న్యాయం కటకటాల్లో!

YSRCP Leader Kogatam Vijaya Bhaskar Reddy Taken Into Remand - Sakshi

వాస్తవాలతో పని లేదు.. విచారణ అక్కర్లేదు.. ఇప్పటి పోలీసులకు తెలిసిందల్లా జీ..హుజూర్‌. ఎమ్మెల్యే చెప్పాడనో.. టీడీపీ కీలక నేత సిఫారసు చేశాడనో కేసు నమోదవుతోంది. అధికార పార్టీ వర్గీయులు తప్పు చేస్తే కళ్లు మూసుకోవడం.. ప్రతిపక్షం గొంతెత్తితే చాలు ఒంటి కాలుపై లేవడం పరిపాటిగా మారింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు.. ఈ పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసు శాఖ టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారడం ఆందోళన కలిగించే అంశం.

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల తరపున పోరాడే హక్కును కూడా పోలీసులు కాలరాస్తున్నారు. సమస్యల పరిష్కారంపై అధికార పార్టీ నేతలను ప్రశ్నించినా అక్రమ కేసులతో కటకటాల్లోకి నెట్టేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కడమే ఆలస్యం.. బలమైన సెక్షన్లతో స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ఎస్‌ఐ మొదలు.. ఉన్నతాధికారుల వరకూ ఇదే తంతు. ఏకపక్ష ధోరణితో పోలీసు వ్యవస్థ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. హిందూపురం.. రాప్తాడు.. తాడిపత్రి.. రాయదుర్గం.. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు.. ఇప్పుడు అనంతపురంలో ఆ పార్టీ కీలక నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డిపై ఏకంగా అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం గమనార్హం. ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సూచనలతో డీఎస్పీ పి.ఎన్‌.బాబు, సీఐ బాలమద్దిలేటి పక్కా ప్రణాళికతోనే ‘కోగటం’ను ఇరికించారని ఆ పార్టీ నేతలు ఆరోపించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

పథకం ప్రకారమే.. : నగరంలోని ఛత్రపతి శివాజీ స్కూల్‌లో గత శుక్రవారం జన్మభూమి–మా ఊరు సభ నిర్వహించారు. డివిజన్‌లోని సమస్యలను స్థానికులు సభ దృష్టికి తీసుకొస్తున్నారు. స్థానికునిగా కోగటం విజయభాస్కర్‌రెడ్డి కూడా ఓ సమస్య చెప్పగా.. 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ లక్ష్మిరెడ్డి సమాధానం చెప్పారు. ‘సమాధానం అధికారులు చెప్పాలి, నువ్వెవరు మా డివిజన్‌లో మాట్లాడేందుకు’ అని కోగటం ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లక్ష్మి రెడ్డితో పాటు బంగి సుదర్శన్, డిప్యూటీ మేయర్‌ గంప్ప కూడా ఉన్నారు. కోగటంపై ఫిర్యాదు చేస్తే లక్ష్మిరెడ్డి చేయాలి.. కానీ కోగటం, బంగి సుదర్శన్‌ మధ్య చిన్న మాట కూడా జరగకపోయినా బంగి సుదర్శన్‌ కోగటంపై ఫిర్యాదు చేశారు.

రాత్రి 9.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. వెనువెంటనే 506ఆర్‌/డబ్ల్యూ34ఐపీసీ, సెక్షన్‌3(1)ఆర్, ఎస్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బంగి సుదర్శన్‌ గతంలో కూడా పలువురిపై ఇదే తరహాలో(ఎస్సీ, ఎస్టీ కేసు) ఫిర్యాదులు చేశారు. ఇతను ఫిర్యాదు ఇవ్వగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే బంగి సుదర్శన్, గంపన్నను పథకం ప్రకారమే ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పంపారని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోగటాన్ని రెచ్చగొట్టేలా చేసి, దాన్ని అవకాశంగా తీసుకుని బంగి సుదర్శన్‌తో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాలని కుట్రపూరితంగా పథకం రచించి దాన్ని పక్కాగా అమలు చేశారనే చర్చ జరుగుతోంది.  కోగటంపై టౌన్‌ప్లానింగ్‌ అధికారి ఇసాక్‌ కూడా ఫిర్యాదు చేశారు. ఇసాక్, సుదర్శన్‌లు ఫిర్యాదులు ఇవ్వగానే తక్కిన కథ ఎమ్మెల్యే చౌదరి పోలీసులతో నడిపించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ కార్పొరేటర్‌ను  అరెస్టు చేయని పోలీసులు
జన్మభూమి ఘటన తర్వాత ఆడిటర్‌ గంగిరెడ్డి ఇంటి వద్దకు కోగటం వెళ్లారు. అక్కడ లక్ష్మిరెడ్డి అనుచరులు హడావుడి చేశారు. ఇది తెలిసి కోగటం అనుచరులు రవి, చిన్న ఆంజనేయులుతో పాటు పలువురు వెళ్లారు. వీరిని దారి మధ్యలోనే లక్ష్మిరెడ్డి, నాగరాజు, గోవింద్, కార్తిక్‌లు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. వారిలో ఆంజనేయులు మాలమహానాడు నాయకుడు. ఇతన్ని లక్ష్మిరెడ్డి కులంపేరుతో దూషించినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో లక్ష్మిరెడ్డితో పాటు తక్కిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కానీ వీరిని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు. కారణం ఎమ్మెల్యే మనిషి కావడమే. పోలీసుల పక్షపాత వైఖరికి ఇది తాజా ఉదాహరణ.

ఎవరికి వారే బాస్‌లు
జిల్లా పోలీసు శాఖలో దాదాపు అన్ని స్థాయిల అధికారులు ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల సిఫారసులతోనే పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. దీంతో కేసుల నమోదలో పారదర్శకత లోపిస్తోంది. క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలకు కొత్త కథ అల్లి ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలు ఎస్పీకి చెప్పడం.. ఎస్పీ కూడా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా విశ్వసించడం సమస్యకు కారణమవుతోంది. ఈ కోవలోనే అధికార పార్టీ నేతలపై వరుస అక్రమ కేసులు నమోదవుతున్నాయనేది వైఎస్సార్‌సీపీ నేతల ఆరోపణ. ఒక్కోసారి ఎస్పీకి వాస్తవాలు తెలిసినా.. అధికార పార్టీని కాదని నిర్ణయం తీసుకుకోలేని పరిస్థితి నెలకొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top