దద్దరిల్లిన పార్లమెంట్‌

YSRCP MPs protest at parliament about AP Special Status - Sakshi

      ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన

     కొద్దిసేపు డ్రామా నడిపిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు

     విభజన చట్టంలోని హామీల అమలు, నిధుల కోసం వైఎస్సార్‌సీపీ సభ్యుల పట్టు 

     రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీత  

     లోక్‌సభ వెల్‌లో ప్లకార్డుల ప్రదర్శన.. నినాదాల హోరు 

     టీడీపీ మొక్కుబడిఆందోళన.. జైట్లీ ప్రకటనతో వెనక్కి 

     కేంద్రానికి కోపం రాకుండా నడుచుకోవాలన్న బాబు

     అరుణ్‌ జైట్లీ ప్రకటనపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అసంతృప్తి 

సాక్షి, న్యూఢిల్లీ:  విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, నిధులు రాకపోవడంతోపాటు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌  ఉభయ సభల్లో గొంతెత్తి నినదించారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేశారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆందోళనకు దిగారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టేలా వివరించారు.

విభజన వల్ల నష్టపోయిన తీరును వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, నిధులను వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంట్‌ లోపల, బయటా ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. పార్టీ సభ్యులు ఉదయం నుంచి రాత్రి వరకూ 8 గంటలకు పైగా అలుపెరగకుండా ఆందోళన చేపట్టారు. కేంద్రానికి తమ నిరసన తెలియజేశారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా రాత్రి వాకౌట్‌ చేశారు. అధికార టీడీపీ సభ్యులు మాత్రం ఆందోళనల డ్రామా నిర్వహించారు.  

అసలేం జరిగింది..  
ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్‌సీపీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పార్లమెంట్‌ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన ప్రారంభించారు. ప్లకార్డులతో అరగంటపాటు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినదించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘‘హామీల అమలుపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పటిదాకా ఏం చేసిందో చెప్పాలి. వాళ్ల(టీడీపీ) స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. హామీలను అమలు  చేసేలా ఈ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. కేంద్రం స్పందించేంత వరకూ మా ఒత్తిడి, పోరాటం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం సమీపంలో ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎంపీల నిరసనలో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి పాలుపంచుకోలేదు.  

వాయిదా తీర్మానానికి నోటీసులు  
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంతకు ముందు వైవీ సుబ్బారెడ్డి విభజన హామీల అమలుపై చర్చకు ప్రతిపాదిస్తూ వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు సైతం వెల్‌లోకి చేరుకున్నారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ 11.10 గంటలకు పది నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ నినాదాలు కొనసాగించారు. నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.  

అనంత్‌కుమార్‌ జోక్యం  
ఇరు పార్టీల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో జోక్యం చేసుకుంటూ ‘‘ఎంపీల ఆందోళనకు సంబంధించిన అంశాలను ప్రధాని పరిశీలిస్తున్నారు. ఎంపీలు ఆందోళన విరమించాలి’ అని కోరారు. మధ్యాహ్నం 12.25 గంటలకు సభలోకి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వద్దకు రాగా, సభ్యులను వెనక్కి పిలిపించాలని ఆయన సూచించారు. ప్రధాని, ఆర్థిక మంత్రితో సంబంధిత అంశాలపై చర్చిస్తున్నామని, ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం తమ పార్టీ సభ్యులు ఆందోళన విరమిస్తారని సుజనా బదులిచ్చినట్లు సమాచారం. 12.25 గంటలకు ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. 2 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చారు.

ఈ సమయంలో ప్రధాని ముందువైపు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఉండగా, విపక్ష కాంగ్రెస్‌ సభ్యుల వైపు టీడీపీ ఎంపీలు నిల్చున్నారు. 2.30కి కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ప్రయత్నించగా టీడీపీ ఎంపీలు ఆయన చుట్టూ చేరి నినాదాలు చేశారు. దీంతో ఇతర సభ్యుల హక్కులను కాలరాయొద్దని సభాపతి హెచ్చరించారు. అయినా టీడీపీ ఎంపీలు వినకపోవడంతో సభను 2.30 గంటలకు 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.  

ప్రభుత్వ ప్రాయోజిత నాటకం  
మల్లికార్జున ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకోవడం తగదని సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్‌ నేతలు చెప్పడం టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగించింది. దోషులు మీరే అంటూ టీడీపీ ఎంపీలు కాంగ్రెస్‌ నేతలపైకి దూసుకెళ్లారు. ఈ సమయంలో అక్కడే ఉన్న సోనియాగాంధీ వారించారు. తిరిగి సభ ప్రారంభం కాగానే మల్లికార్జున ఖర్గే తన ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సోనియాగాంధీ ప్రధానికి ఇదివరకే రెండుసార్లు లేఖ రాశారని చెప్పారు. ప్రభుత్వంలో భాగమైన టీడీపీ ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ ప్రాయోజిత నాటకమని ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. ఎంపీల ఆందోళనల మధ్య సభను సభాపతి మరోసారి 2.55 గంటలకు 35 నిమిషాలపాటు వాయిదా వేశారు. 

