
400 వికెట్ల క్లబ్ లో మరో బౌలర్
దక్షిణాఫ్రికా టాప్ బౌలర్ డెల్ స్టేయిన్ టెస్ట్ క్రికెట్లో 400 వికెట్లు తీసిన క్లబ్లో చేరాడు.
ఢాకా: దక్షిణాఫ్రికా టాప్ బౌలర్ డెల్ స్టేయిన్ 400 వికెట్లు తీసిన క్లబ్లో చేరాడు. టెస్టుల్లో ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 13వ బౌలర్ కాగా, సఫారీ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ స్టేయిన్. గతంలో దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పొలాక్(421) ఈ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బంగ్లా స్కోరు 12 పరుగుల వద్ద ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(6) వికెట్ తీయడంతో స్టేయిన్ ఈ ఘనత సాధించినట్లయింది.
టెస్ట్ మ్యాచ్ లో స్టేయిన్ వేసిన మూడో ఓవర్లో ఆటగాడు హషీమ్ ఆమ్లా ఫస్ట్ స్లిప్లో ఓ చక్కని క్యాచ్ అందుకోవడంతో తమీమ్ వికెట్ స్టేయిన్కు లభించింది. 80 వ టెస్ట్ మ్యాచ్ లో స్టేయిన్ ఈ ఫీట్ నెలకొల్పాడు. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న ముగ్గురు ఆటగాళ్లు టెస్టుల్లో 400, అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. స్టేయిన్ సహా ఈ ఫీట్ నెలకొల్పిన హర్బజన్(భారత్), జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్)లు టెస్ట్ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్నారు.