రాప్టర్స్‌ రాకింగ్‌

Bengaluru Raptors win Premier Badminton League - Sakshi

పీబీఎల్‌ చాంపియన్‌ బెంగళూరు

రసవత్తర ఫైనల్లో 4–3తో ముంబైపై గెలుపు

బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌–4) నాలుగో సీజన్‌లో బెంగళూరు రాప్టర్స్‌ రాకింగ్‌ ప్రదర్శనతో టైటిల్‌ పట్టేసింది. ఆదివారం జరిగిన రసవత్తర టైటిల్‌ పోరాటంలో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌ను కంగుతినిపించింది. మొదట జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ను ‘ట్రంప్‌’గా ఎంచుకున్న ముంబై రాకెట్స్‌ ఇందులో గెలిచి శుభారంభం చేసింది. కిమ్‌ జీ జాంగ్‌–బెర్నడెత్‌ (ముంబై) జంట 15–8, 15–14తో మార్కస్‌ ఎలిస్‌–లారెన్‌ స్మిత్‌ (బెంగళూరు) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ (బెంగళూరు) 15–7, 15–10తో అంటోన్సెన్‌ (ముంబై)పై నెగ్గి 1–2తో రాకెట్స్‌ ఆధిక్యాన్ని తగ్గించాడు.

బెంగళూరుకు ‘ట్రంప్‌’ అయిన మహిళల సింగిల్స్‌లో తి ట్రంగ్‌ వు 15–8, 15–9తో శ్రియాన్షి పరదేశి (ముంబై)ని ఓడించింది. దీంతో 3–2తో బెంగళూరు పైచేయి సాధించింది. అయితే రెండో పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ (బెంగళూరు) 15–7, 12–15, 3–15తో సమీర్‌ వర్మ (ముంబై) చేతిలో కంగుతిన్నాడు. దీంతో ఇరు జట్లు 3–3తో సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణాయక పురుషుల డబుల్స్‌లో మొహమ్మద్‌ అహ్‌సాన్‌–హెండ్ర సెతియవాన్‌ (బెంగళూరు) ద్వయం 15–13, 15–10తో కిమ్‌ జీ జాంగ్‌–లీ యంగ్‌ డే (ముంబై) జంటపై గెలువడంతో రాప్టర్‌ నాలుగో సీజన్‌ విజేతగా అవతరించింది. విజేతగా నిలిచిన బెంగళూరు రాప్టర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top