శ్రీ వేంకటేశ్వర వైభవం

Tirumala Brahmotsavam 2017 Special Story on Tirumala History - Sakshi

ద్వాపర యుగం చివరి రోజుల్లో ధర్మం అడుగంటింది. అధర్మం పెచ్చుమీరింది. లోకం అంతటా అశాంతి, అలజడి, హింస ఆవరించాయి. ప్రజల్లో మాంసభక్షణ పెరిగింది. మద్యపానం నిత్యకృత్యంగా మారింది. దుర్భర పరిస్థితుల్లో లోకం అల్లాడసాగింది.  కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం భగవంతుడు అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది. మానవాళి శ్రేయస్సు కోసం యజ్ఞం చేయాలని యోగులు, మునిపుంగవులు, మహర్షులు, దేవతలు సంకల్పించారు. అయితే, యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోయాలనే ధర్మసందేహం వారిలో కలిగింది. ముందుగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పో, ఎవరు ఉత్తమోత్తముడో తేల్చుకున్న తర్వాతే వారికి ఆ యజ్ఞఫలాన్ని ధారపోయాలని నిర్ణయించారు. లోక కల్యాణం కోసం చేపడుతున్న ఈ మహత్కార్యాన్ని నిర్వహించాల్సిందిగా భృగు మహర్షిని కోరారు దేవతలు. పరమ భాగవతోత్తముడైన భృగు మహర్షి దేవతల కోరికను మన్నించాడు.

‘మహా మహిమాన్వితులైన త్రిమూర్తులను పరీక్షించి, వారిలో ఎవరు సర్వశక్తి సత్వగుణ సంపన్నులో, జగత్కల్యాణ కారకులెవరో తేల్చి చెప్పడం దుస్సాధ్యమైన పని. నా ప్రయత్నంలో భవిష్యత్తులో జరగబోయే లోకకల్యాణం గోచరిస్తోంది. ఈ మహత్కార్యంలో నేను నావంతు పాత్ర పోషించడం సుకృతమే కదా!’ అని తలపోస్తూ నడుస్తున్నంతలోనే సత్యలోకం చేరుకున్నాడు భృగుమహర్షి. సత్యలోకంలో ఆయన అడుగుపెట్టే సమయానికి సువిశాల దివ్య సభా భవనంలో సరస్వతీ సమేతుడై కొలువుదీరిన బ్రహ్మ తన చతుర్ముఖాలతో నాలుగు వేదాలనూ వల్లిస్తున్నాడు. మరోవైపు తన మనో సంకల్పంతోనే సకల చరాచర జగత్తునూ సృష్టిస్తూ ఉన్నాడు.

 సరస్వతీదేవి వీణ మోగిస్తోంది. భృగు మహర్షి వినమ్రుడై బ్రహ్మకి సాష్టాంగ ప్రణామం చేశాడు. స్తోత్రగానంతో కీర్తించాడు. బ్రహ్మ ఆయనను గమనించలేదు. ఆయన ప్రార్థనను ఆలకించలేదు. కనీసం కన్నెత్తి చూడలేదు. ఎప్పటికైనా బ్రహ్మ తనను చూడకపోతాడా అనే ఉద్దేశంతో భృగుమహర్షి స్తోత్రాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఎంతకీ బ్రహ్మ తనను పలకరించకపోవడంతో భృగు మహర్షికి సహనం నశించింది. ఉద్దేశపూర్వకంగానే బ్రహ్మదేవుడు పలకడం లేదని, ఇది తనకు తీరని అవమానమని భావించాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘ఎంతటి సృష్టికర్త అయినా ఈ బ్రహ్మదేవుడు రజోగుణంతో నిండి ఉన్నాడు. ఇతడిలో సత్వగుణం లేశమైనా లేదే! ఇతడు ఇక లోకానికి మేలేమి చేయగలడు? దేవతలలో సర్వోన్నత స్థానం పొందడానికి, మహర్షులు సమర్పించే యజ్ఞఫలాన్ని అందుకోవడానికి ఇతడు అర్హుడు కాదు’ అని తలపోసి, ‘బ్రహ్మకి భూలోకంలో ఆరాధనలు, పూజలు లేకుండుగాక’ అని శపించి, అక్కడి నుంచి కైలాస మార్గం పట్టాడు భృగు మహర్షి.

కైలాస దర్శనం
సత్యలోకంలో బ్రహ్మ తనకు చేసిన అవమానానికి అశాంతితో రగిలిపోతూనే కైలాసం వైపు పయనం సాగించాడు భృగు మహర్షి. కైలాసం ముంగిట అడుగుపెడుతూనే ద్వారపాలకుడైన నందీశ్వరుడు ఆయనను అడ్డగించాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారని, ఎవరూ లోనికి ప్రవేశించరాదని చెప్పాడు. అసలే కోపంతో ఉన్న భృగు మహర్షికి నందీశ్వరుడి మాటలు మరింతగా కోపం తెప్పించాయి. ఉచితానుచితాలను మరచి నందీశ్వరుడిని పక్కకు నెట్టి, లోపలకు ప్రవేశించాడు. తమ ఏకాంతానికి భంగం కలిగిస్తూ దురుసుగా లోపలకు ప్రవేశించిన భృగువును చూసి పరమశివుడు శివమెత్తి నర్తిస్తూ త్రిశూలంతో అతడిని పొడవడానికి ఉద్యుక్తుడయ్యాడు.

అంతలో పార్వతీదేవి పరమశివునికి అడ్డు నిలిచి, వారించింది. ‘ప్రభూ! విచక్షణాజ్ఞానం లోపించిన ఈ మహర్షిని దయతో క్షమించి విడిచిపెట్టండి’ అని ప్రార్థించింది. సమయానికి పార్వతీదేవి అడ్డు పడటంతో భృగు మహర్షి ప్రాణాలు దక్కాయి. ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఆయన బయటపడ్డాడు. ‘ఈ పరమేశ్వరుడు తామసగుణంతో నిండి ఉన్నాడు. ఇలాంటివాడు దేవతలలో సర్వోన్నత స్థానం ఎలా పొందగలడు? ఇతడికి యజ్ఞఫలాన్ని పొందే అర్హత లేదుగాక లేదు’ అని నిర్ణయించుకున్నాడు. ‘ఇతడు భూలోకంలో స్థాణువై, లింగాకారంలో మాత్రమే పూజలు పొందు గాక!’ అని శపించాడు. ఇక అక్కడి నుంచి వైకుంఠం వైపు బయలుదేరాడు.

