దీపిక ఖాతాలో కాంస్య పతకం | Sakshi
Sakshi News home page

దీపిక ఖాతాలో కాంస్య పతకం

Published Mon, Oct 1 2018 5:22 AM

Archer Deepika Kumari wins bronze at World Cup Final - Sakshi

సామ్సన్‌ (టర్కీ): ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత్‌ తమ పోరాటాన్ని కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం జరిగిన మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్‌ దీపిక కుమారి కాంస్య పతకాన్ని సాధించింది. లీసా ఉన్రూ (జర్మనీ)తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దీపిక ‘షూట్‌ ఆఫ్‌’లో విజయం సొంతం చేసుకుంది. నిర్ణీత ఐదు సెట్‌ల తర్వాత ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్‌ అవకాశం ఇచ్చారు. ఇద్దరూ బాణాన్ని 9 పాయింట్ల వృత్తంలోనే కొట్టారు. అయితే లీసా సంధించిన బాణంకంటే దీపిక బాణం 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌కు పతకం ఖాయమైంది. 

ఒక్కో సెట్‌లో ఇద్దరికీ మూడు షాట్‌ల చొప్పున అవకాశం ఇస్తారు. సెట్‌ గెలిస్తే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్‌ లభిస్తుంది. తొలి సెట్‌ను దీపిక 28–25తో సొంతం చేసుకోగా... రెండో సెట్‌ను లీసా 25–22తో గెల్చుకుంది. మూడో సెట్‌ను దీపిక 30–28తో కైవసం చేసుకోగా... నాలుగో సెట్‌ 28–28తో సమంగా ముగిసింది. ఐదో సెట్‌ను లీసా 29– 28తో నెగ్గడంతో ఇద్దరి స్కోర్లు 5–5తో సమమయ్యాయి. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో దీపిక 6–4తో లీ చియెన్‌ యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలుపొంది... సెమీస్‌లో 3–7తో యాస్మీన్‌ అనాగోజ్‌ (టర్కీ) చేతిలో ఓడిపోయింది. స్వర్ణ పతక మ్యాచ్‌లో లీ యున్‌ గ్యాయోంగ్‌ (దక్షిణ కొరియా) 6–4తో యాస్మీన్‌పై గెలిచింది. 

 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టోర్నీలో దీపిక నెగ్గిన పతకాలు. 2011, 2012, 2013, 2015లలో ఆమె రజత పతకాలు గెలిచింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement