బంగ్లాతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

BCCI Announced Indian Team For T20 And Test Series With Bangladesh - Sakshi

బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమీటి సమావేశానికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాజరయ్యారు. కాగా టీ20 సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన్న జట్టునే కొనసాగించినట్లు సెలక్షన్‌ కమిటీ పేర్కొంది.

దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్షన్‌ కమిటీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. విజయ్‌ హజారే ట్రోఫీలో 212 పరుగులతో సత్తా చాటిన సంజూ శాంసన్‌కు 4 ఏళ్ల తర్వాత టీమిండియా నుంచి మళ్లీ పిలుపొచ్చింది. అతను చివరగా 2015లో జింబ్వాబేలో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. వెన్నుగాయంతో భాదపడుతూ ఇటీవలే సర్జరీ చేయించుకున్న హార్ధిక్‌ పాండ్యా స్థానంలో ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేను ఎంపిక చేశారు. అనూహ్యంగా టీ20 జట్టులో నవదీప్‌ సైనీ స్థానంలో ముంబై మీడియం పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ చోటు సంపాదించడం విశేషం.  

కృనాల్‌ పాండ్యా తన స్థానాన్ని నిలుపుకోగా, మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన చహల్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఇక కుల్దీప్‌ యాదవ్‌ టెస్టు జట్టులో స్థానం నిలుపుకున్నా టీ20లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే టీ20 జట్టులో లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌లు తమ స్థానాలను కాపాడుకున్నారు. 

టీ20 జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, కృనాల్‌ పాండ్యా, యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, శివమ్‌ దూబే, శార్దుల్‌ ఠాకూర్‌

టెస్టు జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్దిమాన్‌ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మాన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top