వైకుంఠ ప్రవేశం
సత్యలోకంలో, కైలాసంలో ఎదురైన అనుభవాలతో తీవ్ర మనస్తాపం చెందిన భృగు మహర్షి ఆలోచనలు కొనసాగుతుండగా వైకుంఠానికి చేరుకున్నాడు. క్షీరసముద్రంలో శ్రీమహావిష్ణువు శేషతల్పంపై అరమోడ్పు కనులతో తన్మయావస్థలో శయనించి ఉండగా, ఆయన హృదయంపై శ్రీ మహాలక్ష్మి తలవాల్చి మైమరచి గడుపుతున్న మధుర క్షణాలవి. అలాంటి రసవత్తర సమయంలో వైకుంఠంలో అడుగుపెట్టిన భృగుమహర్షి శ్రీమహావిష్ణువుకు సాష్టాంగ ప్రణామం ఆచరించి, స్తోత్రాలతో కీర్తించసాగాడు.బాహ్యప్రపంచాన్ని శ్రీమహాలక్ష్మితో సరస సంభాషణలతో మునిగినట్లుగా భ్రమింపజేస్తూ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమహావిష్ణువు పరాకు ప్రదర్శించాడు.

భృగు మహర్షి రాకను గమనించనట్లుగానే శ్రీమహాలక్ష్మిని మరింతగా అక్కున చేర్చుకున్నాడు. అప్పటికే బ్రహ్మదేవుని వద్ద, పరమేశ్వరుని వద్ద పరాభవం పొందిన భృగుమహర్షికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన మహాలక్ష్మి పక్కకు తొలగింది. విసురుగా వచ్చిన మహర్షి కాలు శ్రీహరి వక్షస్థలాన్ని బలంగా తాకింది. మహర్షి పాదతాడనంతో శ్రీమహావిష్ణువు వెంటనే శేషపాన్పుపై నుంచి తటాలున లేచాడు. కోపంతో ఊగిపోతున్న భృగుమహర్షికి ప్రణామం చేశాడు. మునివర్యుని రాకను గమనించని తన ఏమరుపాటును మన్నించమని ప్రాధేయపడ్డాడు. ఆయనను సగౌరవంగా తోడ్కొని వచ్చి, శేషపాన్పుపై కూర్చుండబెట్టాడు.

భృగు మహర్షి పాదాల చెంత కూర్చుని, పాదాలను ఒత్తుతూ, ముని పాదంలో ఉన్న అజ్ఞానంతో కూడిన కంటిని చిదిమివేశాడు. పాదంలోని కన్ను శ్రీహరి చేతుల్లో చితికిపోవడంతో భృగుమహర్షికి అహంకారం, అజ్ఞానం అడుగంటాయి. కాలితో తన్నిన తన తప్పిదానికి క్షమించమని కోరుతూ శ్రీహరిని పరిపరి విధాల స్తుతించాడు. త్రిమూర్తులలో శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమోన్నతుడు. పరమ శ్రేష్ఠుడు. సత్వగుణ సంపన్నుడు అని, ఆయన మాత్రమే మహర్షులు నిర్వహించే యాగఫలాన్ని స్వీకరించడానికి అన్నివిధాలా యోగ్యుడని తీర్మానించాడు. శ్రీహరి పురుషోత్తమ తత్వాన్ని అనేక విధాలుగా స్తుతిస్తూ వైకుంఠం నుంచి భూలోకానికి పయనమయ్యాడు. నారదుడి ఆనతి మేరకు, మహర్షుల ప్రార్థనలపై ముల్లోకాలకు స్వయంగా వెళ్లి, త్రిమూర్తులలోకెల్లా వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు మాత్రమే సర్వోన్నతుడైన వాడని నిగ్గు తేల్చుకున్నట్లు ప్రకటించాడు. భృగుమహర్షి మాటలకు సంతోషించిన మునీశ్వరులందరూ ఘనంగా యాగాన్ని నిర్వహించారు. యాగఫలాన్ని శ్రీమహా విష్ణువుకు సమర్పించారు.

ఆదిలక్ష్మి భూలోక పయనం
తన నివాసస్థలమైన శ్రీహరి వక్షస్థలాన్ని భృగు మహర్షి కాలితో తన్ని అపవిత్రం చేయడాన్ని శ్రీమహాలక్ష్మి ఎంతమాత్రం సహించలేకపోయింది.  ‘ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన మునీశ్వరుడిని నా స్వామి దండించకపోగా, తనతో సమానంగా శేషపాన్పుపై సగౌరవంగా కూర్చోబెట్టాడు. అంతటితో ఊరుకున్నాడా? తనను తన్నినందుకు అతడి పాదాలు కందినవేమోనని పరామర్శిస్తూ ఆ పాదాలను ఒత్తడమా! ఇది మరింత మనోవేదన కలిగిస్తోంది’ అని తలపోస్తూ అవమాన భారంతో దహించుకుపోయింది శ్రీమహాలక్ష్మి. మునిపాద తాడనంతో అపవిత్రమైన స్వామి హృదయంలో ఇక తనకు స్థానం లేదని తీవ్ర మనస్తాపంతో వైకుంఠాన్ని వీడి భూలోకానికి బయలుదేరడానికి సిద్ధపడింది. తనను విడిచి వెళ్లవద్దని మహావిష్ణువు ఎంతగానో వేడుకున్నాడు. అయినప్పటికీ మహాలక్ష్మి శాంతించలేదు. తీవ్రమైన కోపంతో, తీరని దుఃఖభారంతో స్వామి ప్రార్థనలను లెక్కచేయకుండా వైకుంఠాన్ని వీడి భూలోకాన్ని చేరుకుంది. భూలోకంలో పుణ్యస్థలమైన కొల్హాపురమనే చోట ఒంటరిగా తపస్సు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉంది.

శ్రీమహావిష్ణువు వైరాగ్యం
వైకుంఠంలో తనను అనునిత్యం సేవిస్తూ ఆనందింపజేసే తన ఇల్లాలు శ్రీమహాలక్ష్మీదేవి అర్ధంతరంగా తనను విడిచి వెళ్లడాన్ని శ్రీమహావిష్ణువు ఎంతమాత్రం భరించలేక పోయాడు. తన హృదయేశ్వరి లక్ష్మీదేవి లేని వైకుంఠంతో ఇక పనేమిటని వైరాగ్యానికి లోనయ్యాడు. ‘లక్ష్మీ..! లక్ష్మీ..!’ అంటూ వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి తరలివచ్చాడు. ఆమె కోసం భూలోకమంతా వెతికి వేసారిపోయాడు. అయినా ఆమె జాడ కానరాలేదు. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠానికి వెళ్లడం వ్యర్థమనిపించింది. లక్ష్మీదేవి జాడకోసం వెదుకుతూ చివరకు వేంకటాచల పర్వతానికి చేరుకున్నాడు విష్ణువు.

