సిక‍్సర్‌ కొట్టి సెల్యూట్‌ చేశాడు..!

Buttler Wallops Sheldon Cottrell For Six Gives Him A Salute - Sakshi

సెయింట్‌ జార్జియా: వెస్టిండీస్‌తో నాల్గో వన్డేలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జాస్‌ బట్లర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 77 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు సాధించాడు. ఫలితంగా తన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరును సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది.

వెస్టిండీస్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ను బట్లర్‌ సిక్సర్‌ కొట్టి మరీ స్లెడ్జ్‌ చేశాడు. వెస్టిండీస్‌ బౌలర్లను ఊచకోత కోసిన బట్లర్‌.. కాట్రెల్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టాడు. దాంతో బట్లర్‌ వైపు తదేకంగా చూడసాగాడు కాట్రెల్‌ అయితే అందుకు బదులుగా బట్లర్‌ సెల్యూట్‌ చేశాడు. కార్టెల్‌ ఎప్పుడు వికెట్లు తీసినా ఇలాగే సెల్యూట్‌ చేస్తాడు. ఇది అతడి అలవాటు. బట్లర్‌ సైతం అలాగే చేయడంతో మైదానంలో నవ్వులు పూశాయి.
( ఇక్కడ చదవండి: 500 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా..)

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ (73 బంతుల్లో 82; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ఆపై  కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌ ఆడగా,  జాస్‌ బట్లర్‌ తనదైన శైలిలో చెలరేగి భారీ  శతకం సాధించాడు. బట్లర్, మోర్గాన్‌ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ నాలుగు వందల మార్కును చేరింది.  ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ పోరాడి ఓడింది. ఇంగ్లండ్‌కు దీటుగా బదులిచ్చిన వెస్టిండీస్‌ 48 ఓవర్లలో 389 పరుగులు చేసి ఓటమి పాలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top