
సాక్షి, ఒంగోలు : బీజేపీ, తెలుగుదేశం పార్టీలు రాష్ట్రానికి ఏవిధంగా అన్యాయం చేస్తున్నాయో పార్లమెంటు సాక్షిగా యావత్ దేశానికి చాటిచెప్పామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టామని గుర్తుచేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల గొంతు వినిపించాలన్నదే తమ నాయకుడు వైఎస్ జగన్ లక్ష్యమని, అందుకే పార్లమెంటు వేదికగా అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన అన్నారు.
టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ముందుగా తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని, కానీ, టీడీపీ అలా చేయకుండా మరో అవిశ్వాస తీర్మానం పెట్టిందని తప్పుబట్టారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని పార్లమెంటులో ఏ పార్టీ పెట్టిన ఏ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా మద్దతు తెలుపుతామని, తమ పోరాటం కొనసాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.