జైట్లీ ప్రకటనతో వెనక్కి తగ్గిన టీడీపీ  
3.30 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఖర్గే ప్రసంగం మొదలైంది. జైట్లీ సభకు వచ్చారు. అంతకు ముందు ఆయన రాజ్యసభలో విభజన హామీలపై ప్రకటన చేసి వచ్చారు. 4.30కి లోక్‌సభలోనూ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలు 90:10 నిష్పత్తిలో ఉండేవని, సాధారణ రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో ఉండేవని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున కేంద్ర వాటాగా మరో 30 శాతం అంతరాన్ని ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రోగ్రామ్స్‌(ఈఏపీ) ద్వారా ఇద్దామనుకున్నామని చెప్పారు. ఈ మేరకు గతంలోనే ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించామని గుర్తుచేశారు. అయితే ఈఏపీ ద్వారా నిధుల రాక ఆలస్యమవుతున్నందున దానిని నాబార్డు రుణాల రూపంలో ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదించిందని, దీనిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళన విరమించారు.    

కొనసాగిన వైఎస్సార్‌సీపీ ఆందోళన  
టీడీపీ ఎంపీలు వెనక్కి మళ్లినా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన విరమించలేదు. జైట్లీ ప్రకటనపై సంతృప్తి చెందక తమ నిరసనను కొనసాగించారు. ధన్యవాద తీర్మానంపై చర్చలో వైఎస్సార్‌సీపీకి అవకాశం రాగా మిథున్‌రెడ్డి మాట్లాడేటప్పుడు రాత్రి 7 గంటల సమయంలో పార్టీ సభ్యులంతా తమ స్థానాలకు వచ్చి నిలుచున్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి తీవ్ర ఆవేదనతో, ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కలత చెందుతున్నామని వివరించారు.

ఆర్థిక మంత్రి ప్రకటన తమను ఆవేదనకు గురి చేసిందన్నారు. హామీలు ఎప్పుడు, ఎలా అమలు చేస్తారో స్పష్టమైన, జవాబుదారీ ప్రకటన ఉండాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి ప్రకటనతో తాము సంతృప్తి చెందడం లేదని, దీనికి నిరసనగా వాకౌట్‌ చేస్తున్నామని ప్రకటించి వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ నుంచి బయటకు వచ్చేశారు. కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన లోక్‌సభ సభ్యులు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక ఏపీ ఎంపీల ఆందోళనలో పాలుపంచుకోలేదు.
   
తెలుగుదేశం సభ్యుల డ్రామా  
ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ రాజకీయ రంగస్థలంపై రోజుకో నాటకం ఆడుతోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా గట్టిగా నోరెత్తి అడిగే ధైర్యం చేయలేకపోయింది. టీడీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో మంగళవారం పార్లమెంట్‌ సాక్షిగా సరికొత్త డ్రామాకు తెర తీసింది. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో నాటకాన్ని రక్తికట్టించేందుకు ప్రయత్నించారు.

సభలో మొక్కుబడిగా ఆందోళన చేసి, అరుణ్‌ జైట్లీ నుంచి హామీ లభించిందంటూ మధ్యలోనే విరమించారు. అరుణ్‌ జైట్లీ చేసిన ‘హామీల పరిశీలన’ ప్రకటనలో ఎలాంటి కొత్తదనం లేదు. గతంలో చెప్పిన అంశాలనే పునరావృతం చేసినా టీడీపీ సభ్యులు సంతృప్తి చెందారు. అటు సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం నుంచి తమ పార్టీ ఎంపీలు, ఇతర నేతలతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించకుండా ఎలా నడుచుకోవాలో సూచించారు. బడ్జెట్‌పై వ్యతిరేక స్వరం వినిపించకుండా, మొక్కుబడి నిరసనలకే పరిమితం కావాలని ఆదేశించారు.  అరుణ్‌ జైట్లీ ప్రకటన తర్వాత తన అనుకూల మీడియా ద్వారా రాష్ట్రానికి ఏదో న్యాయం జరిగిపోయిందన్నట్లుగా, అది తమ పార్టీ వల్లనే సాధ్యమైందన్న రీతిలో ప్రచారం చేయించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top