హైదరాబాదీలకు వార్నర్‌ ఎమోషనల్‌ మెసేజ్‌

David Warner Bids Adieu To IPL 2019 With Emotional Message - Sakshi

ఐపీఎల్‌-12 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌ రేసు ఆశలను సజీవంగా నిలిపి సొంత దేశానికి తిరుగు పయనమైన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాదీ వాసులకు, సన్‌రైజర్స్‌ అభిమానులకు భావోద్వేగ సందేశాన్నిచ్చాడు. ప్రపంచకప్‌ జట్టు సన్నాహకంలో భాగంగా సొంత జట్టుతో కలవడానికి స్వదేశం వెళ్లిన వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సుదీర్ఘ పోస్టుతో అభిమానులకు గుడ్‌బై చెప్పాడు.

‘మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు.. గతేడాది నేనున్న గడ్డుకాలంలో కూడా మీరు మద్దతుగా నిలిచారు. మళ్లీ సన్‌రైజర్స్‌ కుటుంబంలో చేరడానికి, మీతో కలిసి ఆడటానికి.. మీ దగ్గరకు రావడానికి ఎంతో ఎదురు చూశాను. ఫ్రాంచైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్‌ మీడియా విభాగం, అభిమానులు నా పునరాగమనానికి ఘనస్వాగతం పలికారు. మీతో ఆడటం నేను ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో అంతా మంచే జరగాలని, మంచిఫలితం దక్కాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. సోమవారం కింగ్స్‌ పంజాబ్‌తో ఆఖరి మ్యాచ్‌ ఆడిన వార్నర్‌ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 692 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం  సన్‌రైజర్స్‌ 12 మ్యాచ్‌ల్లో 6 గెలుపొంది 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టీమ్ ప్లేఆఫ్‌కి చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాలి. ఈ దశలో డేవిడ్ వార్నర్ స్వదేశానికి వెళ్లిపోవడం సన్‌రైజర్స్‌ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. కనీసం మన జట్టు ఫైనల్‌కు చేరితే అప్పుడైన రావాలని సోషల్‌ మీడియా వేదికగా అర్థిస్తున్నారు.
చదవండి: ‘వదినమ్మా.. వీలైతే ఫైనల్‌ మ్యాచ్‌కు రమ్మనవా’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top