టీమిండియాదే సిరీస్‌

All round India clinch series in third ODI - Sakshi

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్‌ గెలుపును అందుకుంది. తద్వారా ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తేడాతో చేజిక్కించుకుంది. రోహిత్‌ శర్మ(62; 77 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి(60; 74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌)లు భారత్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.

న్యూజిలాండ్‌ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ ఆది నుంచి దూకుడుగా ఆడింది.  ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ధావన్‌ బౌండరీలతో స్కోరును పరుగులు పెట్టించాడు. కాగా, జట్టు స్కోరు 39 పరుగుల వద్ద ఉండగా ధావన్‌(28; 27 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.


ఆ తరుణంలో రోహిత్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. ఈ క్రమంలోనే రోహిత్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరొకవైపు కోహ్లి కూడా హాఫ్‌ సెంచరీతో రాణించాడు. 59 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్‌తో అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ 113 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత రోహిత్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి కోహ్లి కూడా ఔట్‌ కావడంతో భారత్‌ జట్టు 168 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత అంబటి రాయుడు-దినేశ్‌ కార్తీక్‌ల జంట సమయోచితంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించింది. రాయుడు(40 నాటౌట్‌; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌), దినేశ్‌ కార్తీక్‌(38 నాటౌట్‌; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఆకట్టుకోవడంతో భారత్‌ 43 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు సాధించగా, సాంత్నార్‌ వికెట్‌ తీశాడు.

అంతకుముందు  బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 243 పరుగులకు ఆలౌటైంది. రాస్‌ టేలర్‌(93;106 బంతుల్లో 9 ఫోర్లు), టామ్‌ లాథమ్‌(51; 64 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్‌(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్‌ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌-రాస్‌ టేలర్‌ జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్‌(28) పెవిలియన్‌ బాట పట్టాడు.

అటు తర్వాత టేలర్‌-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఈ జంట 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్‌ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, లాథమ్‌ కూడా అర్థ శతకంతో మెరిశాడు.  హాఫ్‌ సెంచరీ సాధించిన లాథమ్‌ స్కోరును పెంచే క్రమంలో ఔటయ‍్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్‌, సాంత్నార్‌లు ఔటయ్యారు. దాంతో కివీస్‌ 20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను చేజార‍్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే  బాధ్యత టేలర్‌పై పడింది. కాగా, టేలర్‌ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చిన టేలర్‌ సెంచరీ సాధించే అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. అనంతరం కివీస్‌ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టడంతో ఆ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది.  భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నాల్గో వన్డే గురువారం జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top