‘మట్టి అమ్ముకోడానికి రాజకీయాల్లోకి రాలేదు’

YSRCP MLA Candidate Kotaru Abbayya Choudary Fire On TDP MLA Chintamaneni In Denduluru - Sakshi

సాక్షి, దెందులూరు: మట్టి అమ్ముకోవడానికో, ఇసుకు అమ్ముకోవడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను విమర్శిస్తూ దెందులూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరీ అన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుతో కలిసి  దెందులూరు మండలం పాలగూడెం, కొవ్వలి తదితర గ్రామాలలో కొఠారు అబ్బయ్య చౌదరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడానికే లక్షల రూపాయలు వచ్చే మంచి ఉద్యోగాన్ని వదులుకున్నానని అన్నారు. గత ఐదేళ్లలో చింతమనేని దెందులూరును దోచుకున్నారని ఆరోపించారు.

మూడున్నర ఎకరాల ఉన్న చింతమనేని నేడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని దుయ్యబట్టారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు బినామీ పేర్లతో కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. చింతలపూడి వద్ద 120 ఎకరాలను బినామీ పేర్లతో కొనిపించాడని ఆరోపించారు.  దెందులూరు ప్రజలకి రాక్షస పాలన చూపిన చింతమనేనికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో దెందులూరులో గెలిచి మంచి పాలన అంటే ఏంటో చూపిస్తామన్నారు.

అమరావతి.. భ్రమరావతి : పండుల

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి ఓటేస్తే ఏపీ రాష్ట్రం అధోగతి పాలవుతుందని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. బిహార్‌, ఈశాన్య రాష్ట్రాల కంటే వెనకబడిపోయే అవకాశముందన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఏపీని దోచుకున్నారని ఆరోపించారు. అమరావతి భూముల సేకరణ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు. అమరావతిని భ్రమరావతిగా మార్చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు దారిలోనే ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు. మంచి ఆశయంతో సైకిల్‌ ఎక్కి తొక్కాను.. ఐదేళ్లూ తొక్కుతూనే ఉన్నా..దిగి చూస్తే సైకిల్‌ అక్కడే ఉంది.. సైకిల్‌కు చైన్‌ లేదు.. చక్రాలు లేవన్నారు. మంచి గాలి కావాలంటే ఫ్యాన్‌ ఉండాలని వ్యాఖ్యానించారు.

పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసులా వైఎస్‌ జగన్‌ 25 ఏళ్లపాటు ఏపీకి మంచి పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్నారు. వైఎస్సార్‌సీపీకి 150 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. చింతమనేని అరాచకాలు పెరిగిపోయాయని, దళితులను విమర్శిస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. చింతమనేనిని దెందులూరులో ఓడించి అబ్బయ్య చౌదరీని గెలిపిస్తామన్నారు. లోకేష్ 25 సీట్లు వస్తాయని నిజమే చెప్పాడు.. నిజంగానే వాళ్లకి 25 ఎమ్మెల్యే సీట్లే వస్తాయని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top