
నాలుగో స్థానంలో కెప్టెన్ ఖాయం
రేపటి నుంచి తొలి టెస్టు
తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
లీడ్స్: భారత టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌కు సంబంధించి నాలుగో స్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ‘ఆల్‌టైమ్ గ్రేట్’ సచిన్ టెండూల్కర్ తన 200 టెస్టుల సుదీర్ఘ కెరీర్‌లో 179 టెస్టుల్లో నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. 1992లో సచిన్ ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ వరకు కొనసాగాడు. సచిన్ వీడ్కోలు పలికిన తర్వాత భారత్ ఆడిన తొలి టెస్టు నుంచే మరో దిగ్గజం విరాట్ కోహ్లి నాలుగో స్థానాన్ని భర్తీ చేశాడు. విరాట్ 99 టెస్టుల్లో ఆ స్థానంలో బరిలోకి దిగాడు.
మిడిలార్డర్‌లో పదునైన బ్యాటింగ్‌తో టెస్టు మ్యాచ్ గమనాన్ని శాసించే అవకాశం ఉన్న ఈ స్థానంలోకి ఇప్పుడు కొత్త ఆటగాడు వస్తున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయమైంది. టీమ్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ విషయాన్ని నిర్ధారించాడు. ‘బ్యాటింగ్ ఆర్డర్‌లో శుబ్‌మన్ నాలుగో స్థానంలో ఆడతాడు. నేను ఎప్పటిలాగే ఐదో స్థానంలోనే కొనసాగుతాను. అయితే మూడో స్థానం విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దానిపై చర్చిస్తున్నాం’ అని పంత్ వెల్లడించాడు.
తనకూ, కెప్టెన్ గిల్‌కు మధ్య మైదానం బయట ఉన్న సాన్నిహిత్యం జట్టు సానుకూల ఫలితాలు రాబట్టేందుకు ఉపయోగపడుతుందని పంత్ వ్యాఖ్యానించాడు. ‘మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. సహజంగానే ఇది మైదానంలో కూడా ప్రతిఫలిస్తుంది. మేమిద్దరం బాగా కలిసిపోయి ఏ విషయాన్ని అయినా సౌకర్యవంతంగా చర్చించుకోగలం. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతున్నా’ అని అతను అన్నాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లాంటి దిగ్గజాలు దూరం కావడం ఇంగ్లండ్ జట్టుకు కూడా లోటే అని పంత్ అభిప్రాయపడ్డాడు.
‘అండర్సన్, బ్రాడ్ లేకపోవడం మాకు కాస్త ఊరట అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్లు వారు జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. గత రెండు సిరీస్‌లలో నేను వారిని ఎదుర్కొన్నాను. అయితే ప్రస్తుత ఇంగ్లండ్ బౌలింగ్ బృందం కూడా పదునుగా ఉంది. మేం ఎవరినీ తక్కువగా అంచనా వేయడం లేదు. పరిస్థితులను బట్టి వారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మా యువ ఆటగాళ్లూ సిద్ధంగా ఉన్నారు’ అని పంత్ వివరించాడు.
కోహ్లితో తలపడాలనుకున్నా: స్టోక్స్
తమతో ఆడే సిరీస్‌లో విరాట్ కోహ్లి లేకపోవడం అవమానకరంగా అనిపిస్తోందని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. భారత్‌కు ఇది పెద్ద లోటని అతను అభిప్రాయపడ్డాడు. ‘మైదానంలో కోహ్లి ప్రదర్శించే పోరాటతత్వం, ఎలాగైనా గెలిచేందుకు పోటీ పడే శైలిని భారత్ కోల్పోయింది. 18 నంబర్ జెర్సీకి అతను ఒక స్థాయిని కల్పించాడు. ఇప్పుడు ఆ జెర్సీ మైదానంలో కనిపించదు. కోహ్లికి ప్రత్యర్థి గా తలపడాలని నేను ఎంతో కోరుకున్నాను. మైదానంలో పోటీపడే విషయం మా ఇద్దరి లక్షణాలు ఒకటే. నీతో ఆడే అవకాశం లేకపోవడం అవమానంగా భావిస్తున్నాను అని నేను కోహ్లికి మెసేజ్ పంపించా’ అని స్టోక్స్ వెల్లడించాడు.
మరోవైపు భారత జట్టు ఈ సిరీస్ కోసం అన్ని విధాలుగా సన్నద్ధమై వచ్చిందని... తమకు గెలుపు అంత సులువు కాదని ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్ జో రూట్ వ్యాఖ్యానించాడు. ‘నా దృష్టిలో ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత్ లాంటి జట్టుతో తలపడేందుకు నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. టీమిండియా చాలా బలంగా ఉంది. పదునైన పేస్ బౌలింగ్, ప్రతిభావంతులైన బ్యాటర్లు, బలమైన స్పిన్‌తో వారంతా సన్నద్ధమై వచ్చారు. స్వదేశంలో మా రికార్డు మాకు కొంత సానుకూలాంశం’ అని రూట్ స్పందించాడు.
బ్యాటింగ్ పిచ్ సిద్ధం...
తొలి టెస్టులో బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్ అందుబాటులో ఉండటం దాదాపు ఖాయమైంది. ‘బజ్‌బాల్’ శైలిలో దూకుడుగా ఆడేందుకు సిద్ధమైన ఇంగ్లండ్ తమ ఆలోచనలకు తగిన రీతిలో పిచ్‌ను సిద్ధం చేయిస్తోంది.
క్రిస్ వోక్స్ పునరాగమనం
తొలి టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌కు ఇందులో చోటు దక్కింది. గాయం కారణంగా వోక్స్ ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టులకు దూరమయ్యాడు. మూడో స్థానంలో యువ ఆటగాడు బెథెల్‌ను కాదని ఓలీ పోప్‌కు ఇంగ్లండ్ ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్టును మినహాయిస్తే దాదాపు ఏడాది కాలంగా పోప్ వరుసగా విఫలమవుతున్నా... అతని అనుభవాన్నిదృష్టిలో ఉంచుకొని టీమ్‌లోకి ఎంపిక చేసింది. ముగ్గురు పేసర్లతో పాటు ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ బరిలోకి దిగుతాడు.
తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, వోక్స్, కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.