చింతచెట్టు తొర్రలో తలదాచుకున్న స్వామి
వేంకటాచల పర్వతసానువులలో తిరుగుతూ ఉన్న శ్రీమహావిష్ణువుకు అక్కడ ఒక పుష్కరిణి కనపడింది. దానికి దక్షిణాన విశాలమైన చింతచెట్టు గోచరించింది. చెట్టు కింద విశాలమైన పుట్ట కనిపించింది. ఆ చింతచెట్టును, ఆ చెట్టు కింది పుట్టను విష్ణువు కోసమే బ్రహ్మ సృష్టించాడు. దిక్కు తెలియక తిరుగుతున్న విష్ణువు బాగా అలసిపోయినాడు. అలా అలసి పోయిన స్వామికి చింతచెట్టు తన చల్లని నీడలో సేదతీర్చుకొమ్మని పిలిచినట్లుగా తోచింది. అంతే! ఆనందంతో విశాలమైన ఆ చింతచెట్టు కిందికి చేరాడు. చెట్టు కిందే వున్న పుట్టలోని తొర్రలో తలదాచుకున్నాడు. అలా ఆ తొర్రలోనే తలదాచుకుంటూ కాలం వెళ్లదీయసాగాడు.  

గోపాలికగా శ్రీమహాలక్ష్మి, గోవుగా బ్రహ్మ...
శ్రీమహావిష్ణువు కారడవిలో చింతచెట్టు కింది పుట్టలో తలదాచుకుని ఆకలిదప్పులతో అలమటిస్తూ ఉన్న విషయాన్ని కొల్హాపురంలో కొలువై ఉన్న శ్రీమహాలక్ష్మి బ్రహ్మాది దేవతల ద్వారా తెలుసుకుని బాధపడింది. అయితే, స్వామి వద్దకు వెళ్లడానికి మాత్రం ససేమిరా అన్నది. శ్రీనివాసుని ఆకలి దప్పులు తీర్చడానికి బ్రహ్మ, శివుడు స్వయంగా ప్రార్థించడంతో వారి కోరికను మన్నించింది. బ్రహ్మదేవుడు గోవుగా, శివుడు దూడగా మారగా, లక్ష్మీదేవి గోపాలికగా మారింది. బ్రహ్మ మహేశ్వరులు గోవుగా, దూడగా చోళరాజు గోశాలలోని పశువుల మందలో చేరారు.

శ్రీనివాసుని ఆకలి తీర్చిన గోవు
చోళరాజు పశువుల కాపరి ప్రతిరోజూ మందతో పాటు కొత్తగా వచ్చిన ఆవును, దూడను కూడా మేతకు తోలుకుపోయేవాడు. మేతకు వెళ్లిన కొత్త ఆవు, దూడతో కూడా పశువుల మందను వదిలి, కాపరి కళ్లు గప్పి అడవిలోని చింతచెట్టు కింద పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుని వద్దకు వెళ్లి ధారగా పాలు కార్చేది. పుట్టలోని దేవుడు ఆ పాలను కడుపారా తాగుతూ తృప్తి చెందేవాడు. పాలను వదిలిన తర్వాత మళ్లీ యథాప్రకారం ఆవు, దూడ తిరిగి మందలో చేరి రాజుగారి గోశాలకు చేరుకునేవి. ఇలా కొంతకాలం సాగింది.

శ్రీనివాసునిపై గొల్లవాని గొడ్డలి వేటు
ఎంతకాలమవుతున్నా కొత్తగోవు ఏమాత్రం పాలు ఇవ్వకపోతుండటంతో రాణివారు గొల్లవానిపై కోపించి రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజుగారు గొల్లవాణ్ణి పిలిపించి, అతడిని కొరడాతో కొట్టించారు. ఆవునూ దూడనూ జాగ్రత్తగా గమనించాలని హెచ్చరించారు. రాజుగారి హెచ్చరికతో ప్రాణభీతి చెందిన గొల్లవాడు కొత్త ఆవునూ దూడనూ జాగ్రత్తగా గమనించసాగాడు. మధ్యాహ్న సమయంలో అతడికి ఒక విచిత్ర సన్నివేశం కనిపించింది. ఆవు, దూడ మందను విడిచిపెట్టి కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లడం చూశాడు.  అతడు కూడా వాటిని అనుసరించాడు. ఆవూ దూడా పుష్కరిణి సమీపానికి చేరుకున్నాయి. ఆవు పుట్టను ఎక్కి దాని బొరియలోకి పాలను ధారగా విడువసాగింది. అది చూసిన గొల్లవానికి కోపం కట్టలు తెంచుకుంది. దొంగచాటుగా వెనుక నుంచి వచ్చి ఆవుపై చేతిలో ఉన్న గొడ్డలి ఎత్తి గట్టిగా కొట్టాడు. అలికిడికి బెదిరిన ఆవు పక్కకు తప్పుకోవడంతో పుట్టలో దాగిన శ్రీనివాసుడు గభాలున పైకి లేచాడు. అంతే! గొడ్డలి వేటు శ్రీనివాసుని నుదుటికి తాకింది. నెత్తురు ధారగా చిమ్మింది. నుదుట నెత్తురోడుతూ కనిపించిన శ్రీనివాసుడిని చూస్తూ దిమ్మెరపోయిన గొల్లవాడు భయభ్రాంతుడై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఆవు పరుగెత్తుకుంటూ చోళరాజు ఆస్థానానికి వెళ్లి కన్నీరు కారుస్తూ అంబారావాలు చేసింది.

