
స్టెయిన్ గన్
ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తమ బౌలర్ నిస్సందేహంగా దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్. నైపుణ్యం, వేగం, స్వింగ్,
ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తమ బౌలర్ నిస్సందేహంగా దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్. నైపుణ్యం, వేగం, స్వింగ్, పోరాటతత్వం అనే నాలుగు లక్షణాలతో దక్షిణాఫ్రికా క్రికెట్ స్థాయిని పెంచిన స్టెయిన్ టెస్టుల్లో 400 వికెట్ల మార్కును చేరుకున్నాడు.
సాక్షి క్రీడావిభాగం
చాలామంది క్రికెటర్లు టెస్టుల్లో 400 వికెట్లు తీశారు. స్టెయిన్ కంటే ముందు ప్రపంచంలో మరో 12 మంది ఈ ఘనత సాధించారు. అయినా స్టెయిన్ గురించి ఎందుకు చెప్పుకోవాలి..? ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని స్ట్రయిక్ రేట్ (41.58)తో తను ఈ మార్కును చేరుకున్నాడు. అంతే కాదు... అతి తక్కువ బంతులు (16634) బౌలింగ్ చేసి ఈ ఘనత చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ద్వారా తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున పొలాక్ (421) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ స్టెయిన్.
సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ స్టెయిన్. తను ఇప్పటివరకూ ఆడిన 79 టెస్టుల్లో (బంగ్లాతో రెండో టెస్టుకు ముందు) 61 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఓడిపోలేదు. పొలాక్, ఎన్తినిలాంటి గొప్ప పేసర్ల కెరీర్ ముగిసిన సమయంలో వచ్చిన స్టెయిన్ దశాబ్దకాలంగా సఫారీలకు వెన్నెముకగా నిలిచాడు. కెరీర్ ఆరంభానికి, ఇప్పటికీ ఏమాత్రం వేగం తగ్గకపోగా... ఇంకా పెంచుతున్నాడు. ఒక ఫాస్ట్‌బౌలర్ ఇంత ఫిట్‌గా ఉండటం చాలా కష్టం. ‘ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో నా జట్టును నేనే గెలిపించాలి’ ఈ దృక్పథం, తపనతో మైదానంలో కనిపించే స్టెయిన్... కెరీర్ ఆసాంతం నిలకడగా రాణించాడు.
గడ్డుకాలాన్ని దాటాడా?
అయితే గత ఏడాది కాలంగా స్టెయిన్ లాంటి బౌలర్ కూడా కష్టాలు ఎదుర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో విఫలం కావడం, ముఖ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆఖరి ఓవర్లో వైఫల్యం తనని వెంటాడింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడుతూ చాలా మ్యాచ్‌లు బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఆ వెంటనే అనారోగ్యం కారణంగా రెండు నెలలు విశ్రాంతి... ఇలా తను ఫామ్ కోల్పోయాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో అది కనిపించింది. కానీ రెండో టెస్టులో తిరిగి మునుపటి స్టెయిన్‌ను గుర్తుకు తెస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
తనకి అసలు పరీక్ష ఈ ఏడాది అక్టోబరులో ఎదురుకానుంది. భారత్‌లో దక్షిణాఫ్రికా సిరీస్ గెలవాలంటే స్టెయిన్ కీలకం. 2010లో రివర్స్ స్వింగ్ ఆయుధంగా సంచలన బౌలింగ్ చేసి భారత్‌లోనూ పేసర్లు చెలరేగొచ్చని నిరూపించాడు. భారత గడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్ గెలవాలంటే స్టెయిన్ అదే ఫామ్‌లోకి రావాలి.