జననేత ఆదేశాలతో..

YSRCP Leaders Financial Help To Boat Accident Victims East Godavari - Sakshi

లాంచీ ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.50 వేల సాయం అందించడానికి

తరలిన వైఎస్సార్‌ సీపీ నేతలు  మన్యంలో భద్రతా కారణాలతో

అడ్డుకున్న పోలీసులు వెనుదిరిగి వచ్చిన పార్టీ నేతలు

దేవీపట్నం (రంపచోడవరం): గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీ మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు బయలుదేరిన ఆ పార్టీ నేతలు మన్యంలో నెలకొన్న భద్రతా కారణాల రీత్యా మార్గం మధ్య నుంచే వెనుదిరిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సాయాన్ని అందించేందుకు ఎమ్మెల్సీ పిల్లి సుభాస్‌ చంద్రబోస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ అనంత ఉదయభాస్కర్, పార్టీ నాయకుడు కర్రి పాపారాయుడు సోమవారం బయలుదేరి మండలంలోని ఇందుకూరుపేట వరకూ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టులు సోమవారం ఏవోబీ బంద్‌కు పిలుపు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మన్యంలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ఏజెన్సీలోని మూరుమూల ప్రాంతాలకు ప్రముఖులు వెళ్లేందుకు పోలీసులు అనుమతించ లేదు. లాంచీ మృతులు 19 మంది కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం చేసేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ నాయకులు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీని ఫోన్‌లో కోరారు. నాయకుల భద్రతా దృష్ట్యా అందుకు సమ్మతించలేదు.  పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు వైఎస్సార్‌ సీపీ నేతలు లాంచీ ప్రమాద బాధిత గ్రామాలైన కచ్చులూరు, గొందూరు, తాళ్లూరు, కొండమొదలు వెళ్లకుండానే వెనుతిరిగారు. అంతకు ముందు  వైఎస్సారీసీపీ మండల నాయకులు, ఎంపీపీ పండా జయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు మట్టా రాణి, పార్టీ నాయకులు కుంజం చెల్లన్నదొర, గారపాటి మురళీకృష్ణ, కందుల బాబ్జీ, తుర్రం జగదీష్, కలుం స్వామిదొర, శిరశం పెద్దబ్బాయిదొర, కోమలి కిషోర్‌ తదితరులు దేవీపట్నం పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకుని ఎగువ గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు  చేశారు. దేవీపట్నం ఎస్సై వెంకరత్నం మన్యంలో నెలకొన్న పరిస్థితులను వైఎస్సార్‌ సీపీ నాయకులకు వివరించారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఆయా గ్రామాలకు వెళ్లి, బాధితులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందజేస్తామని అనంత ఉదయభాస్కర్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top