చోళరాజుకు శాపం
ఆవు అంబారావాలు చేస్తుండటంతో ఏమైందో ఏమోనని ఆందోళన చెంది ఆవు వెంట నడిచాడు చోళరాజు. ఆవుతో పాటే గొల్లవాడు చచ్చిపడి ఉన్న పుట్ట దగ్గరకు చేరుకున్నాడు. అంతలో పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుడు పైకి వచ్చి ‘‘ప్రజలు, సేవకులు, భార్యా బిడ్డలు చేసిన పాపాలు ప్రభువుకు చెందుతాయి. అందువల్ల ఈ దుష్కృత్యానికి ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి. నీవు ఈ క్షణమే పిశాచ రూపాన్ని పొందెదవుగాక’’ అని శపించాడు. శ్రీనివాసుడి శాపానికి చోళరాజు ఎంతగానో తల్లడిల్లాడు. ‘‘స్వామీ! తెలియక జరిగిన దోషానికి ఇంతలా శపించడం నీకు తగునా? నీవే నాకు దిక్కు... శాప విముక్తిని సెలవివ్వు’ అని ప్రాధేయపడ్డాడు. ఆశ్రిత వత్సలుడైన శ్రీనివాసుడు కరుణించి, ‘‘రాజా! కొద్దికాలంలోనే ఆకాశరాజు తన కూతురు పద్మావతిని నాకిచ్చి పరిణయం చేస్తాడు. అల్లుడినైన నాకు ఆ రాజు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా ఇస్తాడు. నేను ఆ కిరీటాన్ని ధరించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది’’ అని సెలవిచ్చాడు. వెంటనే చోళరాజు పిశాచమై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతలో అక్కడ చచ్చిపడి ఉన్న గొల్లవాని బంధువులు ఏడుస్తూ వచ్చి స్వామివారి వద్ద మొర పెట్టుకున్నారు. శ్రీనివాసుడు వారికి అభయమిస్తూ ‘‘భూలోకంలో నన్ను తొలిసారిగా దర్శించిన వ్యక్తి ఆ పశువుల కాపరి. ఇక మీదట కలియుగాంతం వరకు ఇతని సంతతి వారైన మీకు ప్రతిరోజూ నా తొలి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను’’ అంటూ వరమిచ్చాడు.

భూ వరాహస్వామికి దాన  శాసనపత్రం
గొల్లవాని వల్ల కలిగిన గాయాన్ని మాన్పుకోవడానికి వనమూలికల కోసం వెదుకుతున్న శ్రీనివాసునికి ఆది వరాహస్వామి కనిపించాడు. శ్రీనివాసుడి రాకకు ముందు చాలాకాలం కిందటే వరాహస్వామి ఆ క్షేత్రంలో స్థిరపడ్డాడు. వరాహస్వామికి తన దీనగాథను విన్నవించుకున్నాడు శ్రీనివాసుడు. తాను ఆ క్షేత్రంలో ఉండటానికి నూరు అడుగుల స్థలాన్ని ఇమ్మని ప్రార్థించాడు. వరాహస్వామి శ్రీనివాసుడి కోరికను సమ్మతించాడు.

అయితే, తానిచ్చే నూరు అడుగుల స్థలానికి పైకం చెల్లించాలని కోరాడు. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ అయినా లేదని, అందుకు ప్రతిఫలంగా తన వద్దకు దర్శనార్థం వచ్చే భక్తుల చేత ‘మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం’ వంటి ఏర్పాటును కట్టడిగా చేయిస్తానని శ్రీనివాసుడు వాగ్దానం చేస్తూ దాన శాసనపత్రం కూడా రాసి ఇచ్చాడు. అందుకు వరాహస్వామి అంగీకరించి, స్వామి పుష్కరిణికి దక్షిణ తీరంలో శ్రీనివాసునికి స్థలాన్ని ధారాదత్తం చేశాడు. శ్రీనివాసుడి దీనగాథను ఆలకించిన ఆదివరాహస్వామి వకుళమాలిక అనే యోగినిని శ్రీనివాసుడికి సేవ చేయమని ఆదేశించాడు. వరాహస్వామి ఆనతిపై వకుళమాత శ్రీనివాసుడిని కన్నకొడుకులా సేవించసాగింది.

ఎవరీ వకుళమాత
శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడిని పొత్తిళ్ల నాటి నుంచి కంటికి రెప్పలా సాకింది యశోద. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించడమే కాకుండా, వివిధ సందర్భాలలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలను, మహిమలను కన్నులారా తిలకించి ఆనందించింది. రాక్షసుల వల్ల చిన్ని కృష్ణుడికి ఎక్కడ కీడు కలుగుతుందేమోనని ఆమె తల్లడిల్లేది. కంసుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు. వారి వద్దనే అతడికి వివాహాది కార్యక్రమాలన్నీ జరిగాయి. శ్రీకృష్ణుడికి స్వయంగా వివాహం చేసే భాగ్యానికి నోచుకోలేదని యశోద చింతాక్రాంతురాలైంది. ఆమె మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు ‘‘అమ్మా! మాతృమూర్తివి అయిన నీవు బాధపడితే ఈ కృష్ణుడికి మనుగడే లేదు.

 ఇప్పుడు పెంచి పెద్ద చేసిన చేతులతో నీవే స్వయంగా నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నాను. కలియుగంలో వేంకటాచలంపై నీవు యోగినిగా ఉన్న సమయంలో నేను శ్రీనివాసుడనే పేరుతో నీ వద్దకు చేరుతాను. అప్పుడు నీ చేతుల మీదుగానే నా వివాహం జరిపించి ఆనందించే భాగ్యాన్ని పొందగలవు’’ అని వరమిస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల యశోదాదేవి కలియుగంలో వకుళాదేవిగా అవతరించింది. అప్పటి శ్రీకృష్ణుడే నేడు శ్రీనివాసుడిగా అవతరించి వేంకటాచలానికి చేరి వరాహస్వామి అండదండలతో అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి వకుళమాత శ్రీనివాసుని ఆలనాపాలనా చూస్తూ తృప్తిగా కాలక్షేపం చేయసాగింది.

పద్మావతిని రక్షించిన శ్రీనివాసుడు
వరాహక్షేత్రంలో వకుళమాత సేవలో శ్రీనివాసుడు మహలక్ష్మిని మరచిపోయి, కొండలు కోనలు తిరుగుతూ కాలం వెళ్లబుచ్చసాగాడు. కొంతకాలానికి ఒకరోజు శ్రీనివాసుడు విల్లంబులు చేత ధరించి గుర్రం మీద స్వారీ చేస్తూ వనవిహారం చేయసాగాడు. ఇంతలో ఆ కారడవిలో ‘రక్షించండి!.. రక్షించండి!’ అనే ఆర్తనాదాలు వినిపించాయి. ఆర్తనాదాలు వినిపించిన దిశగా శ్రీనివాసుడు విల్లంబులను చేతబూని తన గుర్రాన్ని పరుగులు పెట్టించాడు. అక్కడ ఒక మదపుటేనుగు తరుముతుండగా కొందరు కన్యలు ప్రాణభీతితో ఆర్తనాదాలు చేస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీస్తూ కనిపించారు. వెంటనే శ్రీనివాసుడు ‘‘గజేంద్రా! అని బిగ్గరగా గర్జిస్తూ విల్లును గురిపెట్టి ఆ ఏనుగు ఎదుటకు వెళ్లాడు.

