
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల పెళ్లి.. ఇప్పుడు ఏ సోషల్ సైట్‌లు చూసినా, న్యూస్ పేపర్లు చదివినా, టీవీ చానెళ్లు మార్చినా... వీరిద్దరి పెళ్లి మాటే! ఇటలీలోని టస్కనీ నగరంలోని ఓ బోర్గో ఫినోచీటోలో ‘విరుష్క’ల వివాహ వేడుకకు రంగం సిద్ధమైందని.. అక్కడి రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారని ఇపుడు జరుగుతున్న చర్చ. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు.
'విరాట్ - అనుష్కల పెళ్లి జరగబోవడం కాదు.. అల్‌రెడీ వాళ్లు పెళ్లి చేసుకున్నారు' అని ట్వీట్ చేశారు. గత శనివారమే ఆ జంట ఒక్కటైందన్నారు. ఈ విషయాన్నే త్వరలో విరుష్కలు అధికారికంగా ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డిసెంబర్ 9-12 తేదీల మధ్యలో వీరి వివాహం జరుగుతుందనే తొలుత ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా వార్త ఆసక్తికరంగా మారింది.
అయితే జర్నలిస్ట్ ట్వీట్ నిజమా? కాదా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఏదీ ఎలా ఉన్నా టస్కనీలోని బోర్గో ఫినోచీటోలో పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు. కాగా డిసెంబర్ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లికి షారుఖ్ ఖాన్, అమిర్, సచిన్, యువరాజ్ లను ఆహ్వానించారని, వారు ఈ వేడుకలో హాజరవుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజాలు కావని తేలిపోయింది.