనివారమే జట్టుతో కలిసిన ఈ ఆస్ట్రేలియా ప్లేయర్‌... ఇంట్రా స్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కేవలం 38 బంతుల్లోనే 68 పరుగులు చేసి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. ఆదివారం సన్‌రైజర్స్‌ ‘ఎ’, ‘బి’ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బి జట్టు విజయం సాధించింది.

ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వార్నర్, మనీశ్‌ పాండే (43 బంతుల్లో 67), దీపక్‌ హుడా (27 బంతుల్లో 55) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరు దూకుడుగా ఆడటంతో సన్‌రైజర్స్‌ ‘ఎ’ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం సన్‌ రైజర్స్‌ ‘బి’ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘బి’ తరఫున యూసుఫ్‌ పఠాన్‌ (30 బంతుల్లో 68), రికీ భుయ్‌ (29 బంతుల్లో 65) ధాటిగా ఆడారు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన వార్నర్‌... గడ్డు కాలంలోనూ తనపై నమ్మకాన్ని ఉంచిన సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ని

షేధం అనంతరం భారత్‌కు వచ్చిన వార్నర్‌కు సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ ఆత్మీయ స్వాగతం పలికింది. గతేడాది నిషేధం కారణంగా వార్నర్‌ ఐపీఎల్‌లో ఆడలేకపోవడంతో కేన్‌ విలియమ్సన్‌ సారథిగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈసారి విలియమ్సన్‌ కెప్టెన్సీలో వార్నర్‌ బ్యాట్స్‌మెన్‌గా సన్‌రైజర్స్‌కు సేవలందిస్తాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 114 మ్యాచ్‌లాడిన వార్నర్‌ 40.54 సగటు, 142.13 స్ట్రయిక్‌ రేట్‌తో 4014 పరుగులు సాధించాడు. ఇందులో 36 అర్ధసెంచరీలున్నాయి. 2016లోనూ సన్‌రైజర్స్‌ టైటిల్‌ గెలవడంలో వార్నర్‌ కీలకపాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top