 ఆ గర్జనకు బెదిరిన ఏనుగు వెనుదిరిగి అడవిలోకి పారిపోయి, ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోయింది. తృటిలో తప్పిన ప్రాణాపాయం నుంచి తేరుకుని అయోమయంగా దిక్కులు చూస్తున్న యువతుల వద్దకు వెళ్లాడు శ్రీనివాసుడు. వారి మధ్య చుక్కలనడుమ చందమామలా మెరిసిపోతున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె అందచందాలకు పరవశుడై రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తూ నిలుచుండిపోయాడు. ఆ యువతి కూడా తనను ఏనుగు బారి నుంచి కాపాడిన శ్రీనివాసుడిని చూస్తూ నివ్వెరపోయింది. ఆయన రూపానికి, తేజస్సుకు మంత్రముగ్ధురాలై అలాగే చూస్తూ ఉండిపోయింది.

పద్మావతి శ్రీనివాసుల ప్రేమానురాగాలు
వారిద్దరి వాలకాన్ని గమనించిన చెలికత్తెలు ఆందోళనతో భయపడుతూ శ్రీనివాసుడిని గట్టిగా వారిస్తూ్త ‘‘ఎవరయ్యా నీవు’’? ఆమె ఎవరనుకున్నావు? ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న మా మహారాజు ఆకాశరాజుగారి గారాలపట్టి పద్మావతిదేవి. అంతఃపుర కన్యలు విహరించే ఈ వనంలో పరపురుషులు ప్రవేశించడం నిషిద్ధం. పద్మావతిని చూడటం చాలా తప్పు. వెళ్లు... వెళ్లు! తొందరగా... ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో! ఇంకా ఏమిటి అలా కొరకొర చూస్తావు... మేం చెప్పేది వినిపించడం లేదా? వినిపించినా అర్థం కావడం లేదా? మా రాజభటులు వస్తే నీ సంగతి ఇక అంతే!’’ అని చెలికత్తెలు శ్రీనివాసుడిని చుట్టుముట్టి, బెదిరింపులతో అతడిని అక్కడి నుంచి వెడలగొట్ట చూశారు. అంతలో పద్మావతి వారిని వారిస్తూ... ‘‘ఆయన మనలను ఏనుగు బారి నుంచి రక్షించి మన ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడు. ఆయనను తూలనాడటం తగదు. అసలు ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలుసుకోండి’’ అని తన చెలికత్తెలను కోరింది.

పద్మావతి చొరవకు చెలికత్తెలు ఆశ్చర్యపోతూనే శ్రీనివాసుని చెంతకు వెళ్లి అతనిపై ప్రశ్నల పరంపర కురిపించారు. ‘‘ఎవరయ్యా నువ్వు? నీ పేరేమిటి? ఊరేమిటి? నీ తల్లిదండ్రులెవరు? నీ కులమేది? గోత్రమేది?’’ అని అడిగారు. శ్రీనివాసుడు చిరునవ్వులు చిందిస్తూ... ‘‘నా తండ్రి వసుదేవుడు. తల్లి దేవకీదేవి. అన్న బలరాముడు. నన్ను శ్రీకృష్ణుడంటారు. వశిష్ఠ గోత్రానికి చెందినవాణ్ణి. ఈ అందాల భరిణను తొలిచూపులోనే ప్రేమించాను. మీరంతా అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను’’ అంటూ చెలికత్తెలు వారిస్తున్నా పద్మావతిని సమీపిస్తూ ఆమె కౌగిలి కోసం చేతులు చాపాడు. శ్రీనివాసుడి చేష్టలు శ్రుతిమించి రాగాన పడుతుండటాన్ని గమనించిన పద్మావతి చెలికత్తెలు అతన్ని మాటలతో వారించే ప్రయత్నం చేశారు. అయినా, ఫలితం లేకపోవడంతో రాళ్లతో దాడి చేసి వెంటబడి తరిమి తరిమి కొట్టారు. పద్మావతిని ఊహించుకుంటూ మైమరపులో ఉన్న శ్రీనివాసుడు ఈ హఠాత్పరిణామానికి నిశ్చేష్టుడయ్యాడు. పద్మావతి చెలికత్తెల రాళ్ల దాడిలో గాయాల పాలయ్యాడు. నెత్తురోడుతున్న దేహంతోనే పద్మావతిని పదేపదే వెనక్కు తిరిగి చూస్తూ వేంకటాద్రికి చేరుకున్నాడు.

శ్రీనివాసునిపై వకుళమాత మాతృప్రేమ
 పొద్దున్నే వెన్నముద్దలైనా తినకుండా శ్రీనివాసుడు పరగడుపున ఎక్కడికి వెళ్లాడోనని ఆలోచిస్తూ వకుళమాత ఎదురు చూస్తూ వుంది. ఇంతలో తనువంతా నెత్తురోడుతున్న గాయాలతో బాధతో మూలుగుతూ వస్తున్న శ్రీనివాసుణ్ణి చూసి వకుళమాత ఆందోళన చెందింది. ఆతృతతో ఎదురేగి, శ్రీనివాసుని చేయి పట్టుకొని నడిపించుకుని వస్తూ ‘‘ఒళ్లంతా ఈ దెబ్బలేమిటి?, అసలు ఏం జరిగింది! ఏ దుర్మార్గులు చేశారీ పని? ఏం జరిగిందో చెప్పరా కన్నయ్యా’’ అని కన్నీళ్లు పెట్టుకొంది. తన చీర కొంగును చించి గాయాలకు కట్లు కట్టింది. గాయాల బాధకు సన్నగా మూలుగుతున్న శ్రీనివాసుడు, తల్లిని మభ్యపెట్టడం తగదని భావించి జరిగిన  కథంతా పూస గుచ్చినట్లుగా వకుళమాతకు చెప్పాడు.

