ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏం ఒరగబెట్టారు? | YS Vijayamma Fires On Chandrababu Naidu In Election Campaign | Sakshi
Sakshi News home page

ఈ ఐదేళ్లలో ఏం ఒరగబెట్టావని ఓటు అడుగుతావ్‌?

Mar 31 2019 4:18 AM | Updated on Mar 31 2019 10:16 AM

YS Vijayamma Fires On Chandrababu Naidu In Election Campaign - Sakshi

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ

ఈ రోజు ప్రతి ఒక్కరిని రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104,
పంటలకు గిట్టుబాటు ధరలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు..ఇలా ప్రతి ఒక్కటీ గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా.

యర్రగొండపాలెం: ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం ఒరగబెట్టావని మళ్లీ ఓటు అడుగుతావంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ధ్వజమెత్తారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన 650 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా అని సూటిగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేశావా.. డ్వాక్రా అక్కచెల్లమ్మలను ఆదుకున్నావా అని నిలదీశారు. కనీసం యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా అని మండిపడ్డారు. వైఎస్సార్‌ హయాంలో 70 శాతం పనులు అయిపోయిన వెలిగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయావ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన బహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు. ఆమె ఏం మాట్లాడారంటే..

వైఎస్సార్‌ పాలన ఒక్కసారి గుర్తుచేసుకోండి..
ఎన్నికలు రానే వచ్చేశాయి. కేవలం 12 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరిని రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104,  పంటలకు గిట్టుబాటు ధరలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు.. ఇలా ప్రతి ఒక్కటీ గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టమని మీ అందర్నీ కోరుతున్నా. 

ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా?
ఈ రోజు రాష్ట్రంలో అన్యాయం, అక్రమం, అబద్ధం, మోసమే రాజ్యమేలుతోంది. నాయకుడనేవాడు తాను చేసినవి చెప్పాలి. 2009 ఎన్నికలప్పుడు రాజశేఖరరెడ్డి గారు అదే చేశారు. తాను చేసినవన్నీ చెప్పి.. ప్రజల్ని ఓటు అడిగారు. చంద్రబాబుకు అసలు ఓటు అడిగే హక్కు ఉందా? 40 ఏళ్ల అనుభవముందని, ఈ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేస్తానని చంద్రబాబు గత ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చారు. దాదాపు 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడు. కనీసం రైతు రుణమాఫీ కూడా చేయలేదు. రాజశేఖరరెడ్డి గారు రైతులకు బీమా ఇచ్చాడు. మరి బాబు ప్రభుత్వంలో ఏ రైతుకైనా బీమా వచ్చిందా? గిట్టుబాటు ధరలొచ్చాయా?

బాబు 16 సార్లు వచ్చినా.. ‘వెలిగొండ’ 16 ఇంచులు కూడా కదల్లేదు
ఈ జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖరరెడ్డి గారు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పనులను 70 శాతం పూర్తి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం గానీ, చంద్రబాబు ప్రభుత్వం గానీ ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందా? ఈ జిల్లాకు చంద్రబాబు 16 సార్లు వచ్చాడు. కానీ ప్రాజెక్టు పనులు మాత్రం కనీసం 16 ఇంచులు కూడా కదల్లేదు. తాగునీరు, సాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. వీరికి కూడా చంద్రబాబు న్యాయం చేయలేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ న్యాయం చేస్తామని జగన్‌ మీ అందరికీ చెప్పమన్నాడు.   

రుణమాఫీ పేరిట దగా..
రైతు రుణమాఫీ చేస్తానని గత ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతుల రుణాలు రూ.87 వేల కోట్లుండేవి. వాటిని మాఫీ చేయకపోవడంతో అవి రూ.1.50 లక్ష కోట్లకు చేరాయి. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. ఇప్పుడు మళ్లీ పసుపు కుంకుమ అని చెబుతున్నాడు. ఇదైనా ఎవరికైనా అందిందా అంటే.. అదీ లేదు. చంద్రబాబు.. మీ భవిష్యత్‌–నా భద్రత అని చెబుతున్నాడు. అసలు ఎక్కడ ఉంది భద్రత?   

వైఎస్సార్‌ ప్రాజెక్టులకు బాబు గేట్లు ఎత్తుతున్నాడు.. 
చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతల్లో పశువుల్లా కొన్నాడు. కానీ జగన్‌ రాజీనామాలు చేశాకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన వద్దకు రానిచ్చేవాడు. అలాంటి విలువలు చంద్రబాబులో లేవు. ఈ ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదు. పోలవరానికి వైఎస్సార్‌ జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు తీసుకొచ్చినా చంద్రబాబు దాన్ని కట్టలేపోయాడు. వైఎస్సార్‌ జలయజ్ఞం ప్రారంభించి ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేస్తే.. వాటికి నేడు చంద్రబాబు గేట్లు ఎత్తి అంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. వైఎస్సార్‌ సువర్ణ పాలన మళ్లీ అందించాలని, నవరత్న పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని జగన్‌ తపిస్తున్నాడు. 

ప్రత్యేక హోదా రావాలంటే వైఎస్సార్‌సీపీ గెలవాలి..
జగన్‌కు మీరిచ్చే ఆదరణ చంద్రబాబుకు నచ్చటం లేదు. అందుకే జగన్‌ను అంతం చేయడానికి ప్రయత్నించారు. ప్రజల ఆశీర్వాదాలే జగన్‌ను రక్షించాయి. 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తానంటే వారికే జగన్‌ మద్దతిస్తాడు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందర్నీ గెలిపించండి. ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని, యర్రగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. 

జగన్‌ పోరాడితే గానీ బాబుకు ‘హోదా’ గుర్తుకు రాలేదు..  
వైఎస్సార్‌ను, జగన్‌ను మీ గుండెల్లో పెట్టుకున్నారు. రాజశేఖరెడ్డిగారు కూడా మీ సంక్షేమమే కోరుకున్నారు. ఈ కుటుంబమెప్పుడూ మీకు రుణపడి ఉంటుంది. జగన్‌ ఈ తొమ్మిదేళ్లపాటు మీతోనే ఉన్నాడు. మీకు ఏ సమస్య వచ్చినా పోరాటం చేశాడు. ప్రత్యేక హోదా కోసం అనేక ధర్నాలు, దీక్షలు చేశాడు. కానీ చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశారని ఓటు అడుగుతారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? దాని కోసం ఒక్క పోరాటమైనా చేశాడా? ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే ముద్దు అని అనలేదా? జగన్‌ ప్రతి జిల్లాకు తిరిగి ప్రజలందర్నీ చైతన్య వంతుల్ని చేయకపోతే.. ఈరోజు ప్రత్యేక హోదా సజీవంగా ఉండేదా? జగన్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో  రాజీనామాలు చేయించాడు. 14సార్లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. ఇన్ని చేస్తే గానీ చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement