ప్రకాశమేదీ..? | Sakshi
Sakshi News home page

ప్రకాశమేదీ..?

Published Fri, Feb 2 2018 12:01 PM

prakasam District 49th incarnation day - Sakshi

ఒంగోలు టౌన్‌: ప్రకాశం జిల్లా ఆవిర్భవించి ఐదు దశాబ్దాలవుతోంది. అయినా నేటికీ వెనుకబాటుతనమే వెంటాడుతోంది. పేరులోనే ప్రకాశం తప్పితే అభివృద్ధిలో అంథకారం మిగిలింది. జిల్లాకు సంబంధించి చెప్పుకోదగ్గ అభివృద్ధి భూతద్దం వేసినా కనిపించదు. మూడేళ్లుగా వరుస కరువు వెంటాడుతున్నా జిల్లాపై ప్రభుత్వానికి కనికరం కలగ లేదు. రైతులు పంటలను పూర్తిగా కోల్పోయారు. కూలీలకు పనులు లేవు. పనుల కోసం ఊళ్లకు ఊళ్లు వలసలు వెళుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన జిల్లాల జాబితాలో ఇంతవరకు ప్రకాశంకు చోటు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనివర్సిటీల్లో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రతి ఏటా జిల్లా పరిస్థితి దిగజారడం తప్పితే అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు.

అన్నింటా వెనుకబాటుతనమే..
వెనుకబడిన జిల్లాల నుంచి ఏర్పడిన ప్రకాశం అన్నింటా వెనుకబడే ఉంది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలన్నింటిని కలిపి 1970 ఫిబ్రవరి 2వ తేదీ ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 33,92,764 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఏటా 11శాతం జనాభా పెరుగుతోంది. 55శాతం కుటుంబాలు కేవలం ఒక్క గదిలోనే తలదాచుకుంటున్నాయి. స్నానాల గదులు కూడా లేని కుటుంబాలు 36 శాతం ఉన్నాయి. 52 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంట వండుకునేందుకు కట్టె పుల్లలనే ఉపయోగిస్తుస్తున్నాయి. 70 శాతం మంది అత్వల్ప ఆదాయంతో కుటుంబాలను భారంగా నెట్టుకు వస్తున్నారు.

ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి లేదు
జిల్లాలోని 43 మండలాల ప్రజలపై ఫ్లోరైడ్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికీ 729 గ్రామాల్లో ప్రజలు తాగే నీటిలో హానికరమైన 1.2పీపీఎం ఫ్లోరోసిస్‌ ఉంది. 38 మండలాల్లోని 187 గ్రామాల్లో ప్రజలు తాగే నీటిలో అత్యంత ప్రమాదకరమైన 5 పీపీఎం ఉన్నట్లు ప్రభుత్వమే గుర్తించింది. ఈ 38 మండలాల్లో వేలాది మంది కిడ్నీ బాధితులు. సకాలంలో డయాలసిస్‌ చేయకపోవడంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డయాలసిస్‌ కేంద్రాలను బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు అత్యంత ప్రమాదకరమైన ఫ్లోరిన్‌ ఉన్న నీటినే తాగుతున్నారు. దాంతో బాల్యం నుంచే అక్కడి పిల్లలు ఫ్లోరిన్‌ బారిన పడుతున్నారు. జిల్లాలో 2333 నివాస ప్రాంతాలు ఉంటే, వాటిలో 1162 ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం లేదు. ఆ ప్రాంతాల పరిధిలోని 42 పథకాల ద్వారా తాగునీటిని అందించేందుకు గత 15 ఏళ్ల కాలంలో దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చు చేసినట్టు అధికారికంగా గణాంకాలు చెబుతున్నప్పటికీ తగిన ఫలితాలు మాత్రం రాలేదు.

ఏటా 4 లక్షల కుటుంబాలు వలస
ప్రతి ఏటా జిల్లా నుంచి పనుల కోసం 4 లక్షల కుటుంబాలు వలస వెళుతున్నాయంటే కరువు తీవ్రత ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో దాదాపు 8.5లక్షల కుటుంబాలు ఉంటే అందులో సగం కుటుంబాలు పనుల కోసం సొంత ఊళ్లు, సొంత ఇళ్లను వదులుకొని వెళుతున్నాయి. ఆ కుటుంబాలు తమ ఇళ్లల్లో ఉండేది మూడు నాలుగు నెలలు మాత్రమే. మిగిలిన కాలమంతా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో పనుల కోసం వలసలు వెళుతుంటాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో కూలీలకు పనులు కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. కూలీలతో పనులు చేయించకుండా అనేకచోట్ల యంత్రాలను వాడుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి.

ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ పోలప్ప స్వయంగా అంగీకరించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అనేక కుటుంబాల్లో కేవలం వృద్ధులు మాత్రమే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ కనిపిస్తుంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశానికి చోటు లేకపోవడంతో వలసలకు అడ్డుకట్ట పడటం లేదు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన కేంద్రం వాటన్నింటికంటే అన్ని విధాలుగా వెనుకబడిన ప్రకాశంను చిన్నచూపు చూస్తూనే ఉంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రకాశంను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి పర్సనల్‌ పనులకు ఇస్తున్న ప్రాధాన్యత జిల్లాపై చూపించకపోవడంతో అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉంది.

వర్షపాతం లోటు
= జిల్లా పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. గత 45 ఏళ్ల కాలంలో జిల్లాలో సగటు వర్షపాతం పరిశీలిస్తే కేవలం 15 ఏళ్లు మాత్రమే చెప్పుకోదగ్గ వర్షాలు కురిశాయి. మిగిలిన 30 ఏళ్లు అతి తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో 19 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 14 లక్షల ఎకరాలు వినియోగంలో ఉంటుంది. అయితే ఈ 14లక్షల ఎకరాల్లో కేవలం 3లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదికూడా నాగార్జునసాగర్, కొమ్మమూరు కాలువల ద్వారానే. కొన్ని సందర్భాల్లో నాగార్జునసాగర్‌ నుండి కూడా వాటా ప్రకారం నీరు రాకపోవడంతో పంట పొలాలు బీళ్లుగా మారిపోయి రైతాంగం మరింత నష్టపోవడం సర్వసాధారణమైంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో వరుసగా మూడో ఏడాది కూడా కరువు నెలకొంది. కరువు జిల్లాగా ప్రభుత్వాలు ప్రకటనలు చేయడం, కేంద్ర బృందాలు తాము వచ్చిన సమయంలో ఉన్న భూములను  పరిశీలించి వెళ్లడం తప్పితే జిల్లా రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. కరువు సహాయం కోసం రైతులు ఎదురుచూడటం తప్పితే ప్రభుత్వాల పరంగా ఎలాంటి సహాయం అందడం లేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement