క్రికెటర్ షమీ కుటుంబానికి 'గోవధ' ఉచ్చు | 'Cow slaughter' being used to target us, says pacer Shami’s dad | Sakshi
Sakshi News home page

క్రికెటర్ షమీ కుటుంబానికి 'గోవధ' ఉచ్చు

Jan 16 2016 1:07 PM | Updated on Sep 3 2017 3:45 PM

క్రికెటర్ షమీ కుటుంబానికి 'గోవధ' ఉచ్చు

క్రికెటర్ షమీ కుటుంబానికి 'గోవధ' ఉచ్చు

గోవధకు పాల్పడినవారితో తమకు ఎలాంటి సంబంధంలేదని, షమీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఉద్దేశపూర్వకంగా తమను కేసులోకి లాగారని క్రికెటర్ తండ్రి తౌసీప్ అహ్మద్ ఆరోపించారు.

- షమీ ఎదుగుదలచూసి ఓర్వలేకే కుట్రలు
- గోవధ నిందితులను కాపాడామనే ఆరోపణ అవాస్తవం
- వేధింపులపై నెల కిందటే ఫిర్యాదుచేశా: షమీ తండ్రి

మీరట్:
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ సోదరుడు మొహమ్మద్ హసీబ్ పై పోలీసు కేసు చిలికిచిలికి గాలివానలా మారుతోంది. గోవధకు పాల్పడినవారితో తమకు ఎలాంటి సంబంధంలేదని, షమీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఉద్దేశపూర్వకంగా తమను కేసులోకి లాగారని క్రికెటర్ తండ్రి తౌసీప్ అహ్మద్ ఆరోపించారు. గొడవ జరిగిన ప్రాంతంలో కేవలం ప్రేక్షకుడిలా ఉన్న హసీబ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, వేధింపుల్లో భాగంగానే ఇలా జరిగిందని విమర్శించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలోకి వెళితే..

గురువారం షమీ స్వగ్రామమైన అమ్రోహలో గోవధ జరుగుతోందన్న సమాచారంతో దిబోలీ స్టేషన్ కు చెందిన ఇద్దరు పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే షమీ సోదరుడైన హసీబ్ పోలీస్ వాహనానికి అడ్డుపడి నిందితులను వదిలిపెట్టాలన్నాడని, కుదరదన్న తమపై దాడి చేశాడని పోలీసుల వాదన. నిందితుల పరారీకి సహకరించడంతోపాటు, విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై హసీబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అనారోగ్యకారణాలతో హసీబ్ బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే పోలీసులు చెబుతున్నట్లు తన పెద్దకొడుకు(హసీబ్) దాడికి పాల్పడలేదని తండ్రి తౌసీఫ్ అంటున్నారు.

'గోవధ నిందితులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో చాలా మంది గుమ్మిగూడారు. అందరిలాగే హసీబ్ కూడా చూస్తూ నిల్చున్నాడేకానీ పోలీసులను అడ్డుకోలేదు. ఇదంతా ఒక కుట్ర. గోవధ కేసులోకి మమ్మల్ని లాగాలనే ఉద్దేశంతో కొందరు కల్పించిన కట్టుకథ. గతంలోనూ ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నా. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది' అని తౌసీఫ్ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై అమ్రోహా కలెక్టర్ వేద ప్రకాశ్ స్పందిస్తూ.. కొందరు వేధిస్తున్నారంటూ షమీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. కచ్చితంగా ఎవరు బెదిరిస్తున్నారనే సమాచారం లేనందున తదుపరి చర్యలు తీసుకోలేకపోయామని కలెక్టర్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement