‘అందుకు నా పెద్దన్న కుంబ్లేనే కారణం’

Because Of Anil Kumble I Could recover, Saqlain Mushtaq - Sakshi

కరాచీ:  భారత క్రికెట్‌లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్‌ కుంబ్లే ఒకడు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గానే కాకుండా కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు కుంబ్లే. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేయడంతో అది నచ్చని మన క్రికెటర్లు అతని పర్యవేక్షణకు ముగింపు పలికారు. తన కోచింగ్‌ ముగింపును కూడా ఏమాత్రం వివాదం చేయకుండా గౌరవంగా తప్పుకున్నాడు కుంబ్లే. ఇప‍్పటివరకూ కుంబ్లే ఒకరిచేత విమర్శించబడటం కానీ, వేరే వాళ్లను విమర్శించడం కానీ చాలా అరుదు. ఒకవేళ ఏమైనా ఎవరిపైనా అయిన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చినా సుతిమెత్తగానే కుంబ్లే వారిస్తాడు. 

ప్రధానంగా చెప్పాలంటే చేతనైతే సాయం లేకపోతే ఏమి మాట్లాడకుంటా కూర్చోవడమే కుంబ్లేకు తెలిసిన లక్షణం అంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా కుంబ్లే ఒక మానవతావాది అంటూ పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. తనకు కుంబ్లే పెద్దన్న లాంటివారని అభిమానాన్ని చాటుకున్నాడు సక్లయిన్‌ ముస్తాక్‌. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఎన్నో విజయాలు అందించిన ముస్తాక్‌.. ఒకానొక సందర్భంలో కుంబ్లేలో మానవీయ కోణాన్ని చూశానని వెల్లడించాడు. ఓ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన ముస్తాక్.. కుంబ్లేతో తనకున్న జ్ఞాపకాలను పంచున్నాడు. ప్రధానంగా తాను కంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు దానికి శాశ్వత పరిష్కారాన్ని కుంబ్లేను చూపెట్టాడన్నాడు. (‘ఒక్కసారిగా మరో గేల్‌ అయిపోయా’)

‘మేమప్పుడు ఇంగ్లండ్‌లో ఉన్నాం. ఆ సమయంలో కంటి సమస్యను అనిల్ భాయ్ దృష్టికి తీసుకువెళ్లాను.  దాంతో వెంటనే స్పందించిన కుంబ్లే డాక్టర్‌ భరత్‌ రుగానీ గురించి తెలియజేశారు. కుంబ్లేతో పాటు సౌరవ్‌ గంగూలీ కూడా ఆయన దగ్గర కంటికి సంబంధించి ట్రీట్‌మెంట్‌మెంట్‌ తీసుకుంటామని చెప్పాడు. హార్లే స్ట్రీట్‌(లండన్‌)లో ఉండే డాక్టర్ భరత్ దగ్గరికి వెళ్లమని చెప్పి.. కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వెళ్లి కలిశాను. నా కళ్లను పరీక్షించిన ఆయన లెన్స్ ఇచ్చారు. నాకున్న సమస్య అప్పటి నుంచి తీరింది.  నా తీవ్రమైన కంటి సమస్యకు పాకిస్తాన్‌లో చాలామంది కంటి డాక్టర్ల వద్దకు వెళ్లాను. కానీ ఎవరూ నా సమస్యను తీర్చలేకపోయారు. కుంబ్లే సాయంతో భరత్‌ రుగానీ చేసిన ట్రీట్‌మెంట్‌ ఫలించింది’ అని సక్లయిన్‌ ముస్తాక్‌ చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడూ కుంబ్లేను  పెద్దన్న లానే చూస్తానని, తాము ఎప్పుడూ కలిసిన ఒకరి సంస్కృతిని గౌరవించుకుంటూ ఎన్నో విషయాలను షేర్‌ చేసుకుంటామని సక్లయిన్‌ తెలిపాడు. తామిద్దరం ఎప్పుడూ కూడా క్రికెట్‌లో ప్రత్యర్థులుగానే తలపడ్డామని,  ఒకే జట్టులో ఎప్పుడూ లేమన్నాడు. అవకాశం వస్తే ఇద్దరం కలిసి ఒకే జట్టులో ఆడాలని తాను కోరుకుంటున్నానని సక్లయిన్‌ తెలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top