
ఐదు ఓటముల తర్వాత తొలి గెలుపు!
గత ఐదు టెస్టుల్లో ఘోర ఓటమి తరువాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తొలి గెలుపు రుచిని చూసింది.
అడిలైడ్: గత ఐదు టెస్టుల్లో ఘోర ఓటమి తరువాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు తొలి గెలుపు రుచిని చూసింది. దక్షిణాఫ్రికాతో పింక్ బాల్ తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విసిరిన 127 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా ఓపెనర్లు రెన్ షా (34), డేవిడ్ వార్నర్ (47)లు శుభారంభాన్ని అందించారు.
ఈ జోడి తొలి వికెట్ కు 64 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత వార్నర్ అవుటయ్యాడు. అయితే మరో స్టార్ ఆటగాడు ఖాజా డకౌట్గా పెవిలియన్ చేరడంతో ఆసీస్ ఆందోళనకు గురైంది. కాగా, లక్ష్యం స్వల్ప కావడంతో మిగతా బాధ్యతను కెప్టెన్ స్టీవ్ స్మిత్(40) తన భుజాలపై వేసుకుని జట్టును గెలిపించాడు. ఇది ఆసీస్కు ఐదు ఓటములు తరువాత తొలి గెలుపు కావడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు శ్రీలంకతో వరుసగా మూడు టెస్టుల్లో ఆసీస్ పరాజయం చెందింది.
194/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 250 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ ఆటగాడు స్టీఫెన్ కుక్(104;240 బంతుల్లో 8 ఫోర్లు) శతకం సాధించాడు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 259/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 250 ఆలౌట్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 383 ఆలౌట్