నారాయణవనం పరిసర ఉద్యాన వనంలో విహరిస్తున్న ఆకాశరాజు కూతురు పద్మావతిదేవిని చూశానని, ప్రేమించానని,  ఆమె కూడా తన ప్రేమలో పడిందనీ, ఇక ఆమెను తాను వివాహమాడనిదే బతకలేనని చెప్పాడు.‘‘నాయనా! శ్రీనివాసా! నీవే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివనే సంగతి మరచినట్లున్నావు. దివ్యపురుషుడవైన నీవు సామాన్య మానవుడిలా మానవకాంతను ప్రేమించడం, ఆమె లేకుంటే బతకలేననడం వింతగా ఉంది. అలా చెప్పడం నీవంటి వాడికి ఎంతవరకు సమంజసమో ఆలోచించు’’ అంటూ అనునయించింది వకుళమాత. ‘‘నీవన్నది సత్యమే! నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనైతికంగా ప్రవర్తించను తల్లీ! నేను చూసిన ఆకాశరాజు కూతురు పద్మావతి నీవు తలచినట్లు సామాన్య వనిత కాదు. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి అంశతో భూలోకంలో నన్ను వివాహమాడటానికే అయోనిజగా అవతరించిన కారణజన్మురాలు’’ అంటూ పద్మావతి గాథను తల్లితో ఇలా చెప్పాడు...

వేదవతే మాయాసీత
‘‘త్రేతాయుగంలో రామావతార సమయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. అప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోయాడు. సీతను ఎత్తుకుపోతున్న రావణుడికి అగ్నిదేవుడు అడ్డుపడి ‘రావణా! నీవు తీసుకుపోతున్నది అసలైన సీత కాదు. శ్రీరాముని భార్య అయిన సీత నా వద్ద ఉన్నది. ఈమెను విడిచిపెట్టి నా వద్దనున్న సీతను తీసుకువెళ్లు’’ అని చెప్పి ఆమెను అగ్నిప్రవేశం చేయించి తన వద్ద భద్రంగా రక్షించాడు. ఆమెకు బదులుగా తన వద్దనున్న వేదవతిని సీతగా మభ్యపెట్టి రావణుడికిచ్చి పంపాడు. అగ్నిదేవుడి మాటలు నమ్మిన రావణుడు వేదవతిని తీసుకుపోయి లంకలో బంధించాడు. రావణ సంహారం తర్వాత రాముడు లంకలో ఉన్న సీతను స్వీకరించాడు.

అయితే, లోకనింద రాకుండా ఉండటానికి సీతను అగ్నిప్రవేశం చేయించాడు. అప్పుడు అగ్ని నుంచి ఇద్దరు సీతలు వెలుపలకు వచ్చారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన రాముడు ‘‘వీళ్లిద్దరూ ఎవరు? వీరిలో నా భార్య సీత ఎవరు?’ అని ప్రశ్నించాడు. అగ్నిదేవుడు తాను సీతను తన దగ్గర భద్రంగా కాపాడి మాయసీత అయిన వేదవతిని రావణుని వద్దకు పంపిన విషయాన్ని వివరించాడు. ‘‘సీతకు బదులుగా వేదవతి లంకలో నానా కష్టాలను అనుభవించింది. సీత మాదిరిగానే నిన్నే తన భర్తగా భావించింది. అందువల్ల సీతతో పాటు మాయసీత అయిన వేదవతిని కూడా భార్యగా స్వీకరించు’’ అని సూచించాడు. అగ్నిదేవుని మాటపై వేదవతిని భార్యగా స్వీకరించాలని సీత కూడా కోరింది. అయితే, రాముడు అందుకు తిరస్కరించాడు.

 ‘‘ఈ అవతారంలో ఒకటే మాట, ఒకటే బాణం, ఒకే భార్య... అనే వ్రత నియమానికి కట్టుబడి ఉన్నాను’’ అని బదులిచ్చాడు. కలియుగంలో వేదవతి కోరిక తీర్చగలనని మాట ఇచ్చాడు. కలియుగంలో తాను శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు వేదవతి ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరిస్తుందని, అప్పుడు తాను ఆమెను దేవేరిగా స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు. అప్పటి శ్రీరాముడే ఇప్పుడు శ్రీనివాసుడిగా వచ్చాడు, నాటి వేదవతి నేడు ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించింది’’ అని శ్రీనివాసుడు చెప్పాడు. ‘‘శ్రీనివాసా! నీవు చెప్పిన వృత్తాంతం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకూ పద్మావతి తండ్రి ఆకాశరాజు ఎవరు తండ్రీ!’’ అని ప్రశ్నించింది.

పూర్వజన్మలో ఆకాశరాజు
పూర్వం మాధవుడనే బ్రాహ్మణుడు కుంతల అనే స్త్రీతో సంబంధం పెట్టుకొని పాపం చేశాడు. అతడు ఆ పాప విముక్తి కోసం వేంకటాద్రికి వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. అక్కడే భగవంతుని కోసం తపస్సు చేశాడు. ఎంతకూ దేవుడు ప్రత్యక్షం కానందుకు చింతిస్తూ ప్రాణత్యాగానికి తలపడ్డాడు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై ‘‘వచ్చే జన్మలో పాండవ వంశంలో సుధర్ముడనే రాజుకు పుత్రునిగా పుట్టి ఆకాశరాజు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి స్వరూపిణి అయిన కన్యక నీకు పుత్రికగా లభిస్తుంది. ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తావు. నీ కీర్తి వెలుగుతుంది’’ అని వరమిచ్చాడు.

ఆ బ్రాహ్మణుడే ఆకాశరాజు. ఇతడి భార్య ధరణీదేవి మహాపతివ్రత. వీరికి ఎంతకాలమైనా సంతానం కలగనందున జ్యోతిషుల సూచనతో పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ సమయంలో భూమిని దున్నుతుండగా, నాగేటి చాలులో బంగారు పెట్టె దొరికింది. అందులో సహస్రదళాల బంగారు పద్మం ఉంది. ఆ పద్మంలో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న పసిపాప కనిపించింది. పద్మంలో దొరికినందున ఆమెకు పద్మావతిగా నామకరణం చేసి, పెంచి పెద్ద చేశారు. యవ్వనవతి అయి అద్భుత సౌందర్యంతో విరాజిల్లుతూ చెలికత్తెలతో వనవిహారం చేస్తున్న ఆ పద్మావతినే నేను చూశాను. ఆమెను చూసినప్పటి నుంచి నా మనస్సు అగమ్యగోచరంగా ఉంది తల్లీ!’’ అంటూ శ్రీనివాసుడు చెప్పగా మైమరచి విన్న వకుళమాత... ‘నాయనా! శ్రీనివాసా! నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు’’ అని అడిగింది.

