
బంగ్లాకు స్టోక్స్ గాయం!
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను విజయం ఊరించినట్లే ఊరించి చివరకు నిరాశను మిగిల్చింది.
చిట్టగాంగ్:ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను విజయం ఊరించినట్లే ఊరించి చివరకు నిరాశను మిగిల్చింది. ఆఖరి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బంగ్లాకు షాకిచ్చాడు. దాంతో ఇంగ్లండ్ విసిరిన 286 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 253/8 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ చివరి రెండు వికెట్లను పది పరుగుల వ్యవధిలో కోల్పోయి పరాజయం చెందింది. ఈ రోజు ఆటలో బంగ్లాకు 33 పరుగులు అవసరమైన క్రమంలో బెన్ స్టోక్స్ ఒక్క బంతి వ్యవధిలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్కు విజయాన్ని అందించాడు.
బంగ్లా స్కోరు 263 పరుగుల వద్ద ఓవర్ నైట్ ఆటగాడు తైజుల్ ఇస్లామ్(16) తొమ్మిదో వికెట్ గా అవుట్ కాగా, అదే స్కోరు వద్ద షాఫుల్ ఇస్లామ్ డకౌట్ వెనుదిరిగాడు. దాంతో మరో ఓవర్ నైట్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్(64 నాటౌట్) అవతలి ఎండ్లో ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ రాణించిన స్టోక్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 293 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 240 ఆలౌట్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 248 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 263 ఆలౌట్