పెళ్లి రాయబారం!
‘‘అమ్మా! వకుళమాతా! నీవు నారాయణవనం చక్రవర్తి ఆకాశరాజు వద్దకు వెళ్లి ఆయన కూతురు పద్మావతిని నాకు ఇచ్చి వివాహం చేయాలని అర్థించు తల్లీ! లోక కల్యాణం కోసం నీవు ప్రయత్నించే ఈ కార్యం తప్పక నెరవేరుతుంది. ముందుగా ఈ పర్వత మూలలో వెలసిన కపిలేశ్వరస్వామిని దర్శించుకుని, పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టాల’’ని తల్లిని కోరాడు. శ్రీనివాసుడు తనపై ఉంచిన కార్యభారానికి ఆనందించిన వకుళమాత, కపిలతీర్థంలో స్నానమాడి, కామాక్షీసమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీనివాసుని కల్యాణాన్ని శుభస్య శీఘ్రంగా నెరవేర్చాలని ప్రార్థించింది. అక్కడి నుంచి నారాయణవనానికి బయలుదేరింది. దారిలో శుక మహర్షి ఆశ్రమాన్ని, అక్కడకు చేరువలోని అగస్త్యేశ్వరుడిని దర్శించుకుంది. అక్కడినుంచి నారాయణవనానికి చేరుకుంది వకుళమాత.

ఎరుకలసానిగా శ్రీనివాసుడు
తన వివాహం కోసం తల్లి వకుళమాతను నారాయణవనానికి పంపిన శ్రీనివాసుడు, వెంటనే తన రూపురేఖలను మార్చుకుని, ఎరుకలసాని వేషం ధరించాడు. ‘‘ఎరుక సెబుతానమ్మ! ఎరుక! ఎరుకమ్మో ఎరుక!’’ అంటూ వయ్యారాలు పోతూ నారాయణపుర వీథుల్లో తిరుగసాగాడు. పద్మావతి జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెకు ఏదైనా భూతం పట్టుకుందేమో! ఎన్ని చికిత్సలు చేస్తున్నా జ్వరం తగ్గడం లేదెందుకోనని దిగులుగా ఆలోచిస్తున్న ధరణీదేవికి ఎరుకలసాని అరుపులు వినిపించాయి. వెంటనే ఆమె ఎరుకలసానిని అంతఃపురానికి పిలిపించింది. ఎరుకతెకు ఎదురుగా పద్మావతిని కూర్చోబెట్టి ఎరుక చెప్పమని కోరింది.

 ఎరుకలసాని రూపంలోని శ్రీనివాసుడు పద్మావతి ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుంటూ ‘‘కొండదేవర మీద ఆన! ఉన్నది ఉన్నట్టు సెబుతాను తల్లె! ఈ క్షణం నుంచే నీ బిడ్డ కుదుటబడుతుంది. నీ బిడ్డ చేతిని కొండమీది ఆదినారాయణుడు అందుకొన్నాడె తల్లె! వాడు కూడా ఈ బొమ్మ మీద మోజు పడ్డాడె తల్లె! జెరం తగ్గి బిడ్డ బతికి బట్టగట్టాలంటే కొండ మీద ఉన్న ఆదిదేవునికిచ్చి మనువు సెయ్యాలె తల్లె! నేను సెప్పేది సత్తెమే తల్లె! కొండ దేవర మీద ఆన! తొందర్లోనే నీ బిడ్డ లగ్గమవుతాది!’’ అంటూ శ్రీనివాసుడు పద్మావతి చేతిని స్పృశిస్తూ ఆమె మనసును మరింత ఊరిస్తూ వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే వకుళమాత వచ్చింది. అగస్త్యేశ్వరునికి అభిషేకం చేయించి, తీర్థప్రసాదాలను తీసుకొచ్చిన చెలికత్తెలు పద్మావతీదేవికి వాటిని అందించారు. తమ వెంట వచ్చిన వకుళమాతను రాణి ధరణీదేవికి పరిచయం చేశారు. వకుళమాత రాజ దంపతులకు నమస్కరించి, శ్రీనివాసుడు వనవిహారం చేస్తున్న పద్మావతిని మోహించాడని, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని, అందువల్ల పద్మావతి కూడా కారణ జన్మురాలని వారికి ఎరుకపరచింది. వకుళమాత మాటలకు ఆకాశరాజు దంపతులు ఆనందపరవశులయ్యారు. శ్రీనివాసుడికి పద్మావతిని ఇచ్చి వివాహం చేయడానికి అంగీకారం తెలిపారు. త్వరలోనే ముహూర్తాన్ని నిశ్చయించి, వివాహం జరిపించగలమని తెలిపారు. వకుళమాత అక్కడి నుంచి సెలవు తీసుకుని వరాహక్షేత్రానికి చేరుకుని, శ్రీనివాసుడికి తీపి కబురు తెలియజేసింది.

పద్మావతీ శ్రీనివాసుల వివాహ నిశ్చయం
వకుళమాత వెళ్లిన వెంటనే పద్మావతీ శ్రీనివాసుల కల్యాణానికి ముహూర్తం నిశ్చయించాలని కోరుతూ దేవగురువు బృహస్పతిని, శుక మహర్షిని ఆకాశరాజు ఆహ్వానించాడు. ఆకాశరాజు కోరికను మన్నించిన వారిద్దరూ గ్రహగతులను పరిశీలించి, రాబోయే వైశాఖ శుక్ల దశమి, శుక్రవారం నాటి ఉత్తర ఫల్గుణీ శుభ నక్షత్రంలో వివాహ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదిగా నిశ్చయించారు. వెంటనే శుభలేఖను తయారు చేశారు. ఆకాశరాజు కోరికపై బృహస్పతి ఆ శుభలేఖను శుకమహర్షికి ఇచ్చి, శ్రీనివాసుని వివాహానికి ఆహ్వానించాల్సిందిగా ఆదేశించాడు. శుకమహర్షి శ్రీనివాసునికి ఆ శుభలేఖను అందించాడు. శుకమహర్షిని సాదరంగా సత్కరించిన శ్రీనివాసుడు, శుభలగ్నానికి బంధుమిత్రులతో తరలి రాగలనని తెలిపి సాగనంపాడు.

ముక్కోటి దేవతల సాక్షిగా..
శుకమహర్షి వివాహ లగ్నపత్రికను ఇచ్చి వెళ్లిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతితో తన వివాహ ఏర్పాట్లు చూడటానికి బ్రహ్మాది దేవతలను ఆహ్వానించాడు. శ్రీనివాసుని ఆహ్వానంపై బ్రహ్మ, మహేశ్వర, ఇంద్రాది ముక్కోటి దేవతలు, వశిష్ఠ వామదేవ విశ్వామిత్ర, కశ్యప, భరద్వాజాది సకల మహర్షులు వేంకటాచలానికి చేరుకున్నారు. ఇలా వస్తున్న వారందరికీ శ్రీనివాసుడు సాదరంగా ఆహ్వానించి గౌరవ సత్కారాలు అందజేశాడు. తన వివాహాన్ని తిలకించేందుకు వచ్చిన వారు విడిది చేయడానికి వీలుగా విశ్వకర్మ చేత వివాహపురాన్ని నిర్మించాలని శ్రీనివాసుడు ఇంద్రుడిని ఆదేశించాడు. అలాగే, ఆకాశరాజు పాలిస్తున్న నారాయణవనంలో పద్మావతీ శ్రీనివాసుల వివాహార్థమై ఘనంగా రత్నస్తంభాలతో ఒక వివాహ వేదికను కూడా విశ్వకర్మ నిర్మించాడు.

శ్రీనివాసుడి కల్యాణ వేడుకల్లో దేవతలందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క బాధ్యతను నిర్వర్తించారు. ఇంతలో శ్రీనివాసుడు సూర్యభగవానుని పిలిచి, ‘‘నీవు మహాలక్ష్మి వేంచేసి ఉన్న కొల్హాపురానికి వెళ్లు. శ్రీనివాసుడు నీ వియోగం వల్ల అస్వస్థుడై ఉన్నాడని అసత్యం చెప్పి ఆమెను పిలుచుకు రావాలి’’ అని ఆదేశించాడు. శ్రీనివాసుని ఆనతిని శిరసావహించిన సూర్యుడు కొల్హాపురానికి వెళ్లి లక్ష్మీదేవిని వేంకటాచలానికి తోడ్కొని వచ్చాడు. శ్రీనివాసుని చూసి లక్ష్మీదేవి ఆనంద పరవశురాలైంది. వేంకటాచలమంతా దేవతలతో నిండి కోలాహలంగా ఉండటంతో విశేషమేమిటని ప్రశ్నించింది. అంతట శ్రీనివాసుడు ‘‘త్రేతాయుగంలో నీ ఆనతి ప్రకారం అప్పటి వేదవతిని ఈనాడు పద్మావతిగా వివాహమాడుతున్నాను. నాటి నీ కోరిక తీరే వేళ ఆసన్నమయింది. అందుకే నిన్ను పిలిపించాను’’ అని చెప్పగా, లక్ష్మీదేవి సంతోషిస్తూ శ్రీనివాసుని పెండ్లికుమారుడిగా అలంకరించడానికి ఉద్యుక్తురాలైంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి మున్నగువారు శ్రీనివాసునికి అభ్యంగనస్నానం చేయించారు. కుబేరుడు ఇచ్చిన నూతన వస్త్రాభరణాలను అలంకరించి, పెండ్లికొడుకును చేశారు. శ్రీనివాసుడు తమ కులదైవమైన శమీ వృక్షాన్ని కుమారధార తీర్థంలో దర్శించుకుని, దాని కొమ్మను వరాహస్వామి ఆలయ సమీపంలో ప్రతిష్ఠించాడు.

వివాహానికి తరలి వెళ్లే ముందు ఇక్కడ వేంచేసి ఉన్న కోట్లాది మంది దేవగంధర్వ ఋష్యాదులకు అన్న సంతర్పణ కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిందని బ్రహ్మదేవుడు శ్రీనివాసుని కోరాడు. అయితే, శ్రీనివాసుడు తన వద్ద ధనం ఏమాత్రం లేదని, ఇప్పుడు ఇంత ఖర్చు ఎలా భరించగలనని దిగులుపడ్డాడు. ఇంతలోనే శివుని సలహాపై తేరుకుని కుబేరుని ఏకాంతంగా పిలిచి, తన పెళ్లికి కావలసిన ధనాన్ని అప్పుగా ఇవ్వమని కోరాడు శ్రీనివాసుడు. అప్పు ఇవ్వడానికి అంగీకరించిన కుబేరుడు రుణపత్రం రాసి ఇవ్వమని అడిగాడు. సరేనన్న శ్రీనివాసుడు పుష్కరిణి పశ్చిమ తీరాన ఉన్న అశ్వత్థ వృక్షం కింద కూర్చుని రుణపత్రాన్ని ఇలా రాయించాడు. ‘‘కలియుగంలో హేవిళంబనామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి దినాన కుబేరుని వద్ద నుంచి నా వివాహార్థమై రామముద్రలు కలిగిన పద్నాలుగు లక్షల నిష్కాలను వడ్డీ చెల్లించే విధాంగా రుణం స్వీకరించడమైనది.

వివాహం జరిగిన ఈ ఏడాది మొదలు కొని వెయ్యేళ్లలోగా రుణాన్ని వడ్డీతో సహా తీర్చగలనని నేను రాసి ఇస్తున్న రుణపత్రం ఇది. దీనికి చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు మొదటి సాక్షి. త్రినేత్రుడైన పరమశివుడు రెండవ సాక్షి. మేము కూర్చున్న అశ్వత్థ వృక్షం మూడవ సాక్షి’’ అంటూ బ్రహ్మదేవుని చేత రుణపత్రాన్ని రాయించాడు. రుణం దొరికి ఆర్థిక సమస్య పరిష్కారం కావడంతో శ్రీనివాసుడు వెంటనే అగ్నిదేవుడిని పిలిచి అందరికీ భోజన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. స్వామి ఆనతిపై అగ్నిదేవుడు పుష్కరిణిని అన్నపాత్రగా, పాపనాశన తీర్థాన్ని పప్పుపాత్రగా, ఆకాశగంగను పరమాన్నపాత్రగా, దేవతీర్థాన్ని భక్ష్యాల పాత్రగా, పాండవ తీర్థాన్ని చారు పాత్రగా, మిగిలిన దివ్యతీర్థాలను పిండివంటల పాత్రలుగా చేసుకుని రుచికరమైన వంటలు చేశాడు. వాటన్నింటినీ అహోబిల లక్ష్మీనరసింహస్వామికి నివేదన చేసిన తర్వాత పాండవ తీర్థం నుంచి శ్రీశైలం వరకు బారులుగా కూర్చున్న దేవతలకు వడ్డనలు చేశారు. విందు ముగిసిన తర్వాత దేవ యక్ష గంధర్వ రుషి గణాలతో శ్రీనివాసుడు నారాయణ వనానికి తరలి వెళ్లాడు. ఆకాశరాజు వారందరినీ భక్తిగౌర

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top